
సాక్షి, విజయవాడ : కులమతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహన రంగా కృషి చేశారని రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వంగవీటి మోహన రంగా 71వ జయంతి సందర్భంగా నగరంలోని రాఘవయ్య పార్క్ వద్ద రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తన తండ్రిని ఆరాధించడం సంతోషంగా ఉందన్నారు. పేదల కోసమే రంగా పనిచేశారని.. అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు. రంగా కుమారుడిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. రాధా రంగా మిత్ర మండలి సభ్యులను కలుపుకొని పని చేస్తానని రాధాకృష్ణ పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో..
వంగవీటి మోహన రంగా 71వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా పేద ప్రజల కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పార్థసారథి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు, పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.