స్మృతి వనం భూమిపూజలో వంగవీటి రాధా, రత్నకుమారి, కొడాలి నాని, యార్లగడ్డ
విజయవాడ సిటీ/ఉయ్యూరు(పెనమలూరు) : పేదల అభ్యున్నతి కోసం ప్రజా పోరాటాలు చేసిన వంగవీటి రంగాను ఆదర్శంగా తీసుకుని నేటి యువత పనిచేయాలని వైఎస్సార్‌సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రంగా వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పార్టీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలే పుల్లారావు పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ పేదలకు అండగా నిలిచేతత్వమే ఆయనకు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిపెట్టిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు, బీసీ సెల్ నేత కసగోని దుర్గారావు, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, వైఎస్సార్ విద్యార్థి విభాగం దొడ్డా అంజిరెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పల్లి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
నా తండ్రి ఆశయాలు సాధిస్తా..
‘ప్రజా సేవతో నా తండ్రి మోహనరంగా ఆశయాలను సాధిస్తా..’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. కాటూరులో రాధా–రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో బుధవారం దివంగత వంగవీటి మోహనరంగా వర్ధంతి నిర్వహించారు. రాధా–రంగా స్మరణ భూమిలో స్మృతివనం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. రంగా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాధాకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు, కులమతాలకతీతంగా సేవ చేస్తాన్నారు.
చిరస్మరణీయుడు రంగా
ప్రజలకు సేవచేసి వారి హృదయాల్లో రంగా నిలిచి ఉన్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. రాధా–రంగా స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో రంగా సతీమణి, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, వైఎస్సార్‌సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి) తదితరులు పాల్గొన్నారు.
రంగా చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment