దేశం మరో దుశ్చర్య!
► వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి గేరా సుబ్బయ్య, ఇద్దరు కుమారులపై హత్యాయత్నం కేసులు
► ఆయన కనిపించకపోవడం వెనుక పోలీసుల హస్తం ?
► చీరాల వెళ్లిన సమయంలో అదుపులోకి తీసుకున్నారని భార్యకు ఫోన్‌లో తెలిపిన సుబ్బయ్య
► అంబేడ్కర్ జయంతి రోజు పొన్నూరులో జరిగిన గొడవపై టీడీపీ ముఖ్యనేత పోలీసులను ఉసిగొల్పారనే ఆరోపణలు
అక్కడ టీడీపీ నియోజకవర్గ ముఖ్యనేత చెప్పిందే వేదం.. అన్యాయమని ఎవరైనా నోరెత్తితే వారిపై అక్రమ కేసులు బనాయిస్తారు.. పోలీసుల చేత రౌడీషీట్‌లు తెరిపించి వేధింపులకు గురి చేస్తారు.. పోలీసులు సైతం ఆయన కనుసన్నల్లో పనిచేస్తూ పోస్టింగ్‌లు ఇప్పించినందుకు తమ స్వామి భక్తిని చాటుకుంటుంటారు. ఆయనను ఎవరైనా ఎదిరిస్తే .... పోలీసుల కళ్లు వారిపై నిప్పులు కక్కుతాయి. ఆపై అక్రమ కేసుల్లో ఇరికించి లాఠీలతో కుళ్లబొడుస్తాయి...ప్రతిపక్ష పార్టీ నాయకులనైతే ఏకంగా మాయం చేస్తాయి..! - సాక్షి, గుంటూరు
సాక్షి, గుంటూరు : టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పొన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న దౌర్జన్యకాండకు అంతు ఉండడం లేదు. అంబేడ్కర్ సాక్షిగా దళిత నాయకుడు గేరా సుబ్బయ్యపై మోపిన అక్రమ కేసులు అధికారపార్టీ నేత దాష్టికాలకు నిదర్శనాలుగా చెప్పుకుంటున్నారు.
ఇదీ నేపథ్యం...
ఈ నెల 14న అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరారు. విగ్రహానికి దండలు వేసి నివాళులర్పిస్తున్న సమయంలో కొందరు టీడీపీ నేతలు అక్కడకు వచ్చి ఎమ్మెల్యే వచ్చే వరకు ఎవరూ పైకి ఎక్కవద్దంటూ గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అంబేడ్కర్ యూత్‌లో సభ్యునిగా ఉన్న గేరా సుబ్బయ్య సైతం ఇది అన్యాయం అంటూ వారిని ప్రశ్నించారు. విగ్రహానికి దండవేసి నివాళులర్పించడానికి దళితులకు హక్కు లేదా అంటూ నిలదీశారు.
గేరా సుబ్బయ్య వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కావడం, గతంలో నియోజకవర్గ ముఖ్యనేత సోదరుడు చేస్తున్న ఇసుక, మట్టి, కేబుల్ దందాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాడనే కక్షతో ఆయనపై పలు అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్ కూడా తెరిచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా అంబేడ్కర్ సాక్షిగా జరిగిన సంఘటనను సైతం రాజకీయంగా వాడుకునేందుకు టీడీపీ ముఖ్యనేత పథక రచన చేశారు. ఓ పోలీస్ అధికారి సహకారంతో దళిత నాయకుడైన గేరా సుబ్బయ్య, ఆయన ఇద్దరు కుమారులపై అక్రమ కేసులు బనాయించారు. జరిగిన గొడవతో వైఎస్సార్‌సీపీకి సంబంధం లేకపోయినా అందులో సుబ్బయ్య, ఆయన ఇద్దరు కుమారులను ఇరికించడమే కాకుండా హత్యాయత్నం (307) కేసు నమోదు చేయించారు. ఆ తరువాత బంధువుల ఇంటికి చీరాల వెళ్ళిన సుబ్బయ్యను రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన్ను ఎక్కడ ఉంచిందీ ఎవరికీ తెలియనీయకుండా పోలీసులు డ్రామా ఆడుతున్నారు. పైకి మాత్రం తాము సుబ్బయ్యను అదుపులోకి తీసు కోలేదని చెబుతున్నారు.
అయితే సుబ్బయ్య స్వయంగా తనకు ఫోన్ చేసి తాను పోలీసుల అదుపులో ఉన్నట్లు చెప్పాడని ఆయన భార్య రత్నకుమారి చెబుతున్నారు. దీంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్బయ్యను వెంటనే కోర్టులో హాజరుపర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వైఎస్సార్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ తెలిపారు. టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యకాండకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.