
మాట్లాడుతున్న ఎంపీ వల్లభనేని బాలశౌరి, వేదికపై ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ
విజయవాడ రూరల్: పేదల హక్కుల కోసం కృషి చేసిన వంగవీటి మోహనరంగా మరణించి 34 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో నేటికీ ఆయన చిరస్థాయిగా నిలిచే ఉన్నారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. విజయవాడ సమీపంలోని నున్నలో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ.. 1989లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రంగా శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు.
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం జీవించి, వారి కోసమే ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకుడు వీఎం రంగా అన్నారు. ఆయన మరణించి 34 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని పేర్కొన్నారు. డబ్బు సంపాదించాలనే ఆపేక్ష లేని రంగా తనయుడు విజయవాడలో సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేదన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. వీఎం రంగా ప్రజల మనిషని అన్నారు.
మూడేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు చేసి 35 సంవత్సరాలుగా ప్రజల మనిషిగా వారి గుండెల్లో నిలిచిపోయారన్నాని, రంగాకు మరణమే లేదని పేర్కొన్నారు. ఆయన తనయుడు రాధాకృష్ణ రాజకీయాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. వీఎం రంగా పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి తోట వెంకయ్య, విగ్రహ దాత కొట్టే రవికుమార్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్‌వీఆర్, ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జెడ్పీటీసీ కె.సువర్ణరాజు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ యర్కారెడ్డి నాగిరెడ్డి, సర్పంచ్ కాటూరి సరళ పాల్గొన్నారు.