వర్మ మూల్యం చెల్లించుకోక తప్పదు: రాధా
రంగా 28వ వర్ధంతి కార్యక్రమంలో రాధాకృష్ణ
కృష్ణలంక (విజయవాడ): చరిత్రను వక్రీకరించి ‘వంగవీటి’ చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. విజయ వాడలో సోమవారం వంగవీటి రంగా 28వ వర్ధంతి జరిగింది. బందరురోడ్డులోని రాఘవయ్య పార్కు సమీపంలో ఉన్న రంగా విగ్రహానికి రాధా కృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వంగవీటి రాధా కృష్ణ మాట్లాడుతూ రాంగోపాల్‌వర్మకు డబ్బే కావాలనుకుంటే రంగా అభిమానులు చందాలు పోగుచేసి వెదజల్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రంగా జీవిత చరిత్ర తెలియని ఆయనను అసలు సినిమా తీయొద్దని, విడుదల చేయొద్దని ముందే చెప్పా నని తెలిపారు. అనంతరం రంగా అభిమానులు భారీ ఊరేగింపు నిర్వహించారు. పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.
వంగవీటి కుటుంబాన్ని రెచ్చగొట్టొద్దు
అక్కిరెడ్డిపాలెం (విశాఖ): వంగవీటి కుటుంబం పాత కక్షలన్నీ మరిచి ప్రశాంతంగా బతుకుతోందని, తిరిగి ఈ కుటుంబాన్ని రెచ్చగొట్టవద్దని వంగవీటి మోహన రంగ సోదరుని కుమారుడు వంగవీటి మేఘనాథ్ కోరారు. 65వ వార్డు మిందిలో వంగవీటి మోహన రంగ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన వంగవీటి సినిమాపై స్పందించారు. వంగవీటి సినిమాను తీసిన డైరెక్టర్ ఒక మెంటల్ అని, ఆయనకు సహకరించింది మరో మెంటల్ అని తీవ్ర పరుష పదజాలంతో విమర్శించారు. వంగవీటి కుటుంబాన్ని రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని హెచ్చరించారు.
సెంటర్ నేను చెప్పను..టైం నువ్వు చెప్పొద్దు
వంగవీటి రాధాకృష్ణ వాఖ్యలపై రాంగోపాల్ వర్మ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: వంగవీటి రంగ తనయుడు రాధాకృష్ణ వాఖ్యలపై సినీ డైరెక్టర్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. తననేదో చేస్తానన్న రాధా వాఖ్యలపై వర్మ సోమవారం ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘బస్తీ మే సవాల్– సెంటర్ నేను చెప్పను. టైం నువ్వు చెప్పొద్దు’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. రంగ వ్యక్తిత్వాన్ని వక్రీకరించానన్న రాధ వాఖ్యలపై తన సమాధానమిదంటూ వర్మ ట్వీట్ చేశారు. ‘ అన్నదానాలు, ప్రజాసేవ తప్పా వంగవీటి రంగా చీమకైనా హాని చేయని గౌతమ బుద్ధుడని చూపించాలా’ అంటూ ఆయన ప్రశ్నించారు.
రంగ వ్యక్తిత్వం గురించి ఆయన అభిమానులు, రంగ భార్య వినడానికి ఇష్టపడని వాస్తవాలను కూడా తాను చూపించగలనని, కానీ రంగపై ఉన్న గౌరవంతో అవి చూపించలేకపోయానని తెలి పారు. రాధాకు దమ్ముంటే ఆ వాస్తవాలను చూపమని తనను డిమాండ్ చేయాలని, అలా చేస్తే కుండబద్ధలు కొట్టినట్లు వాటిని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. సున్నితమైన భావోద్వేగాలను చూపించడానికే ఈ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు.