టీడీపీ రక్తకేళి! | TDP political murder | Sakshi
Sakshi News home page

టీడీపీ రక్తకేళి!

Published Mon, May 22 2017 2:00 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

టీడీపీ రక్తకేళి! - Sakshi

టీడీపీ రక్తకేళి!

కర్నూలు జిల్లాలో అధికారపార్టీ దుర్మార్గం
పత్తికొండ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నారాయణరెడ్డి హతం


దారుణం.. దుర్మార్గం.. మాటలకందని మహా క్రౌర్యం..అధికారాన్ని అడ్డుపెట్టుకుని హత్యారాజకీయాలనుఎగదోస్తున్న తెలుగుదేశం పార్టీ అకృత్యాలకిది పరాకాష్ట. మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకున్నఅధికారపార్టీ.. దాడులు, హత్యలతో మారణహోమం సృష్టిస్తోంది. ఇపుడు ఏకంగా ఓ నియోజకవర్గ ఇన్‌చార్జి నారాయణరెడ్డిని మాటువేసి హత్యచేసే నీచానికి ఆ పార్టీ నాయకులు తెగబడ్డారు. ఓ శుభకార్యానికి వెళుతుండగా దారికాచి అత్యంత పాశవికంగా హత్య చేశారు.. మరణించిన తర్వాత కూడా కసికొద్దీ కొడవళ్లతో నరికారు.. రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం నాయకులు ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారని, రాక్షసంగా వ్యవహరించగలరని ఈ హత్యోదంతం రుజువు చేస్తోంది.

సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరకులపాడు నారాయణరెడ్డిని ఆదివారం అత్యంత పాశవికంగా హత్యచేశారు. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి హతమార్చారు. ఉదయమే నంద్యాలకు వెళ్లి ఒక శుభకార్యంలో పాల్గొన్న నారాయణ రెడ్డి... అక్కడి నుంచి వెల్దుర్తి చేరుకుని కొత్త దంపతులను ఆశీర్వదించారు. అనంతరం కోసానపల్లెకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించి హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఆయన సొంతగ్రామం చెరకులపాడు మీదుగా రామకృష్ణాపురం చేరుకోవాల్సి ఉంది.

చెరకులపాడు దాటిన తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో కల్వర్టు పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని దాడికి అనువైన ప్రాం తంగా ప్రత్యర్థులు ఎంపిక చేసుకున్నారు. అక్కడ కల్వర్టు పనుల కోసం ఏర్పాటు చేసిన సిమెంటు పైపుల్లో కొంత మంది దాక్కున్నారు. మరికొంత మంది రోడ్డు పక్కనే ఉన్న బెండకాయ తోటలో ఉన్నారు. ఇక మిగి లిన వారిలో కొంత మంది పొలంలో ట్రాక్టరుతో పని చేయిస్తున్నట్టు ఉన్నారు. మరికొంత మంది కల్వర్టు పని కోసం ట్రాక్టర్‌ను నిలుపుకున్నట్టు నటించారు.

రాళ్లతో దాడి చేసి.. వెంటాడి నరికారు..
నారాయణ రెడ్డి వాహనంతో పాటు ముందుగా మరో వాహనం వెళుతోంది. మొదటి వాహనం కల్వర్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకోగానే పెద్దపెద్ద రాళ్లతో దాడి మొదలు పెట్టారు. దీంతో ముందు వాహనంలోని వారు వేగంగా ముందుకు కదిలారు. ఇదే సందర్భంలో నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి ఒక ట్రాక్టర్‌... ముందు నుంచి మరో ట్రాక్టర్లతో గుద్ది ముందుకు వెళ్లకుండా దుండగులు అడ్డగించారు. రాళ్లు విసురుతూ కారు అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం ఆయన తల పై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో బలంగా మోది హత్య చేశారు. ఈ దాడిలో ఆయన తల వెనుక భాగం పూర్తి గా ఛిద్రం కాగా... మెదడు ఊడి కారులో పడిపోయింది. ఆయన చనిపోయాడని గుర్తించిన తర్వాత కూడా వాహనం నుంచి బయటకు ఈడ్చివేసి మరీ కత్తులతో నరికారు.

ఈ దాడిలో నారాయణరెడ్డి అనుచరుడు సాంబశివుడు కూడా హత్యకు గురయ్యారు. దాడిలో పాల్గొన్న వారిలో కొందరు ముఖానికి గుడ్డలు కట్టుకుని ఉన్నారు. తనపై దాడి జరుగుతున్నదని గమనించిన వెంటనే నారాయణ రెడ్డి.... ‘మీరు వెళ్లి ప్రాణాలు కాపాడుకోండి’అని తనతో పాటు వాహనంలో ఉన్న వారిని హెచ్చరించారని సమాచారం. అయి తే, నారాయణరెడ్డిని కాపాడేందుకు ఆయన అనుచరుడు సాంబశివుడు ప్రయత్నించారు. దీంతో కొందరు దుండగులు సాంబశివుడిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన్ను కూడా కత్తులతో నరికి చంపేశారు. సాంబశి వుడి మృతదేహం ఘటనాస్థలానికి 100 మీటర్ల దూరంలో పడి ఉంది. నారాయణరెడ్డిని కాపాడేందు కు జరిగిన పెనుగులాటలో కొందరు దుండగులను అక్కడివరకు నిలువరించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మొత్తం 20 నుంచి 25 మంది వరకూ పాల్గొని ఉంటారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.

ఆధారాల కోసం జాగ్రత్తలు తీసుకోని పోలీసులు
హత్య జరిగిన తర్వాత సాధారణంగా ఆ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుంటా రు. అక్కడకు ఎవ్వరినీ రానివ్వకుండా ఆధారాల కోసం అన్వేషిస్తారు. తద్వారా హత్య చేసిన నిందితులకు సంబంధించిన వేలిముద్రలు, ఇతర ఆధారాలు ఏమైనా లభించే అవకాశం ఉంటుంది. అయితే, నారాయణ రెడ్డి హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించలేదు. ఘటనా స్థలంలో వందలాది మంది జనం కలియతిరిగారు. అంతేకాకుండా దాడికి గురైన వాహనంలోకి కూడా అందరూ తొంగి చూస్తూ కనిపించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో హత్య జరిగితే మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో పోలీసులు వేలిముద్రల కోసం ప్రయత్నించారు. దీనిని బట్టి ఈ హత్య విషయంలో పోలీసులు ఎంత ఆషామాషీగా వ్యవహరించారో అర్ధం చేసుకోవచ్చు.

పోలీసుల ఆలస్యంతో జరగని పోస్టుమార్టం
నారాయణ రెడ్డి హత్య ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది. నారాయణ రెడ్డితో పాటు వేరే వాహనంలో ప్రయాణించిన వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, క్లూస్‌ టీం, డాగ్స్‌ టీం రావడానికి చాలా ఆలస్యం జరిగింది. హత్య జరిగిన రెండు గంటల తర్వాత హాస్పిటల్‌కు నారాయణ రెడ్డి మృతదేహాన్ని తరలించారు. ఆదివారం కావడంతో ఒంటిగంట వరకు మాత్రమే పోస్టుమార్టం చేస్తామని, ఆ సమయం దాటిపోయింది కాబట్టి ఆదివారం ఇక పోస్టుమార్టం చేయబోమని వైద్యులు స్పష్టం చేశారు. దాంతో ఆదివారం నారాయణరెడ్డి మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది. పోస్టుమార్టం సోమవారం ఉదయం చేయనున్నారు. పోలీసులు కావాలనే ఆలస్యం చేశారని, అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతోనే ఈ ప్రక్రియ ఆలస్యంగా సాగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఆదివారం మొత్తం కుటుంబ సభ్యులకు కనీసం మృతదేహాన్ని చూసుకునే అవకాశమే లేకుండా పోయింది.

15 మందిపై కేసు నమోదు ఎ – 14గా కేఈ శ్యాంబాబు
కృష్ణగిరి: పత్తికొండ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ చెరుకుల పాడు నారాయణరెడ్డి, సాంబశివుడు హత్య కేసుకు సంబంధించి 15 మందిపై కేసు నమోదు చేసినట్లు కృష్ణగిరి ఎస్‌ఐ సోమ్లానాయక్‌ తెలిపారు. చెరుకుల పాడు గ్రామానికి చెందిన గోల్ల క్రిష్ణమోహన్‌ ఫిర్యాదు మేరకు చెరుకులపాడుకు చెందిన రామాంజనేయులు, తొగర్చేడు రామానాయుడు, కోసనాపల్లికి చెందిన రామకృష్ణ, తొగర్చేడుకు చెందిన రామాంజనేయులు, బాలు, చిన్న ఎల్లప్ప, పెద్ద ఎల్లప్ప, వెంకటరాముడు, శ్రీను, చెరుకులపాడుకు చెందిన నారాయణ, రామాంజినేయులు, పెద్ద బీసన్న, రామాంజి నేయులు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు, కప్పట్రాళ్ల బొజ్జమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అయితే కేఈ శ్యాంబాబు ప్రధాన ముద్దాయి అయినప్పటికీ ఎ14గా కేసు నమోదు చేశారని, ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించడం కోసమే పోలీసులు ఇలా తూతూమంత్రంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వేధించి.. వేధించి.. ప్రాణం తీశారు
‘‘రాజకీయ లబ్ధి కోసం మా కుటుంబాన్ని కేఈ కుటుంబం వేధిస్తూ వచ్చింది. వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు స్పందించలేదు. పత్తికొండ నియోజకవర్గంలో నారాయణరెడ్డికి రోజు రోజుకు ఆదరణ పెరగడంతో ఎన్నికల్లో ఇక ఓటమి తప్పదని భావించడంతోనే నా భర్తను హత్య చేయించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగడతారని ఊహించలేదు. పత్తికొండ నియోజకవర్గంలో కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ప్రకటించినప్పటి నుంచి మా కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు పెరిగింది. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేశారు. ఇకపై పత్తికొండ నియోజకవర్గంలో కేఈ కుటుంబాన్ని ఏ ఎన్నికల్లోనూ గెలవనివ్వం. అదే లక్ష్యంగా పని చేస్తా. ప్రాణం ఉన్నంత వరకు కేఈ కుటుంబ ఓటమి కోసమే పని చేస్తా, ఇందుకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్దం.’’    
–నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి


కేఈ సోదరులే కారణం
‘‘ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందుకే మా తమ్ముడు నారాయణ రెడ్డిని హత్య చేశారు. పత్తికొండలో కేఈ అరాచకాలు పెరిగిపోయాయి. కేఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నారాయణ రెడ్డి పోరాడుతున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబుతో పాటు వెల్దుర్తి ఎస్‌ఐ నాగతులసీ ప్రసాద్‌ హత్యలో కీలక పాత్రధారులు. గన్‌మెన్లను ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరినప్పటికీ పట్టించుకోలేదు. గన్‌లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకుని మూడు నెలలు గడిచినా ఇవ్వకపోవడం వల్లే ఈ దారుణం జరిగింది. నెలన్నర క్రితం ఎస్‌పీ, డీఐజీతో పాటు ఇంటెలిజెన్స్‌ డీఐజీని కూడా కలిసి కేఈ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని నారాయణరెడ్డి విన్నవించారు. అయినప్పటికీ ఏం చర్యలు తీసుకోలేదు.’’
    – నారాయణ రెడ్డి సోదరుడు ప్రదీప్‌ రెడ్డి

ట్రాక్టర్లతో గుద్ది ఆపై నరికి చంపారు
మాది రామకృష్ణాపురం. అన్న చెరుకులపాడు నారాయణరెడ్డి, డ్రైవర్‌ ఎల్లప్పతో పాటు నేను. శివరామిరెడ్డి, మల్లికార్జున, పోతుగల్లు వెంకటేష్, సాంబశివుడు, గోవర్దన్‌ జీపులో ఉన్నాం. ముందుగా నంద్యాలలో పెద్దిరెడ్డిగారి రామచంద్రారెడ్డి వారి పెళ్లి చూసుకుని వెల్దుర్తికి వెళ్లాం. అక్కడ క్రిష్ణగిరి వారి పెళ్లి చూసుకుని కోశనపల్లికి వెళ్లాం. అక్కడ ఆంజనేయస్వామి గుళ్లో పూజలు నిర్వహించి, అక్కడ కూడా ఓ పెళ్లికి వెళ్లాం. అనంతరం రామకృష్ణాపురంలో మరో పెళ్లికి వెళ్తుంటే క్రిష్ణగిరికి ఒక కిలోమీటర్‌ దూరంలో మా వాహనాన్ని ట్రాక్టర్‌తో గుద్దారు. వెనుకవైపున ఉన్న మరో వాహనం రాకుండా ట్రాక్టర్‌ అడ్డుపెట్టారు. ఆ తర్వాత మేము ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టేందుకు మరో ట్రాక్టర్‌ తీసుకొచ్చారు. దీంతో మా వాహనాన్ని రహదారి కిందకు తీసుకెళ్లడంతో రాళ్లతో అద్దాలు పగులగొట్టారు. అన్నపై దాడి చేస్తుండగా మేము అడ్డం వెళ్లడంతో మా వెంట పడ్డారు. మమ్ములను తరిమేసి నారాయణరెడ్డి అన్నను రాయితో కొట్టి, వేటకొడవళ్లతో అతి దారుణంగా నరికి చంపారు. దాడిని అడ్డుకున్న సాంబశివుడును సైతం దారుణంగా చంపేశారు.    
–పోతిరెడ్డి, ప్రత్యక్ష సాక్షి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement