
వంగవీటి రాధాకు సిటీ పగ్గాలు
⇒వైఎస్సార్‌సీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా నియామకం
⇒పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉత్తర్వులు
⇒రంగా-రాధా మిత్రమండలి హర్షం
⇒అందరినీ కలుపుకెళతా..
⇒ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా
⇒రాధాకృష్ణ వెల్లడి
⇒అధినేతకు కృతజ్ఞతలు
విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణను నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రాధా వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ కీలక నేతగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆయనకు విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో అనుచరులున్నారు. నూతన నియామకంపై పార్టీ శ్రేణులు, రంగా-రాధా మిత్రమండలి హర్షం వ్యక్తం చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2004 నుంచి 2009 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాధాకృష్ణ పనిచేశారు. కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడిగా 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన వెంటనే జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఘన విజయం సాధించారు. రాధాకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించడంతోపాటు పెద్ద సంఖ్యలో అభిమానులు, అనుచరులు ఉన్నారు. చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయనకు నగరంలోని సమస్యలు, ప్రజల ఇబ్బందులపై సమగ్ర అవగాహన ఉంది. అనేక దీర్ఘకాలిక సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. 2014లో జరిగిన విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎక్కువమంది పార్టీ అభ్యర్థులు గెలిచేలా కృషిచేశారు. రాధా ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో ముఖ్య నేతగా కొనసాగుతూ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.