రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలు
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధా
సాక్షి, విజయవాడ : దివంగత వంగవీటి రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. 1988లో వంగవీటి రంగా హత్య ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది, దానికి ఎవరు బాధ్యులు.. ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు అప్పుడు ఎందుకు రాజీనామా చేశారో అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆయన చెప్పారు.
బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు. రంగా హత్య కేసు కొట్టేసినంత మాత్రానా దోషులు నిర్దోషులు కారన్నారు. శాసనసభలో చర్చను దారి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీ పదేపదే సభలో పరిటాల రవి హత్య కేసును తెరపైకి తీసుకువచ్చి జగన్‌ను ముద్దాయి అనడం సరికాదని ఆయన మండిపడ్డారు.
రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలో ఉంటారని, ఆయితే.. ఆయనకు గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదన్నారు. పరిటాల హత్య కేసులో ముద్దాయిలుగా టీడీపీ నేతలు ఆరోపించిన జేసీ బ్రదర్స్‌కు క్లీన్‌చిట్ ఇచ్చి ఎందుకు పార్టీలోకి తీసుకున్నారని ముందుగా మంత్రి పరిటాల సునీత.. చంద్రబాబు ప్రశ్నించాలన్నారు. గతంలో విపక్షంలో ఉన్న టీడీపీ.. జేసీ బ్రదర్స్ దోషులని బల్లగుద్ది మరీ వాదించిందని, ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు మరిచిపోయిందని రాధా ప్రశ్నించారు.
టీడీపీకి నిజంగా హత్యా రాజకీయాలపై మాట్లాడాలని చిత్తశుద్ధి ఉంటే విజయవాడలో జర్నలిస్టు పింగళి దశరథరాం, ఐఎఎస్ అధికారి రాఘవేంద్రరావు హత్యలు మొదలుకొని 1988లో జరిగిన రంగా హత్య వరకు అన్ని కేసులను తిరగదోడి విచారణకు ఆదేశించే సత్తా టీడీపీ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. విజయవాడ నగర టీడీపీ నేత కాట్రగడ్డ బాబుపై గతంలో జరిగిన హత్యాయత్నం ఎవరు చేశారో.. వారు ఏ పార్టీ వారో, దానికి ఎవరు డబ్బు సమకూర్చారో అందరికీ తెలుసునన్నారు. ప్రస్తుతం వారంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని రాధా గుర్తుచేశారు.
హత్యా రాజకీయాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి అధికార పక్షం సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ కుల రాజకీయలను ప్రోత్సహించటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కుల రాజకీయాలను తమ పార్టీ ఏమాత్రం ప్రోత్సహించదని అన్ని వర్గాల ప్రజలను కలుపుకు వెళ్లే పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ అని రాధా చెప్పారు. పదేపదే టీడీపీ నేతలు జగన్‌ను విమర్శిస్తే ఇకపై సహించేది లేదని హెచ్చరించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో టీడీపీ వ్యక్తులు దోషులు కాదా అని ప్రశ్నించారు. కేవలం అసెంబ్లీలో టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని.. చర్చ మొదలు కాగానే పరిటాల హత్యను ప్రస్తావించి సభను పక్కదారి పట్టించారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయే అందరికీ తెలుసునన్నారు. ప్రతిపక్షంగా తాము నిర్మాణాత్మకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నామని ఆయన చెప్పారు.