Vangaveeti Radhakrishna
-
ప్రజల గుండెల్లో రంగా స్థానం నేటికీ పదిలం
విజయవాడ రూరల్: పేదల హక్కుల కోసం కృషి చేసిన వంగవీటి మోహనరంగా మరణించి 34 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో నేటికీ ఆయన చిరస్థాయిగా నిలిచే ఉన్నారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. విజయవాడ సమీపంలోని నున్నలో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ.. 1989లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రంగా శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం జీవించి, వారి కోసమే ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకుడు వీఎం రంగా అన్నారు. ఆయన మరణించి 34 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని పేర్కొన్నారు. డబ్బు సంపాదించాలనే ఆపేక్ష లేని రంగా తనయుడు విజయవాడలో సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేదన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. వీఎం రంగా ప్రజల మనిషని అన్నారు. మూడేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు చేసి 35 సంవత్సరాలుగా ప్రజల మనిషిగా వారి గుండెల్లో నిలిచిపోయారన్నాని, రంగాకు మరణమే లేదని పేర్కొన్నారు. ఆయన తనయుడు రాధాకృష్ణ రాజకీయాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. వీఎం రంగా పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి తోట వెంకయ్య, విగ్రహ దాత కొట్టే రవికుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్వీఆర్, ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జెడ్పీటీసీ కె.సువర్ణరాజు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ యర్కారెడ్డి నాగిరెడ్డి, సర్పంచ్ కాటూరి సరళ పాల్గొన్నారు. -
తండ్రిని చంపి.. కుమారుడిని పరామర్శిస్తారా?
మండపేట: తండ్రిని చంపిన వ్యక్తి.. తనయుడిని పరామర్శించడం సిగ్గుచేటని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు. వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాను చంద్రబాబు పరామర్శించడంపై ఆదివారం తూర్పు గోదావరి జిల్లా మండపేటలో తోట మీడియాతో మాట్లాడారు. రంగా హత్య కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబునాయుడన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. అటువంటి వ్యక్తి రాధాను పరామర్శించడం వల్ల రంగా ఆత్మ మరింత క్షోభిస్తుందని అన్నారు. రంగా అన్ని సామాజికవర్గాలూ అభిమానించే వ్యక్తని, ఆయన దారుణ హత్యకు గురై 35 ఏళ్లు కావస్తున్నా నేటికీ అందరి హృదయాల్లో ఉన్నారని చెప్పారు. ఆయన కుమారుడు రాధా ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. రెక్కీ జరిగిన విషయాన్ని రాధా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే అవసరమైన రక్షణ కల్పిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యేగా ఆయనకు ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పించిందని చెప్పారు. చంద్రబాబు కుటిల రాజకీయాలు తనకు తెలుసునని, బాబు మాటల్లోని మంచి, చెడును ఆలోచించుకుని అడుగులు వేయాలని తన సోదరుడైన రాధాకు సూచన చేస్తున్నానని తోట అన్నారు. -
వంగవీటి రాధాకు ఎలాంటి ముప్పూ లేదు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వంగవీటి రాధాకు ఎలాంటి ముప్పూలేదని, ఆయన భద్రతపై ఎవ రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడ నగర పోలీసు క మిషనర్ టి.కె.రాణా స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాణా మా ట్లాడుతూ.. తనకు ప్రాణహాని ఉంద ని బహిరంగ వేదికపై రాధా చేసిన ప్ర కటనపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేశా మన్నారు. రాధా ప్రకటనతో పోలీస్ విచారణతో సంబంధం లేకుండా ప్రభుత్వం తక్షణమే గన్‌మెన్‌ను ఏర్పా టు చేసిందని చెప్పారు. అప్పటి నుంచి పోలీస్‌శాఖతో పాటు, మల్టిపు ల్ ఏజెన్సీల ద్వారా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశామన్నారు. ఆయన ఇంటి పరిసరాలు, నగరంలోని అన్ని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించినట్లు చెప్పారు. రెక్కీపై నిర్దిష్టమైన ఆధారా లు లేవని తెలిపారు. ఆయన్ని ఇబ్బం దులు పెట్టేలా ఎవరూ ప్రయత్నిం చలేదని, ఆయన ఇంటి వద్ద ఎవరూ రెక్కీ నిర్వహించలేదని వెల్లడైందన్నా రు. అయినప్పటికీ అన్ని కోణాల్లో ఇంకా విచారణ సాగిస్తున్నామని తెలి పారు. దీనిపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని కో రారు. ఈ ఘటనపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు పోలీస్ శాఖపై చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఎలాంటి నేరపూరిత ఘటన జరగని ఈ ప్రకటనపై జీరో ఎఫ్ఐఆర్ నమో దు చేసేందుకు ఆస్కారం లేదని చె ప్పారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. దీనికి భంగం కలిగించొద్దని కోరారు. -
త్వరలో ‘దేవినేని’ మోషన్ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవినేని'.. 'బెజవాడ సింహం' ఉపశీర్షిక. జి.ఎస్.ఆర్, రాము రాథోడ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి తారకరత్న టైటిల్ రోల్లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైనందున డీటీఎస్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ.... ఈ చిత్రంలో నటించిన నటీనటులు అంతా చాలా బాగా నటించారన్నారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ ఆకట్టుకున్నారన్నారు. ఇక దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న పరకాయ ప్రవేశం చేసినట్లు నటించాడని పేర్కొన్నాడు. (చదవండి: అందుకే నటించేందుకు ఒప్పుకున్నా) సురేష్ కొండేటి-వంగవీటి రంగగా మిమ్మల్ని అలరించనున్నాడని, అలాగే సురేంద్ర పాత్రలో ఏంఎన్ఆర్ చౌదరి నటిస్తున్నారని చెప్పారు. దేవినేని మురళిగా తేజా రాథోడ్, దేవినేని గాంధీగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిగిలిన పలు పాత్రల్లో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, ధృవతారలు నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైందని, నేడు డిటీఎస్ కార్యక్రమం జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఈ చిత్రంలో మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ఎస్ వ్యాస్ గారి పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారని తెలిపారు. అయితే దేవినేని సినిమా బెజవాడలో ఇద్దరు మహనాయకుల నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఆ నాయకుల మధ్య స్నేహం, వైరంలో పాటు కుటుంబ నేపథ్యంలో సాగే సెంటిమెంట్‌ను కూడా దర్శకుడు జోడించాడు. ఇక బెజవాడలోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. అలాగే 1983లో విజయవాడకు మొదటి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా వెళ్లిన కేఎస్ వ్యాస్ పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: నర్రా శివ నాగు, నిర్మాతలు: జి.ఎస్.ఆర్, రాము రాథోడ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: కోటి, కో.డైరెక్టర్: శివుడు వ్యవహరిస్తున్నారు. -
జనసేనలోకి వంగవీటి రాధా
సాక్షి,విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ త్వరలో జనసేనలో చేరనున్నారు. మంగళవారం ఉదయం పటమటలోని పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆయన్ను వంగవీటి రాధా కలిసి చర్చలు జరిపారు. సోమవారం కూడా ఆయన చర్చలు జరిపిన విషయం విదితమే. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న రాధా వచ్చే నెల నాలుగు లేదా ఐదు తేదీల్లో ఆ పార్టీ వీడి జనసేనలో చేరతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాగా ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వంగవీటి రాధా ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేశారు. వంగవీటి రాధాకు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తారని ఆయన టీడీపీలో చేరే సమయంలో ప్రచారం జరిగింది. ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో రాధా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా ఇప్పటి వరకు ఆయన ఏపార్టీలోనూ నిలదొక్కుకోలేకపోయారని, పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనరనే ఆరోపణలు ఉన్నాయి. జనసేనలో ఎంతమేరకు నెగ్గుకు వస్తారనేది వేచి చూడాల్సి ఉంది. -
జేసీ చిందులు.. శమంతకమణి కన్నీళ్లు
సాక్షి, అమరావతి: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, శింగనమల ఎమ్మెల్యే యామినీబాలపై చిందులు తొక్కారు. ఇష్టానుసారంగా మాట్లాడారు. వారిని కసురుకుని పక్కకు వెళ్లిపోవాలని బెదిరించారు. ముఖ్య నాయకులందరి ముందు తమను అవమానించడంతో శమంతకమణి ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం పక్కనున్న ప్రజావేదికలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. విశ్వసనీయవర్గాల సమాచారం.. టిక్కెట్ల ఖరారు కోసం ఆశావహులతో చంద్రబాబు చర్చలు జరుపుతున్న ప్రజావేదికలో జేసీ దివాకర్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి తదితరులు కూర్చుని ఉన్నారు. వారిని చూసిన శమంతకమణి, యామినీబాల మర్యాదపూర్వకంగా నమస్కారం చేసేందుకు దగ్గరకు వెళ్లగా జేసీ దివాకర్‌రెడ్డి వారిపై విరుచుకుపడ్డారు. ‘‘మీరేంటి ఇక్కడ.. అవతలికి పోండి’ అంటూ కసురుకున్నారు. ‘అన్నీ మీకే కావాలా’ అంటూ పెద్దగా అరుస్తూ రభస సృష్టించారు. పక్కనే ఉన్న సూర్యప్రకాశరెడ్డి సర్ది చెప్పినా వినకుండా రెచ్చిపోయి వారిద్దరిపై తిట్ల దండకం అందుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన శమంతకమణి, యామినీబాల పక్కకు వెళ్లిపోయారు. నమస్కారం పెడుతుంటే ఇలా అవమానిస్తారా అంటూ శమంతకమణి కన్నీళ్లు పెట్టుకున్నారు. దళిత సామాజికర్గం ప్రజాప్రతినిధులను అవమానిస్తారా? అధికార పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇలా రెచ్చిపోవడానికి శింగనమల టిక్కెట్‌ను మళ్లీ తనకే ఇవ్వాలని యామినీబాల కోరుతుండడమే కారణమని తెలిసింది. ఆ సీటును ఈసారి తాను సూచించిన శ్రావణికి ఇవ్వాలని జేసీ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసేందుకు వేచిచూస్తున్న సమయంలో వారు కనిపించడంతో అగ్గిమీద గుగ్గిలమై వారిని దూషించారు. జేసీ తీరుతో అక్కడున్న మిగిలిన నేతలంతా కంగుతిన్నారు. ఇదేం పద్ధతని గుసగుసలాడుకున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులను ఆయన ఇలా అవమానించడంపై అక్కడున్న నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. టీడీపీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, చీరాలకు చెందిన ఎడం బాలాజీ బుధవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో రాధాకృష్ణకు పసుపు కండువా కప్పి చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. వంగవీటిది ఒక చరిత్రగల కుటుంబమని, ప్రజల కోసం పనిచేసిన కుటుంబమని అన్నారు. రిజర్వేషన్ల కోసం కాపుల పోరాటం సుదీర్ఘమైనదని, వారికి రిజర్వేషన్లు ఇస్తానని పాదయాత్రలో మాట ఇచ్చానని, అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని పేర్కొన్నారు. నేడు టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితా! వచ్చే ఎన్నికల్లో తలపడే టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితాను చంద్రబాబు గురువారం విడుదల చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి. 100 నుంచి 110 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి. ఇందుకోసమే గురువారం పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. -
‘రాధ.. చంద్రబాబు ఇప్పుడు గాంధీ ఎలా అయ్యాడు?’
సాక్షి, తిరుపతి : ఒకప్పుడు వంగవీటి రాధకు గాడ్సేగా కనిపించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు గాంధీగా కనిపించడానికి గల కారణాలు చెప్పాలంటూ వైఎస్సార్ సీపీ నాయకుడు సీ రామచంద్రయ్య డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఇదే వంగవీటి రాధ తన తండ్రిని హత్య చేయించింది టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడేనంటూ ప్రచారం చేసిన సంగతిని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. అప్పుడు రాధకు గాడ్సేగా కనిపించిన చంద్రబాబు.. ఇప్పుడు గాంధీగా ఎలా కనిపిస్తున్నాడో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాక వైఎస్సార్ సీపీ ఇప్పటివరకూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని.. రానున్న ఎన్నకల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు అప్పులు చేసి కుప్పలు పేరిస్తే వాటిని ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. చంద్రబాబులాంటి రాక్షసుడి పాలన నుంచి ప్రజలను కాపాడగలిగే ఏకైక వ్యక్తి వైఎస్ జగన మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. -
నీ తండ్రిని చంపిన పార్టీతో చర్చలా!
సాక్షి, హైదరాబాద్: తన తండ్రి వంగవీటి మోహనరంగాను చంపిన తెలుగుదేశం పార్టీలోకి రాధాకృష్ణ ఏముఖం పెట్టుకుని వెళుతున్నారు? ఆ పార్టీ నేతలతో ఏ విధంగా చర్చలు జరుపుతున్నారు? అని విజయవాడ పార్లమెంటు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ప్రశ్నించారు. రాధా పార్టీని వీడుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌పైనా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రంగా కుటుంబంతో తమకు ఎంతో సాన్నిహత్యం ఉందనీ, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన ఎదుగుదలకు ఎంతగానో సహకరించారని తెలిపారు. అలాంటి రంగాను టీడీపీ నేతలు, గూండాలు ఒక టూరిస్టు బస్సులో టీడీపీ జెండా కట్టుకుని వచ్చి విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ ఉండగా ఘోరంగా నరికి చంపారని ఉదయభాను గుర్తు చేశారు. చంద్రబాబు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని అన్నారు. రంగా హత్య కేసులో దేవినేని నెహ్రూ, వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ ఇతర టీడీపీ నేతలు ముద్దాయిలని, ఈ హత్య వెనుక చంద్రబాబు, అప్పటి హోంశాఖ మంత్రి కోడెల శివప్రసాదరావు కుట్ర ఉందని అప్పటి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో రాసిన విషయం ఆయన గుర్తుచేశారు. ఇదే విషయాన్ని పలు వేదికలపై కూడా జోగయ్య చెప్పారన్నారు. అయినప్పటికీ తన తండ్రి రంగాను చంపింది తెలుగుదేశం పార్టీ కాదు.. కొందరు వ్యక్తులు అని రాధా మాట్లాడటం రంగా అభిమానులకు బాధ కలిగిస్తోందని అన్నారు. రాధా తల్లి టీడీపీలో చేరినప్పుడే రంగా ఆత్మ ఘోషించిందని, తాజాగా రాధా మాటలతో మరింత ఘోషిస్తోందని పేర్కొన్నారు. రంగా విగ్రహావిష్కరణలకు అభ్యంతరం చెప్పలేదు రాధా టీడీపీ కబంధ హస్తాల్లో చిక్కుకొని, వాళ్లు ఇచ్చిన స్క్రిప్టునే మాట్లాడారని ఉదయభాను విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేటప్పుడు తన తమ్ముడిలా చూసుకుంటానని రాధాకు జగన్ చెప్పారని, ఆ మేరకు 2014 ఎన్నికలయ్యాక పార్టీ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. కానీ రాధా ఎక్కడా తిరగడం గానీ, ఒక్క కార్యక్రమం నిర్వహించడం కానీ చేయలేదని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శిని చేసినా చురుగ్గా వ్యవహరించలేదన్నారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించినా ప్రజా సమస్యలపై గానీ, పార్టీ కోసం గానీ ఏ ఒక్క పోరాటం చేయలేదని తెలిపారు. అన్ని పదవులిచ్చినా తనకు జగన్ ప్రాధాన్యత ఇవ్వలేదని రాధా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రంగా విగ్రహావిష్కరణలకు జగన్ అభ్యంతరం చెప్పారనడంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. కృష్ణా జిల్లాలో అందరికంటే రాధాకే జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని, ప్రేమ చూపేవారని ఉదయభాను గుర్తుచేశారు. రాధా అభ్యంతరం వ్యక్తం చేసినందుకే దేవినేని నెహ్రూను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదన్నారు. అదీ రంగా కుటుంబానికి, రాధాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం అన్నారు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్‌ను, జగన్‌ను విమర్శిస్తున్నారంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల మాయ మాటలకు రాధా లొంగి పోయారని, ఆయన ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని సూచించారు. రాధా టీడీపీలోకి వెళ్ళాలనుకోవడం సిగ్గుమాలిన పనిగా అభివర్ణించారు. -
బాబు స్క్రిప్ట్ ప్రకారమే రాధా వ్యాఖ్యలు
విజయవాడ సిటీ: నలభైయ్యేళ్ల అనుభవంతో రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజకీయాలను అతాలాకుతలం చేస్తున్న చంద్రబాబు వలలో వంగవీటి రాధా పడటం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. రంగా హత్యకు టీడీపీకి సంబంధం లేదని రాధా అనడంతో లక్షలాదిమంది రంగా అభిమానులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. గురువారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో పేర్ని నాని విలేకరులతో మాట్లాడారు. వంగవీటి రంగాను హత్య చేసింది తెలుగుదేశం గూండాలని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరిని అడిగినా చెబుతారన్నారు. తెలుగుదేశం గుండాలు హత్యచేసినట్టుగా రంగా అభిమానులు పాటలు కూడా పాడటాన్ని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని, రంగా ఆశయాలను ఆయన నెరవేరుస్తారనే అమాయక స్థితిలోకి వెళ్లవద్దని సూచించారు. పేదలకు ఇళ్లు మంజూరు చేయడమే వంగవీటి రంగా ఆశయం అంటే అది రాధా అమాయకత్వమే అవుతుందన్నారు. ప్రతి పేదవాడికి కష్టంలో అండగా ఉండటమే రంగా ఆశయమన్నారు. పట్టుమని 15 రోజుల్లో అధికారం అంతం కానుండగా పేదలకు చంద్రబాబు ఇళ్లు ఇస్తారని రాధా నమ్మడంపై వంగవీటి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సింహం కడుపున పుట్టిన వంగవీటి రాధా.. చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకోవడం నక్కకు కుందేలు దొరికిన విధంగా ఉందని ఎద్దేవా చేశారు. వంగవీటి రంగా నూటికి నూరుపాళ్లు రాజకీయాలకు అతీతుడని, ఆయన యశస్సు రాజకీయాల కంటే ఉన్నతమైందని పేర్ని పేర్కొన్నారు. అలాంటి రంగా విగ్రహావిష్కరణకు వెళ్లొద్దని వైఎస్ జగన్ ఏనాడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో వాస్తవాలన్నీ తనకు, కొడాలి నానికి తెలుసని చెప్పారు. రాధాకు పొగబెట్టి బయటకు పంపించాలనుకుంటే దేవినేని నెహ్రూను పార్టీలో చేర్చుకునేవారు కదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ గురించైతే మాట్లాడొద్దన్నాడు.. సోషల్ మీడియాలో తనపై వచ్చిన వ్యాఖ్యలపై జగన్ తనతో మాట్లాడలేదని రాధా అనడాన్ని పేర్ని ఖండించారు. జగన్ పీఏ రాధాను కలవాలని ఫోన్ చేస్తే డిసెంబర్ 26వ తేదీ తర్వాత వస్తానని చెప్పారని, రాకపోవడంతో మరొకసారి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ రావడంతో తనను విజయవాడ వెళ్లి గుర్తు చేయాల్సిందిగా కోరారని తెలిపారు. ఆ మేరకు రాధాతో మాట్లాడితే..వైఎస్సార్సీపీ గురించి అయితే తనతో మాట్లాడవద్దని, వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటేనే మాట్లాడమని చెప్పినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను కూడా రాధా వద్దకు పంపించారని వివరించారు. ఎన్నికలు తట్టుకోలేని వాళ్లెందరో వైఎస్సార్సీపీలో ఉన్నారు.. పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదని, జగన్మోహన్రెడ్డే అన్నీ తానై వ్యవహరిస్తాడన్న విమర్శపై పేర్ని స్పందించారు. అంటే మేమంతా ఆత్మగౌరవం లేకుండా, ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నాం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎంత ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీయో ఇటీవల రాష్ట్రానికి వచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను టీడీపీ నాయకులు కలిసినప్పుడు చంద్రబాబు ఇచ్చిన వార్నింగే స్పష్టం చేస్తుందని చెప్పారు. వైఎస్ జగన్ డబ్బులున్నవారికే సీట్లు ఇస్తారనేది సత్యదూరమని,. తనలాంటి ఆర్థికంగా ఎన్నికలు తట్టుకోలేని వాళ్లం చాలా మందిమి పార్టీలో ఉన్నామని పేర్ని తెలిపారు. ఎన్నికల్లో సీట్లు ఎవరికి కేటాయించాలనేది ఆ రాజకీయ పార్టీ వ్యుహాలను బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. -
రంగా హత్యతో టీడీపీ ప్రభుత్వానికి సంబంధం లేదు
సాక్షి, విజయవాడ : విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగారావు (రంగా) హత్య కేసుతో తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మా నాన్నను తెలుగుదేశం పార్టీ పొట్టన పెట్టుకుందంటూ ఆవేశంగా మాట్లాడానని, ఆవేశంగా అభిమానుల్ని రెచ్చగొట్టానని చెప్పారు. అది కేవలం కొంతమంది వ్యక్తులు చేసిన హత్యగా పేర్కొన్నారు. రాధాకృష్ణ గురువారం బందరు రోడ్డులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రంగా అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, కొంతమంది వ్యక్తులు చేసిన తప్పును పార్టీకి అంటగట్టడం సరికాదని అన్నారు. తన తండ్రి వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణకు వెళితే.. నాకు చెప్పి వెళ్లావా? అక్కడ ఇన్చార్జికి చెప్పావా? అంటూ ప్రశ్నించారని తన తండ్రి విగ్రహవిష్కరణకు ఎవరికి చెప్పి వెళ్లాలని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు తనను పార్టీలోకి ఆహ్వానించారని, అయితే మన్నించమని కోరుతున్నానని చెప్పారు. మీకు రూ.100 కోట్లు ఇచ్చి పార్టీలోకి తీసుకుంటున్నారంట కదా అని విలేకరులు ప్రశ్నించగా ఆ డబ్బు ఎక్కడుందో చూపిస్తే మీకే ఇస్తానన్నారు. ఒకదశలో రాధాకృష్ణ విలేకరులపై సీరియస్ అయ్యారు. బెదిరిస్తున్నట్టుగా మాట్లాడారు. ఆయన అనుచరులు గలాటా సృష్టించారు. ఒక ఆశయంతో ముందుకు వెళ్తున్నామని రాధాకృష్ణ అన్నారు. మీరు తెలుగుదేశంలోకి వెళితే రంగా ఆశయం నేరవేరుతుందా? అని ఒక విలేకరి ప్రశ్నించగా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రంగాకు ఘన నివాళి
విజయవాడ సిటీ/ఉయ్యూరు(పెనమలూరు) : పేదల అభ్యున్నతి కోసం ప్రజా పోరాటాలు చేసిన వంగవీటి రంగాను ఆదర్శంగా తీసుకుని నేటి యువత పనిచేయాలని వైఎస్సార్సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రంగా వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పార్టీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలే పుల్లారావు పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ పేదలకు అండగా నిలిచేతత్వమే ఆయనకు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిపెట్టిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు, బీసీ సెల్ నేత కసగోని దుర్గారావు, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, వైఎస్సార్ విద్యార్థి విభాగం దొడ్డా అంజిరెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పల్లి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నా తండ్రి ఆశయాలు సాధిస్తా.. ‘ప్రజా సేవతో నా తండ్రి మోహనరంగా ఆశయాలను సాధిస్తా..’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. కాటూరులో రాధా–రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో బుధవారం దివంగత వంగవీటి మోహనరంగా వర్ధంతి నిర్వహించారు. రాధా–రంగా స్మరణ భూమిలో స్మృతివనం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. రంగా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాధాకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు, కులమతాలకతీతంగా సేవ చేస్తాన్నారు. చిరస్మరణీయుడు రంగా ప్రజలకు సేవచేసి వారి హృదయాల్లో రంగా నిలిచి ఉన్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. రాధా–రంగా స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో రంగా సతీమణి, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, వైఎస్సార్సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి) తదితరులు పాల్గొన్నారు. రంగా చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ నేతలు -
‘అడ్డుగా ఉన్నారనే రంగాని హతమార్చారు’
సాక్షి, కృష్ణా: పదేళ్ళ వయస్సులో తండ్రిని కోల్పోయానని, ముప్పైఏళ్ళ క్రితం అభిమానులు ఓ నేతను కోల్పోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో వంగవీటి రాధా, రంగా స్మారక భూమికి రాధాకృష్ణా బుధవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగా చనిపోయి మూడు దశాబ్ధాలు అవుతున్నా నేటికీ ఆయన అభిమానులు స్మరించుకుంటున్నారని, వాడవాడలా వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రంగాను నమ్ముకున్న వారిని ఆదుకోవాల్సిన అవసరముందని, ఆయన స్మారకార్ధం సేవా కార్యక్రమాలు చేపడతామని రాధా వెల్లడించారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత రంగా అని, కొందరికి అడ్డుగా ఉన్నారని ఆయనను హతమార్చారని వైఎస్సార్సీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గుర్తుచేశారు. రంగా కార్యకర్తలు, అభిమానుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు యలమంచిలి రవి, యార్లగడ్డ వెంకట్రావు, తుమ్మల చంద్రశేఖర్, రంగా-రాధా మిత్రమండలి సభ్యులు పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. -
వంగవీటి రంగాకు ఘన నివాళులు
సాక్షి, విజయవాడ: మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ.. రాఘవయ్య పార్క్ సెంటర్లో గల రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ‘రాజకీయాలకు అతీతంగా రంగా వర్ధంతి చేస్తున్నాం. నాన్న ఆశయాల కోసం చివరి వరకూ పనిచేస్తా. ఆయనను నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉంటా. వాళ్లకి న్యాయం చెయ్యాల్సి ఉంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది’అని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ నేతలు బొప్పన భవకుమార్, ఆసిఫ్, చందన సురేష్, కాజా రాజ్‌కుమార్, పలువురు రాధా-రంగా మిత్రమండలి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజయవాడ నుంచి కాటూరుకు రాధా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. కాటూరులో వంగవీటి రంగా స్మారక భూమికి రాధా శంకుస్థాపన చేయనున్నారు. -
వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదు
-
వంగవీటి రాధాకు అన్యాయం జరగదు: అంబటి
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదని, తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయని, ఆ పార్టీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తమ పార్టీ అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంగవీటి రాధాకు అన్యాయం చేయాలనే ఆలోచన తమ పార్టీకి లేదన్నారు. ఆయన గతంలో విజయవాడ ఈస్ట్ నుంచి గెలిచారని, అక్కడే ఆయన గెలుస్తారని అధిష్టానం భావిస్తుందన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ స్థానం కూడా ఆప్షన్ ఇచ్చిందన్నారు. దివంగతనేత రంగా అభిమానులు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగంపై స్పందిస్తూ.. చంద్రబాబు టీఆర్ఎస్తో కలిసుందాం అనుకున్నారని చెప్పారు. అలాంటప్పుడు టీఆర్ఎస్ వ్యవహారాల్లో ఎందుకు తలదూర్చారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయి వచ్చారని నిలదీశారు. ఈ కేసు తర్వాత చంద్రబాబు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఒక్కసారైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో రాష్ట్రానికి వస్తే నల్ల జెండాలతో నిరసన తెలిపిన టీడీపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. చౌకబారు రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు. హోదా కోసం కర్నూల్ జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నా ఎందుకు స్పందించడంలేదని దుయ్యబట్టారు. ధర్మాబాద్ అరెస్ట్ వారెంట్‌పై నానా హడావుడి చేస్తున్నారని, మహారాష్ట్ర కోర్ట్ నోటీసులు ఇస్తే ఇక్కడ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
‘కులమతాలకు అతీతంగా రంగా పనిచేశారు’
సాక్షి, విజయవాడ : కులమతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహన రంగా కృషి చేశారని రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వంగవీటి మోహన రంగా 71వ జయంతి సందర్భంగా నగరంలోని రాఘవయ్య పార్క్ వద్ద రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తన తండ్రిని ఆరాధించడం సంతోషంగా ఉందన్నారు. పేదల కోసమే రంగా పనిచేశారని.. అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు. రంగా కుమారుడిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. రాధా రంగా మిత్ర మండలి సభ్యులను కలుపుకొని పని చేస్తానని రాధాకృష్ణ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో.. వంగవీటి మోహన రంగా 71వ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా పేద ప్రజల కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పార్థసారథి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు, పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
’వంగవీటి’వార్ : వర్మ VS రాధ
-
వర్మ మూల్యం చెల్లించుకోక తప్పదు: రాధా
రంగా 28వ వర్ధంతి కార్యక్రమంలో రాధాకృష్ణ కృష్ణలంక (విజయవాడ): చరిత్రను వక్రీకరించి ‘వంగవీటి’ చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. విజయ వాడలో సోమవారం వంగవీటి రంగా 28వ వర్ధంతి జరిగింది. బందరురోడ్డులోని రాఘవయ్య పార్కు సమీపంలో ఉన్న రంగా విగ్రహానికి రాధా కృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వంగవీటి రాధా కృష్ణ మాట్లాడుతూ రాంగోపాల్‌వర్మకు డబ్బే కావాలనుకుంటే రంగా అభిమానులు చందాలు పోగుచేసి వెదజల్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రంగా జీవిత చరిత్ర తెలియని ఆయనను అసలు సినిమా తీయొద్దని, విడుదల చేయొద్దని ముందే చెప్పా నని తెలిపారు. అనంతరం రంగా అభిమానులు భారీ ఊరేగింపు నిర్వహించారు. పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. వంగవీటి కుటుంబాన్ని రెచ్చగొట్టొద్దు అక్కిరెడ్డిపాలెం (విశాఖ): వంగవీటి కుటుంబం పాత కక్షలన్నీ మరిచి ప్రశాంతంగా బతుకుతోందని, తిరిగి ఈ కుటుంబాన్ని రెచ్చగొట్టవద్దని వంగవీటి మోహన రంగ సోదరుని కుమారుడు వంగవీటి మేఘనాథ్ కోరారు. 65వ వార్డు మిందిలో వంగవీటి మోహన రంగ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన వంగవీటి సినిమాపై స్పందించారు. వంగవీటి సినిమాను తీసిన డైరెక్టర్ ఒక మెంటల్ అని, ఆయనకు సహకరించింది మరో మెంటల్ అని తీవ్ర పరుష పదజాలంతో విమర్శించారు. వంగవీటి కుటుంబాన్ని రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని హెచ్చరించారు. సెంటర్ నేను చెప్పను..టైం నువ్వు చెప్పొద్దు వంగవీటి రాధాకృష్ణ వాఖ్యలపై రాంగోపాల్ వర్మ కౌంటర్ సాక్షి, హైదరాబాద్: వంగవీటి రంగ తనయుడు రాధాకృష్ణ వాఖ్యలపై సినీ డైరెక్టర్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. తననేదో చేస్తానన్న రాధా వాఖ్యలపై వర్మ సోమవారం ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘బస్తీ మే సవాల్– సెంటర్ నేను చెప్పను. టైం నువ్వు చెప్పొద్దు’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. రంగ వ్యక్తిత్వాన్ని వక్రీకరించానన్న రాధ వాఖ్యలపై తన సమాధానమిదంటూ వర్మ ట్వీట్ చేశారు. ‘ అన్నదానాలు, ప్రజాసేవ తప్పా వంగవీటి రంగా చీమకైనా హాని చేయని గౌతమ బుద్ధుడని చూపించాలా’ అంటూ ఆయన ప్రశ్నించారు. రంగ వ్యక్తిత్వం గురించి ఆయన అభిమానులు, రంగ భార్య వినడానికి ఇష్టపడని వాస్తవాలను కూడా తాను చూపించగలనని, కానీ రంగపై ఉన్న గౌరవంతో అవి చూపించలేకపోయానని తెలి పారు. రాధాకు దమ్ముంటే ఆ వాస్తవాలను చూపమని తనను డిమాండ్ చేయాలని, అలా చేస్తే కుండబద్ధలు కొట్టినట్లు వాటిని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. సున్నితమైన భావోద్వేగాలను చూపించడానికే ఈ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు. -
'అసలు వంగవీటి'ని మీరే తీసుకోండి
హైదరాబాద్: వంగవీటి చిత్రంపై వంగవీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. 'రాధా, రత్నకుమారి కంటే రంగాపై నాకే ఎక్కువ గౌరవం ఉంది. నా సినిమా కరెక్ట్ కాదనుకుంటే 'అసలు వంగవీటి' అని ఇంకో సినిమా తీసుకోండి. అప్పటి భావోగ్వేదాలను మాత్రమే నేను సినిమాలో చూపించా. రంగాను బోసిపళ్ల మహాత్ముడిలా చూపించాలా?. మర్డర్ల మాట అటుంచి ఎవరినీ మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా?. రంగా గురించి అభిమానులు ఇష్టపడని వాస్తవాలు నా దగ్గర చాలా ఉన్నాయి. రాధా డిమాండ్ చేస్తే వాటన్నింటినీ కుండబద్దలు కొట్టినట్లు చెప్తా. రాధా...బస్తీ మే సవాల్... సెంటర్ నేను చెప్పను, టైమ్ నువ్వు చెప్పొద్దు' అని వర్మ వ్యాఖ్యలు చేశారు. కాగా వంగవీటి చిత్రంలో రంగా పాత్ర చిత్రీకరణపై ఆయన కుమారుడు, వైఎస్ఆర్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాతో పాటు రంగా అభిమానులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వంగవీటి సినిమా తీసేటప్పుడు రాంగోపాల్ వర్మ చరిత్రను వక్రీకరించి తీశారని వంగవీటి రాధాకృష్ణ మండిపడ్డారు. ఇందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. డబ్బుకోసం సినిమా తీసేబదులు.. డబ్బులు అడిగితే రంగా అభిమానులే ఆయనకు చందాలు ఇచ్చేవారన్నారు. రంగా హంతకులు నేటికీ బయట తిరుగుతూనే ఉన్నారని, తనకు అన్నీ తెలుసన్న వర్మకు ఈ విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తానేం చేయాలో అది చేసి చూపిస్తానని అన్నారు. ఇప్పటికే దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, తాను కూడా ఏం చేయాలో చేస్తానని చెప్పారు. రంగా పెళ్లిని చూపించిన తీరుపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే వంగవీటి చిత్రంలో కాపుల మనోభావాలు దెబ్బతినేవిధంగా, అభ్యంతరకరంగా చిత్రీకరించారంటూ రంగా అభిమాన సంఘాలు శనివారం మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై జనవరి 16లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని హెచ్ఆర్సీ ఆదేశాలు ఇచ్చింది కూడా. చదవండి...(వర్మ మూల్యం చెల్లించుకోక తప్పదు) -
వర్మ మూల్యం చెల్లించుకోక తప్పదు: రాధా
-
‘ఆ సన్నివేశాలు తొలగించాలంటూ ఫిర్యాదు’
విజయవాడ: వంగవీటి రంగా అభిమానుల సంఘం శనివారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ‘వంగవీటి’ చిత్రంలోని పలు సన్నివేశాలు కాపుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ ఈ సందర్భంగా హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని రంగా అభిమానుల సంఘం కోరింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్ఆర్సీ....జనవరి 16లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డును ఆదేశించింది. కాగా ‘వంగవీటి’ సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిన్న ఏపీ డీజీపీ సాంబశివరావుని కలిశారు. తాము చెప్పిన అభ్యంతరాలను రాంగోపాల్‌వర్మ పరిగణనలోకి తీసుకోలేదని, సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. 'వంగవీటి' చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. -
నువ్వు సీఎంవా.. సిగ్గు, శరం ఉన్నాయా?
తన తండ్రి వంగవీటి మోహన రంగా, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిల ఫొటోలతో కట్టించిన బ్యానర్లను కూడా ముఖ్యమంత్రి తీయించేశారని వైఎస్ఆర్సీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ మండిపడ్డారు. నువ్వొక నాయకుడివి, నువ్వొక ముఖ్యమంత్రివా.. సిగ్గు, శరం ఉన్నాయా అని నిలదీశారు. విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము బతికినంత కాలం, రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతామన్నారు. ముఖ్యమంత్రి ఎంత బెదిరించినా లొంగేది మాత్రం లేదన్నారు. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి ఉండటం వల్ల సామాన్య ప్రజలకు ట్రాఫిక్ సమస్య తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. డివైడర్లు పగలగొడతారు, మళ్లీ కట్టిస్తారని.. ఏ పని ఎందుకు చేస్తున్నారో తెలియదని అన్నారు. తన తండ్రిని చంపించినవాళ్లతో బ్యానర్లు కట్టించుకుంటున్నారని విమర్శించారు. నాలుగు రోజులు ఆగితే విజయవాడలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతూ ఉంటుందని, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని.. దమ్ముంటే రావాలని సవాలు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఎవరికీ ఇబ్బంది అన్నది లేకుండా చూస్తామని చెప్పారు. ఒకవైపు కాపుల సమస్యలపై ముద్రగడ పద్మనాభం నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే, పనికిమాలిన వాళ్లతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారని విమర్శించారు. సాక్షి టీవీ చానల్ ఆపారు గానీ సోషల్ మీడియాను ఆపగలరా, ఎదురుతిరిగితే మీ పరిస్థితి ఏంటని వంగవీటి రాధాకృష్ణ ప్రశ్నించారు. తమది నిజంగా ప్రజల కోసం పోరాడే పార్టీ కాబట్టి తమ పోరాటానికి ప్రజల మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. -
బొండా.. క్షమాపణ చెప్పు
మహిళలపైనా ఎమ్మెల్యేగా నీ ప్రతాపం చంద్రబాబు సీఎం కావడం ప్రజల దౌర్భాగ్యం వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ విజయవాడ (గాంధీనగర్) : ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు సిగ్గు, శరం ఉంటే మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కండ్రికలోని 59వ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళా కార్పొరేటర్‌పై ప్రతాపం చూపడం సరికాదన్నారు. ఇళ్ల జాబితా అడిగితే ఇవ్వకపోగా, వేలు చూపి ఏకవచనంతో సంబోధిస్తూ దుర్భాషలాడడం ఎమ్మెల్యే స్థాయికి తగదని హితవు పలికారు. ఇళ్ల కేటాయింపుల్లో అవినీతిని ప్రశ్నిస్తే దూషించడం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా డివిజన్ ప్రజలపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తొలుత డివిజన్లోని మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ‘తమకు రేషన్ ఐదు రోజులే ఇస్తున్నారని, నీళ్లు రావడం లేదని, పింఛను సరిగా అందడం లేదని, ఇళ్లు ఇస్తామన్నారు. ఏ ఒక్కరికీ మంజూరు కాలేదు, ఆ పార్టీ కార్యకర్తలకు రెండేసి ఇళ్లు మంజూరు చేస్తున్నారని’ మహిళలు రాధాకృష్ణకు ఫిర్యా దు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ రెండేళ్ల పాలనలో అధికార పార్టీ నాయకుల ఆస్తులు పెరిగాయి కానీ, పేదలకు గూడు దొరకలేదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాసమస్యలపై కార్యచరణ చేపడతామని, ప్రభుత్వం ఎందుకు దిగి రాదో.. తేల్చుకుందామని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం కావడం ప్రజల దౌర్భాగ్యం... రెండేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని రాధాకృష్ణ విమర్శించారు. అధికారమే పరమావధిగా ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజలను వంచించారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులకు ముఖం చూపలేకపోతున్నారన్నారు. హామీలు అమలు చేయలేని చంద్రబాబు సీఎం కావడం ప్రజల దౌర్భాగ్యమని చెప్పారు. 59 డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజ మాట్లాడుతూ ‘ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి, నా దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేయిండని ఎమ్మెల్యే ఉమాను కోరగా ఆయన ‘నీవు ఎంక్వైరీ చేస్తావా? ఏంటి సొల్లు మాట్లాడుతున్నావ్’ అంటూ ఏకవచనంతో సంబోధించారని తెలిపారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి స్పందించాల్సిన తీరు ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్లో ఉన్న ఇళ్ల జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, డివిజన్ నాయకులు టెక్యం కృష్ణ, పెద్దిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు. -
వంగవీటి రాధాకు సిటీ పగ్గాలు
⇒వైఎస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా నియామకం ⇒పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉత్తర్వులు ⇒రంగా-రాధా మిత్రమండలి హర్షం ⇒అందరినీ కలుపుకెళతా.. ⇒ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా ⇒రాధాకృష్ణ వెల్లడి ⇒అధినేతకు కృతజ్ఞతలు విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణను నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రాధా వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ కీలక నేతగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆయనకు విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో అనుచరులున్నారు. నూతన నియామకంపై పార్టీ శ్రేణులు, రంగా-రాధా మిత్రమండలి హర్షం వ్యక్తం చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2004 నుంచి 2009 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాధాకృష్ణ పనిచేశారు. కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడిగా 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన వెంటనే జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఘన విజయం సాధించారు. రాధాకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించడంతోపాటు పెద్ద సంఖ్యలో అభిమానులు, అనుచరులు ఉన్నారు. చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయనకు నగరంలోని సమస్యలు, ప్రజల ఇబ్బందులపై సమగ్ర అవగాహన ఉంది. అనేక దీర్ఘకాలిక సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. 2014లో జరిగిన విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎక్కువమంది పార్టీ అభ్యర్థులు గెలిచేలా కృషిచేశారు. రాధా ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో ముఖ్య నేతగా కొనసాగుతూ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ల పట్ల సర్కారు వైఖరి దారుణం: జగన్
25న ‘చలో విజయవాడ’ ధర్నాకు హాజరవుతానని హామీ వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ ఈ నెల 25న తాము తలపెట్టిన ‘చలో విజయవాడ’ ధర్నా కార్యక్రమానికి రావాల్సిందిగా సంఘం ప్రధాన కార్యదర్శి బి.జె.గాంధీ, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎ.సంతోషరావులు శుక్రవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌ను కలసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ధర్నా కార్యక్రమానికి తప్పక వస్తానని, తనతోపాటు పార్టీ నేతలు జ్యోతుల నెహ్రూ, కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ కూడా హాజరవుతారని చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసును పొడిగిస్తూ ఇంతవరకూ ఉత్తర్వులు ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో.. ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించడం సరికాదన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆయనీ సందర్భంగా హామీఇచ్చారు. -
'నిరూపిస్తే.. రాజీనామా చేస్తావా?'
మచిలీపట్నం: ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తులా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు. కొత్తమాజేరులో విష జ్వరాల కారణంగా 18 మంది చనిపోవడం బాధాకరమన్నారు. కామినేని మాత్రం ఎవరికీ ఏ రోగాలూ రాలేదని చెబుతున్నారని, సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని, మంత్రి రాజీనామా చేస్తారా అంటూ రాధాకృష్ణ సవాల్ చేశారు. విష జ్వరాల బాధితులకు సాయం చేయాలని మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నా వేదికపై రాధాకృష్ణ మాట్లాడారు. వైఎస్ జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారని, తమ పార్టీ అధ్యక్షుడిపై అనవసర మాటలు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. దివంగత వైఎస్ఆర్, వంగవీటి రంగా అభిమానులు తిరగబడతారని అన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడే నాయకుడు ఒక్క వైఎస్ జగన్ అని రాధాకృష్ణ చెప్పారు. మరో మంత్రి దేవినేని ఉమ పట్టిసీమ ప్రాజెక్టులో ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. -
'నిరూపిస్తే.. రాజీనామా చేస్తావా?'
-
వైఎస్సార్ సీపీ జెండా.. ప్రజలకు అండ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు రాధాకృష్ణ, గౌతంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో.. కృష్ణలంక : ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారికి అండగా నేనున్నానంటూ పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. 24వ డివిజన్ మలేరియా ఆస్పత్రి సమీపంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 3, 4, 14, 15, 16, 17, 18, 22, 24 డివిజన్ల కార్పొరేటర్ల మధ్య ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు. ముందుగా దివంగత మహానేత రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం నియంత ధోరణితో వ్యవహరించటం, ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజలను సమస్యలకు గురిచేయడంతో.. ప్రజలకు అండగా నిలిచేందుకు తమ పార్టీ పుట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన తెలుగుదేశం పార్టీ కూడా అదేవిధంగా ప్రజలను బాధిస్తోందన్నారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే తెలుగుదేశం పార్టీకీ పడుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చందన సురేష్, సుంకర కిషోర్, తంగిరాల రామిరెడ్డి, తాటిపర్తి కొండారెడ్డి, పులి రమణారెడ్డి, ఆరేళ్ల రాంబాబు, తెంటు రాజేష్, ప్రభుకుమార్, రంగారావు, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో.. సత్యనారాయణపురం : వైఎస్సార్ సీపీ జెండా ప్రజలకు అనునిత్యం అండగా ఉంటుందని ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి అన్నారు. సత్యనారాయణపురం భగత్‌సింగ్ రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజాసంక్షేమమే ప్రధాన ఎజెండాగా పోరాటాలు చేసేందుకు జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్మిక సోదరులకు 37 రకాల హామీలు ఇచ్చి వాటి ఊసెత్తడం లేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ కార్పొరేటర్ ఎం.డి.కరిమున్నీసా, పార్టీ అధికార ప్రతినిధి యాదల శ్రీనివాసరావు, సిటీ సేవాదళ్ కన్వీనర్ కమ్మిలి రత్నకుమార్, నగర, జిల్లా ట్రేడ్‌యూనియన్ అధ్యక్షులు విశ్వనాథ రవి, మాదు శివరామకృష్ణ, ఎస్సీ నాయకులు కాలే పుల్లారావు, డివిజన్ అధ్యక్షులు టెక్యెం కృష్ణారావు, బోను రాజేష్, ఇసరపు రాజు, ఎం.డి.రుహుల్లా, సేతురామ్, బల్లం కిషోర్, ముద్దరబోయిన దుర్గారావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు నారుమంచి నారాయణ, సాంబశివారెడ్డి, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి డీవీబీ సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ ఆటో వర్కర్స్ యూనియన్నగర కార్యదర్శి ఏడుకొండలు పాల్గొన్నారు. -
రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధా సాక్షి, విజయవాడ : దివంగత వంగవీటి రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. 1988లో వంగవీటి రంగా హత్య ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది, దానికి ఎవరు బాధ్యులు.. ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు అప్పుడు ఎందుకు రాజీనామా చేశారో అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆయన చెప్పారు. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు. రంగా హత్య కేసు కొట్టేసినంత మాత్రానా దోషులు నిర్దోషులు కారన్నారు. శాసనసభలో చర్చను దారి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీ పదేపదే సభలో పరిటాల రవి హత్య కేసును తెరపైకి తీసుకువచ్చి జగన్‌ను ముద్దాయి అనడం సరికాదని ఆయన మండిపడ్డారు. రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలో ఉంటారని, ఆయితే.. ఆయనకు గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదన్నారు. పరిటాల హత్య కేసులో ముద్దాయిలుగా టీడీపీ నేతలు ఆరోపించిన జేసీ బ్రదర్స్‌కు క్లీన్చిట్ ఇచ్చి ఎందుకు పార్టీలోకి తీసుకున్నారని ముందుగా మంత్రి పరిటాల సునీత.. చంద్రబాబు ప్రశ్నించాలన్నారు. గతంలో విపక్షంలో ఉన్న టీడీపీ.. జేసీ బ్రదర్స్ దోషులని బల్లగుద్ది మరీ వాదించిందని, ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు మరిచిపోయిందని రాధా ప్రశ్నించారు. టీడీపీకి నిజంగా హత్యా రాజకీయాలపై మాట్లాడాలని చిత్తశుద్ధి ఉంటే విజయవాడలో జర్నలిస్టు పింగళి దశరథరాం, ఐఎఎస్ అధికారి రాఘవేంద్రరావు హత్యలు మొదలుకొని 1988లో జరిగిన రంగా హత్య వరకు అన్ని కేసులను తిరగదోడి విచారణకు ఆదేశించే సత్తా టీడీపీ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. విజయవాడ నగర టీడీపీ నేత కాట్రగడ్డ బాబుపై గతంలో జరిగిన హత్యాయత్నం ఎవరు చేశారో.. వారు ఏ పార్టీ వారో, దానికి ఎవరు డబ్బు సమకూర్చారో అందరికీ తెలుసునన్నారు. ప్రస్తుతం వారంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని రాధా గుర్తుచేశారు. హత్యా రాజకీయాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి అధికార పక్షం సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ కుల రాజకీయలను ప్రోత్సహించటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కుల రాజకీయాలను తమ పార్టీ ఏమాత్రం ప్రోత్సహించదని అన్ని వర్గాల ప్రజలను కలుపుకు వెళ్లే పార్టీ వైఎస్ఆర్సీపీ అని రాధా చెప్పారు. పదేపదే టీడీపీ నేతలు జగన్‌ను విమర్శిస్తే ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో టీడీపీ వ్యక్తులు దోషులు కాదా అని ప్రశ్నించారు. కేవలం అసెంబ్లీలో టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని.. చర్చ మొదలు కాగానే పరిటాల హత్యను ప్రస్తావించి సభను పక్కదారి పట్టించారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయే అందరికీ తెలుసునన్నారు. ప్రతిపక్షంగా తాము నిర్మాణాత్మకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నామని ఆయన చెప్పారు. -
జేసీ బ్రదర్స్ విషయం.. చంద్రబాబును అడగాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అధికారిక తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యా రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు. హామీలు నెరవేర్చకుండా టీడీపీ నేతలు వైఎస్ఆర్ సీపీని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వంగవీటి మోహన రంగా, తదితరులపై జరిగిన హత్య కేసుల్లో టీడీపీ నేతలే ముద్దాయిలుగా ఉన్నారని వంగవీటీ రాధా అన్నారు. పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలున్న జేసీ దివాకర రెడ్డి సోదరులను ఎలా టీడీపీలోకి చేర్చుకున్నారో చంద్రబాబు నాయుడును అడగాలని మంత్రి పరిటాల సునీతకు సూచించారు. టీడీపీ చేస్తున్న ఆరోపణలపై న్యాయ, సీబీఐ విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు. టీడీపీ నాయకులు హత్యారాజకీయాలు మాని ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని వంగవీటి రాధా హితవు పలికారు. -
మున్సి‘పల్స్’ తేలేది మేలోనే..
సాక్షి, మచిలీపట్నం/ విజయవాడ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులకు మరో నెల రోజులపాటు నిరీక్షణ తప్పదు. మే ఏడో తేదీ తర్వాతే కౌంటింగ్ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు ప్రకటించడం ఓటర్లను ప్రభావితం చేస్తుందన్న పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. గత నెల 30న విజయవాడతో పాటు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయితీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల రెండున ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉండగా, హైకోర్టు ఈ నెల తొమ్మిదిన కౌంటింగ్ జరిపి అదేరోజు ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు సోమవారం తుదితీర్పును వెలువరించింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఏ ఎన్నికలు జరిగినా వాటి ఫలితాలు ప్రభావం చూపుతాయన్న వాదనపై కోర్టు స్పందించింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒకలా, పరిషత్ ఎన్నికల ఫలితాలు మరోలా ఉండవని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈవీఎంల భద్రత సమస్యగా మారుతుందంటూ ఎన్నికల కమిషన్ చేసిన వాదనలను కొట్టివేసింది. మే ఏడో తేదీన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల పోలింగ్ పూర్తికానున్నందున మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆ తర్వాతే చేపట్టనున్నారు. అభ్యర్థులకు తప్పని ఉత్కంఠ... సుప్రీంకోర్టు తీర్పుతో జిల్లాలోని విజయవాడ నగరంతో పాటు మచిలీపట్నం, పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, ఉయ్యూరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు మే ఏడో తేదీ తరువాతే జరగనుంది. దీంతో విజయవాడ నగరంలోని 59 డివిజన్లు, ఎనిమిది మున్సిపాలిటీల్లోని 218 వార్డులకు పోటీపడిన అభ్యర్థులకు మరో నెల రోజులకుపైగా ఫలితాల కోసం నిరీక్షణ తప్పదు. ఓట్ల లెక్కింపు వాయిదాతో పోటీచేసిన అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. మరో నెలరోజుల పాటు ఉత్కంఠకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గడువు పెరిగిన కొద్దీ ఎవరికి విజయావకాశాలు ఉంటాయన్న విశ్లేషణల ఆధారంగా బెట్టింగ్‌లు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఈ నెల తొమ్మిదిన కౌంటింగ్ ఉంటుందన్న ఉద్దేశంలో మున్సిపల్ అధికారులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు, అభ్యర్థులు ఉండేందుకు బారికేడ్లు నిర్మించి మెష్‌ను ఏర్పాటు చేశారు. మెష్ లోపల కౌంటింగ్ నిర్వహించే సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు నిర్వహించారు. గందరగోళం చేయడానికే.. :వంగవీటి రాధాకృష్ణ ప్రజల్ని గందరగోళ పరచడానికే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఫలితాలను వాయిదా వేసేటప్పుడు సార్వత్రిక ఎన్నికల ముందు వీటిని నిర్వహించకుండా ఉండాల్సిందన్నారు. మూడేళ్లపాటు ఊరుకుని ఎన్నికల ముందు హడావిడిగా నిర్వహించి, ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించడం లేదని, ఎన్నికలు సరైన సమయంలో పెట్టలేదనేదే తన అభిప్రాయమని చెప్పారు.