విలేకరులతో మాట్లాడుతున్న కంగాటి శ్రీదేవి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆయన ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గారు. అందువల్లే కేఈ శ్యామ్‌బాబును అరెస్టు చేయడం లేద’ని వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. ఆమె మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది మే 21న జరిగిన చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడి జంట హత్యల కేసులో డోన్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న కేఈ శ్యామ్‌బాబు, ఆస్పరి జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్‌ఐ నాగతులసీ ప్రసాద్‌లను రాజకీయ ప్రమేయంతో చార్జిషీటు నుంచి తొలగించడంతో హైకోర్టు సూచన మేరకు తాము డోన్ కోర్టులో ప్రైవేట్ కేసు వేశామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న డోన్ కోర్టు మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారన్నారు. నారాయణరెడ్డి హత్య కేసులో పోలీసులు తొలగించిన వారి ప్రమేయం ఉందంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ మార్చి ఒకటో తేదీలోపు అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చారన్నారు. కోర్టు తీర్పు ఇచ్చి సుమారు 40 రోజులు గడిచినా.. నిందితులు ఎక్కడుండేదీ పోలీసులకు తెలిసినా పట్టించుకోవడంలేదన్నారు.
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
హంద్రీ నదిలో ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకోవడానికి ఆనాడు హైకోర్టు నుంచి స్టే తేవడాన్ని సహించలేని వారు నారాయణరెడ్డి, సాంబశివుడులను హత్య చేశారని అన్నారు. హంద్రీ చుట్టపక్కల ఉన్న రైతుల బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోతుండడంతో ఇసుక మాఫియా ఆగడాలను నారాయణరెడ్డి అడ్డుకున్నారన్నారు. నేడు మళ్లీ నారాయణరెడ్డి హంతకులు ఇసుక దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు స్టే ఇచ్చినా యథేచ్ఛగా ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని అర్డీఓ, తహశీల్దార్, ఎస్‌ఐ, డీఎస్పీ, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇసుక మాఫియాతో తమ కుటుంబం, అనుచరులకు ప్రాణగండం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియాకు అడ్డువేయాలని, నారాయణరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న కేఈ శ్యామ్‌బాబు, బొజ్జమ్మలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్యామ్‌రెడ్డి, పోతురెడ్డి, శ్రీరామరెడ్డి, శ్రీనాథరెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment