'అసలు వంగవీటి'ని మీరే తీసుకోండి | ramgopal varma reacts on vangaveeti radhakrishna comments | Sakshi
Sakshi News home page

రాధా...బస్తీ మే సవాల్‌... : రాంగోపాల్‌ వర్మ

Published Mon, Dec 26 2016 4:11 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

'అసలు వంగవీటి'ని మీరే తీసుకోండి

'అసలు వంగవీటి'ని మీరే తీసుకోండి

హైదరాబాద్: వంగవీటి చిత్రంపై వంగవీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. 'రాధా, రత్నకుమారి కంటే రంగాపై నాకే ఎక్కువ గౌరవం ఉంది.  నా సినిమా కరెక్ట్ కాదనుకుంటే 'అసలు వంగవీటి' అని ఇంకో సినిమా తీసుకోండి. అప్పటి భావోగ్వేదాలను మాత్రమే నేను సినిమాలో చూపించా. రంగాను బోసిపళ్ల మహాత్ముడిలా చూపించాలా?. మర్డర్ల మాట అటుంచి ఎవరినీ మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా?.

రంగా గురించి అభిమానులు ఇష్టపడని వాస్తవాలు నా దగ్గర చాలా ఉన్నాయి. రాధా డిమాండ్‌ చేస్తే వాటన్నింటినీ కుండబద్దలు కొట్టినట్లు చెప్తా. రాధా...బస్తీ మే సవాల్‌... సెంటర్‌ నేను చెప్పను, టైమ్‌ నువ్వు చెప్పొద్దు' అని వర్మ వ్యాఖ్యలు చేశారు. కాగా వంగవీటి చిత్రంలో రంగా పాత్ర చిత్రీకరణపై ఆయన కుమారుడు, వైఎస్ఆర్‌సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాతో పాటు రంగా అభిమానులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

వంగవీటి సినిమా తీసేటప్పుడు రాంగోపాల్ వర్మ చరిత్రను వక్రీకరించి తీశారని వంగవీటి రాధాకృష్ణ మండిపడ్డారు. ఇందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. డబ్బుకోసం సినిమా తీసేబదులు.. డబ్బులు అడిగితే రంగా అభిమానులే ఆయనకు చందాలు ఇచ్చేవారన్నారు. రంగా హంతకులు నేటికీ బయట తిరుగుతూనే ఉన్నారని, తనకు అన్నీ తెలుసన్న వర్మకు ఈ విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తానేం చేయాలో అది చేసి చూపిస్తానని అన్నారు. ఇప్పటికే దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, తాను కూడా ఏం చేయాలో చేస్తానని చెప్పారు. రంగా పెళ్లిని చూపించిన తీరుపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

అలాగే వంగవీటి చిత్రంలో కాపుల మనోభావాలు దెబ్బతినేవిధంగా, అభ్యంతరకరంగా చిత్రీకరించారంటూ రంగా అభిమాన సంఘాలు శనివారం మానవ హక్కుల కమిషన్‌ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై జనవరి 16లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు ఇచ్చింది కూడా. చదవండి...(వర్మ మూల్యం చెల్లించుకోక తప్పదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement