సాక్షి, హైదరాబాద్: తన తండ్రి వంగవీటి మోహనరంగాను చంపిన తెలుగుదేశం పార్టీలోకి రాధాకృష్ణ ఏముఖం పెట్టుకుని వెళుతున్నారు? ఆ పార్టీ నేతలతో ఏ విధంగా చర్చలు జరుపుతున్నారు? అని విజయవాడ పార్లమెంటు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ప్రశ్నించారు. రాధా పార్టీని వీడుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌పైనా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రంగా కుటుంబంతో తమకు ఎంతో సాన్నిహత్యం ఉందనీ, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన ఎదుగుదలకు ఎంతగానో సహకరించారని తెలిపారు. అలాంటి రంగాను టీడీపీ నేతలు, గూండాలు ఒక టూరిస్టు బస్సులో టీడీపీ జెండా కట్టుకుని వచ్చి విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ ఉండగా ఘోరంగా నరికి చంపారని ఉదయభాను గుర్తు చేశారు. చంద్రబాబు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందని అన్నారు. రంగా హత్య కేసులో దేవినేని నెహ్రూ, వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ ఇతర టీడీపీ నేతలు ముద్దాయిలని, ఈ హత్య వెనుక చంద్రబాబు, అప్పటి హోంశాఖ మంత్రి కోడెల శివప్రసాదరావు కుట్ర ఉందని అప్పటి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో రాసిన విషయం ఆయన గుర్తుచేశారు. ఇదే విషయాన్ని పలు వేదికలపై కూడా జోగయ్య చెప్పారన్నారు. అయినప్పటికీ తన తండ్రి రంగాను చంపింది తెలుగుదేశం పార్టీ కాదు.. కొందరు వ్యక్తులు అని రాధా మాట్లాడటం రంగా అభిమానులకు బాధ కలిగిస్తోందని అన్నారు. రాధా తల్లి టీడీపీలో చేరినప్పుడే రంగా ఆత్మ ఘోషించిందని, తాజాగా రాధా మాటలతో మరింత ఘోషిస్తోందని పేర్కొన్నారు.
రంగా విగ్రహావిష్కరణలకు అభ్యంతరం చెప్పలేదు
రాధా టీడీపీ కబంధ హస్తాల్లో చిక్కుకొని, వాళ్లు ఇచ్చిన స్క్రిప్టునే మాట్లాడారని ఉదయభాను విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేటప్పుడు తన తమ్ముడిలా చూసుకుంటానని రాధాకు జగన్ చెప్పారని, ఆ మేరకు 2014 ఎన్నికలయ్యాక పార్టీ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. కానీ రాధా ఎక్కడా తిరగడం గానీ, ఒక్క కార్యక్రమం నిర్వహించడం కానీ చేయలేదని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శిని చేసినా చురుగ్గా వ్యవహరించలేదన్నారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించినా ప్రజా సమస్యలపై గానీ, పార్టీ కోసం గానీ ఏ ఒక్క పోరాటం చేయలేదని తెలిపారు. అన్ని పదవులిచ్చినా తనకు జగన్ ప్రాధాన్యత ఇవ్వలేదని రాధా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రంగా విగ్రహావిష్కరణలకు జగన్ అభ్యంతరం చెప్పారనడంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. కృష్ణా జిల్లాలో అందరికంటే రాధాకే జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని, ప్రేమ చూపేవారని ఉదయభాను గుర్తుచేశారు. రాధా అభ్యంతరం వ్యక్తం చేసినందుకే దేవినేని నెహ్రూను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదన్నారు. అదీ రంగా కుటుంబానికి, రాధాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం అన్నారు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్‌ను, జగన్‌ను విమర్శిస్తున్నారంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల మాయ మాటలకు రాధా లొంగి పోయారని, ఆయన ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని సూచించారు. రాధా టీడీపీలోకి వెళ్ళాలనుకోవడం సిగ్గుమాలిన పనిగా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment