ఇసుక దోపిడీదారులతో లింకులు | YS Jagan Mohan Reddy comments on Sand smuggling | Sakshi
Sakshi News home page

ఇసుక దోపిడీదారులతో లింకులు

Published Thu, Mar 31 2016 2:12 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

ఇసుక దోపిడీదారులతో లింకులు - Sakshi

ఇసుక దోపిడీదారులతో లింకులు

♦ దోచుకున్నవారంతా అధికార పార్టీ నాయకులే
♦ రూ.2,000 కోట్ల కుంభకోణమని సాక్షాత్తూ ఆర్థికమంత్రే చెప్పారు
♦ మరి దోషులపై చర్యలేవీ?
♦ శాసన సభలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక దోపిడీదారులంతా అధికార పార్టీ వారేనని, జిల్లాల్లో ఈ వ్యవహారంతో సంబంధం నేతలతో ఇద్దరు బాబులకు సంబంధాలున్నాయని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఇసుక దోపిడీపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రూ.2,000 కోట్ల ఇసుక కుంభకోణం ఈ ప్రభుత్వం హయాంలోనేజరిగిందని ఇదే సభలో ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారికంగా చెప్పారని గుర్తుచేశారు.

గత ప్రభుత్వ హయాంలో క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.40 ఉండగా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.550 నుంచి రూ.600 వరకూ పెంచారని చెప్పారు. అంటే ధర 12 రెట్లు పెరిగిందన్నారు. దీని ప్రకారం ఇసుకపై ప్రభుత్వ ఆదాయం పన్నెండు రెట్లు పెరగాలి, కానీ అదే దామాషాలో ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. ఆదాయం ఎందుకు పెరగలేదు అని లెక్కిస్తే.. మిగిలినదంతా దోపిడీకి గురైందని ఎవరు చెప్పినా చెప్పకపోయినా తేలిపోతుందని అన్నారు. మరి ఇంత భారీస్థాయిలో ఇసుక కుంభకోణం జరిగితే దోషులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎవరిని పట్టుకున్నారో చెప్పాలని నిలదీశారు. నిజంగా ఇసుక దోపిడీ చేసే వారంతా అధికార పార్టీ నాయకులేనని మండిపడ్డారు. ఈ కుంభకోణాల్లో నాకింత.. నీకింత అంటూ జిల్లాల్లో పలుకుబడి ఉన్న నాయకుల నుంచి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడికి, చంద్రబాబుకు సంబంధాలున్నాయని దుయ్యబట్టారు.
 
 అవినీతి కట్టడి ఇలాగేనా?: కాకాణి
 ఇసుక అక్రమ తరలింపు కేసులో తాను పట్టించిన నాలుగు ఇసుక లారీలకు రూ.1.85 లక్షల జరిమానా వేయాల్సి ఉంటే కేసును మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు పంపించి రూ.24 వేల జరిమానాతో సరిపెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి విమర్శించారు. అవినీతిని కంటిచూపుతో చంపేయడమంటే ఇదేనా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాల ముసుగులో టీడీపీ నాయకులు ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు ద్వారా వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకునేందుకు ఉచిత ఇసుకను తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. ఇసుక కుంభకోణం అతి పెద్దదని చెప్పారు. ఇసుక దోపిడీకి సంబంధించిన ఆధారాలు ఇస్తున్నానని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమాలపై మొత్తం ఆధారాలను ఆయన వివరించారు.

 డ్వాక్రా సంఘాలను ముంచారు: దాడిశెట్టి రాజా
 ఇసుక ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాలకు ఇస్తామని ప్రచారం చేసి, ఒక్క సంఘానికి కూడా ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. డ్వాక్రా సంఘాలను ముంచి, ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో మళ్లీ పాత మాఫియాను లేపారని ఆరోపించారు. రిజర్వాయర్లలో యథేచ్ఛగా సాగిస్తున్న ఇసుక తవ్వకాలతో నీరు బురదగా మారుతోందని చెప్పారు. తన పొలంలో కూడా మాఫియా గ్యాంగులు ఇసుక తవ్వి తరలిస్తున్నాయని పేర్కొన్నారు.
 
 ‘ఉపాధి’పై సభను తప్పుదోవ పట్టించిన సీఎం
 అసెంబ్లీ జీరో అవర్‌లో విపక్షనేత వైఎస్ జగన్ ధ్వజం
 
 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్)లోని మెటీరియల్, లేబర్ కాంపొనెంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సభను తప్పుదోవ పట్టించారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్యానల్ స్పీకర్ చాంద్‌బాషా(వైఎస్సార్‌సీపీ) సభాపతి స్థానంలో ఉన్న సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నిన్న(మంగళవారం) ఎన్‌ఆర్‌ఈజీఎస్‌పై సభలో కొన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడారన్నారు. ఈ మేరకు ఉపాధి హామీ చట్టం 43వ పేజీలో పేర్కొన్న నిబంధనను ఆయన చదివి వినిపించారు.

దానిప్రకారం లేబర్ కాంపొనెంట్ కనీసంగా 60 శాతంగా ఉండాలని, మెటీరియల్ కాస్ట్ మాత్రం 40 శాతానికి మించకూడదని ఉందన్నారు. దీనర్థం లేబర్ కాంపొనెంట్(కూలీల వేతనాలకు చేసే వ్యయం) కచ్చితంగా 60 శాతానికి మించి కూడా ఉండొచ్చని, చట్టం కూడా స్పష్టంగా అదే చెబుతుంటే చంద్రబాబు మాత్రం వాస్తవాన్ని వక్రీకరించారన్నారు. సభను తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు మాట్లాడారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉపాధి హామీ పథకం కింద లేబర్ కాంపొనెంట్ 97.54 శాతంగా ఉందని ఆయన గుర్తు చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను పూర్తిగా కూలీలకే వైఎస్ వ్యయం చేశారని ప్రతిపక్ష నేత తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement