సాక్షి ప్రతినిధి, అనంతపురం:గత ఏడాది ఏప్రిల్ 29న రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ ఛాంబర్‌లో పట్టపగలు వైఎస్సార్‌సీపీ కీలక నేత, మాజీ మండల కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డిని టీడీపీ నేతలు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. ‘అనంత’తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. రాప్తాడు మండలంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో భయోత్పాతం కల్పించి, పార్టీని బలహీనపర్చడమే లక్ష్యంగా ఈ హత్య చేసినట్లు ప్రతిపక్ష పార్టీ శ్రేణులు ఆరోపించారు. హత్యలో మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం, మండల కన్వీనర్ దగ్గుబాటి ప్రసాద్ ఉన్నట్లు అప్పట్లో ఆరోపించారు.
♦ గత మర్చి 30న రాప్తాడు నియోజకవర్గం కందుకూరుకు చెందిన శివారెడ్డిని అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు విక్రమ్, బాలకృష్ణలు కాపు కాచి నరికి చంపారు. ఈ హత్య వెనుక మంత్రి పరిటాల సునీత, శ్రీరాం, మురళి, మహేంద్ర హస్తం ఉందని శివారెడ్డి కుమారుడు భానుప్రకాశ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
♦ గత నవంబర్ 12న రామగిరి మండలం పేరూరులో వైఎస్సార్‌సీపీ నేత సుబ్బకృష్ణ దంపతులు పాల కోసం వెళ్లి వస్తున్నారు. స్కూటర్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తు కన్పించింది. దీంతో అక్కడే ఉన్న కొందరు టీడీపీ నేతలు స్కూటర్ ఆపి వారిపై దాడి చేశారు. చేసేది లేక వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే వీరి ఫిర్యాదు తీసుకోవడంతో పాటు అధికార పార్టీ నేతలు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం. పోలీసుల కనుసన్నల్లో రామగిరిలో అధికారపార్టీ సభ్యులు పేట్రేగుతున్నారని విపక్ష పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీఐ యుగంధర్ మంత్రి పరిటాల సునీతకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని అప్పట్లో వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ఏదో ఒక చోట విపక్ష పార్టీ నేతలను నరికి చంపడం, భౌతిక దాడులకు పాల్పడటం పరిపాటిగా మారింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకే అధికార పార్టీ నేతలు విపక్ష పార్టీ నేతలపై అరాచకాలకు బరి తెగించారు. ఘటన జరిగిన ప్రతీసారి విపక్షపార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులు కొన్నిచోట్ల ఏకంగా డీఎస్పీలు పూర్తిగా అధికార పార్టీ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారడంతో అరాచకాలు, హత్యాకాండలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.
అధికారపార్టీ నేతలకు అడ్డేదీ?:కందుకూరులో శివారెడ్డి హత్యను నిశితంగా పరిశీలిస్తే పెద్దనేతల హస్తం ఉందనే విషయం స్పష్టమవుతోంది. శివారెడ్డి తనకు చేతనైన మేర సమాజసేవ చేస్తుండేవారు. గ్రామంలో అతినికి మంచి పేరు ఉంది. మొహర్రం రోజు కూడా తన సొంతడబ్బుతో ఉచితంగా మంచినీరు సరఫరా చేశారు. ఇది చూసిన టీడీపీ నేతలు గ్రామంలో శివారెడ్డి మంచిపేరు సంపాదించారని, గ్రామస్తులంతా అతనితో ఉన్నారని, ఇది రాజకీయంగా టీడీపీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుందని భావించి అదే రోజు తగువు పెట్టుకున్నారు. అకారణంగా గొడవకు దిగడంతో శివారెడ్డికి దిక్కుతోచలేదు. ఇంతలో గ్రామస్తులంతా ఏకమై వివాదరహితుడైన వ్యక్తిపై దాడికి దిగడం ఏంటని వారిని వెంబడించారు. దీంతో అప్పట్లో పరిస్థితి సద్దుమణిగింది. పోలీసులు కూడా ఇద్దరినీ రాజీ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొద్దిరోజుల్లోనే శివారెడ్డి హత్యకు వారు ఉపక్రమించారంటే మంత్రి పరిటాల సునీత, శ్రీరాం, మహేంద్ర, మురళీ ప్రమేయం లేకుండా జరగదని శివారెడ్డి తనయుడు భాను ప్రకాశ్‌రెడ్డితో పాటు విపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా వారిని కేసులో చేర్చకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులపై నమ్మకం సన్నగిల్లుతోందా?:రాప్తాడు నియోజకవర్గంలో ఏదైనా ఘటనజరిగితే టీడీపీ నేతలది తప్పు అని స్పష్టంగా తెలిసినా, గాయపడింది విపక్షపార్టీ సభ్యులని ఆధారాలు ఉన్నా పోలీసులు మాత్రం విపక్ష ర్టీ నేతలపైనే బలమైన కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులు పూర్తిగా అక్కడి టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఉన్నారు. పోస్టింగ్‌లు కూడా వారి సిఫార్సులతోనే దక్కించుకోవడంతో ఏం జరిగినా విపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలదే తప్పు అన్నట్లు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో విపక్షపార్టీ నేతలు ఎస్‌ఐ, సీఐలపై నమ్మకం లేక ఏ ఘటన జరిగినా ఎస్పీని ఆశ్రయిస్తున్నారు. ప్రతీ చిన్న విషయం తన దృష్టికి వస్తుందంటే క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరు ఎలా ఉందో ఎస్పీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
పరిటాల శ్రీరాంపైచర్యలకు వెనుకంజ
వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి గత ఫిబ్రవరి 7న రామగిరి మండలం నసనకోటలో పర్యటించారు. ఆ పంచాయతీకి చెందిన బోయ సూర్యనారాయణ ఉదయం నుంచి సాయంత్రం వరకు చందూ వెంటే నడిచారు. సాయంత్రం అతన్ని కొందరు కిడ్నాప్ చేసి భౌతికంగా చితకబాదారు. చందూ దాడిచేసినట్లు సూర్యంతో కేసు పెట్టించారు. పోలీసులు అదే విధంగా కేసు నమోదు చేశారు. తర్వాత పరిటాల శ్రీరాంతో పాటు టీడీపీ నేతలు కిడ్నాప్ చేసి తనను దారుణంగా కొట్టి తిరిగి చందూపై కేసు పెట్టేలా చేశారని సూరి పోలీసులకు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి చర్యలూ లేవు. కనీసం వైఎస్సార్‌సీపీ కార్యకర్తను, ఆ పార్టీ నేతలే ఎందుకు దాడి చేస్తారు? అని కూడా పోలీసులు ఆలోచించకుండా ఏకపక్షంగా కేసు నమోదు చేయడం చూస్తే అక్కడ ‘పరిటాల స్వామ్యం’ ఏ స్థాయిలో వర్ధిల్లుతోందో ఇట్టే తెలుస్తోంది.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు
♦ 2016 మే 30న కనగానపల్లి మండలం కుర్లుపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడి చేశారు. బాధితులు అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతుంటే పరామర్శించేందుకు రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వెళ్లారు. ఆస్పత్రిలో ప్రకాశ్‌ను హత మార్చేందుకు టీడీపీ నేతలు యత్నించారు. ఏకంగా ఆస్పత్రిలోనే దాడికి దిగారు. అప్పటి డీజీపీ జేవీ రాముడు జిల్లాలో ఉన్నారు. ఆస్పత్రి పక్కనే ఎస్పీ క్యాంపు కార్యాలయం ఉంది. అయినప్పటికీ ప్రకాశ్‌ను హతమార్చేందుకు ఉపక్రమించారంటే ఇక్కడి అధికారపార్టీనేతల ధైర్యం వెనుక కారణం ఏంటో ఇట్టే తెలుస్తోంది.
♦ 2016 సెప్టెంబర్ 2న వైఎస్ వర్ధంతి రోజున కనగానపల్లి మండలం యలకుంట్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. ఇక్కడ కూడా ఎలాంటి చర్యలు లేవు.
♦ 2016 నవంబర్ 16న రాప్తాడు మండలం బండమీదపల్లిలో మంత్రి లోకేశ్ పర్యటనలో భాగంగా ఫ్లెక్సీలు చించేశారనే సాకుతో యర్రగుంటలో ఓ మహిళపై టీడీపీ నేతలు దాడికి దిగారు.
♦ గొందిరెడ్డిపల్లిలో 2017 నవంబర్‌లో భూ సమస్యలతో సర్పంచ్ కుమారుడు బాబయ్య, బంధువులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. వన్నక్క అనే మహిళపై దాడి చేసి గాయపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment