
సాక్షి, విజయవాడ: మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ.. రాఘవయ్య పార్క్ సెంటర్‌లో గల రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ‘రాజకీయాలకు అతీతంగా రంగా వర్ధంతి చేస్తున్నాం. నాన్న ఆశయాల కోసం చివరి వరకూ పనిచేస్తా. ఆయనను నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉంటా. వాళ్లకి న్యాయం చెయ్యాల్సి ఉంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది’అని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు బొప్పన భవకుమార్, ఆసిఫ్, చందన సురేష్, కాజా రాజ్‌కుమార్, పలువురు రాధా-రంగా మిత్రమండలి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజయవాడ నుంచి కాటూరుకు రాధా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. కాటూరులో వంగవీటి రంగా స్మారక భూమికి రాధా శంకుస్థాపన చేయనున్నారు.