- టీడీపీ నేతలకు దళిత నేతల సవాల్
- ఇసుక దందాను ప్రశ్నిస్తే ఎస్సీలపై దాడిగా చిత్రీకరిస్తారా?
తుని రూరల్ : ఇసుక దందా చేస్తున్న టీడీపీ నేతలు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఎదుర్కోలేక ఎస్సీల సమస్యగా చిత్రీకరిస్తున్నారని, ధైర్యం ఉంటే ఎమ్మెల్యేను నేరుగా టీడీపీ నాయకులు పోల్నాటి శేషగిరిరావు, చింతంనీడి అబ్బాయి ఎదుర్కోవాలని దళితనేతలు సవాల్ విసిరారు. బుధవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శులు గారా శ్రీనివాసరావు, పెదపాటి అమ్మాజీ, కౌన్సిలర్ చితకల రత్నకుమారి, నాయకులు బోడపాటి శ్రీను, శివకోటి ప్రకాష్, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తే సంఘటనా స్థలాన్ని(ర్యాంపు) పరిశీలించారని, అప్పటికి అక్కడ ఉన్న ఇసుక ట్రాక్టర్లను నిలిపివేసి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగానికి ఫోన్ ద్వారా తెలిపారన్నారు. ఇదేదో ఎస్సీల సమస్యగా గ్రామ సర్పంచ్ భర్త, మరి కొంత మంది వచ్చి దాడి చేసి, అట్రాసిటీ కేసులు పెట్టడడం అన్యాయమన్నారు.
దళితుల ఓట్లతోనే ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా 18 వేల ఓట్లు మోజార్టీతో గెలుపొందారని, దాన్ని జీర్ణించుకోలేని టీడీపీ అగ్రనేతలు ఎస్సీల మధ్య చీలిక తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుట్ర రాజకీయాలు మాని కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. కౌన్సిలర్లు కర్రి అమలావతి, మర్రా సత్యవతి, సర్పంచ్ జిగటాల వీరబాబు, ఎంపీటీసీ సభ్యులు గరిశింగు శివలక్ష్మి, గుండబిల్లి లోవరాజు, పలివెల లోవకుమారి, కోడి గంగతల్లి, సవలం సత్యనారాయణ, బోడపాటి రాణి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లేటి అచ్చారావు, నాయకులు బ్రర్రే అప్పారావు, శివకోటి సింహాచలం, బూర్తి కృష్ణ, బూర్తి విక్టర్, నేపా నూకరాజు పాల్గొన్నారు.