
నువ్వు సీఎంవా.. సిగ్గు, శరం ఉన్నాయా?
తన తండ్రి వంగవీటి మోహన రంగా, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిల ఫొటోలతో కట్టించిన బ్యానర్లను కూడా ముఖ్యమంత్రి తీయించేశారని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ మండిపడ్డారు. నువ్వొక నాయకుడివి, నువ్వొక ముఖ్యమంత్రివా.. సిగ్గు, శరం ఉన్నాయా అని నిలదీశారు. విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము బతికినంత కాలం, రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతామన్నారు. ముఖ్యమంత్రి ఎంత బెదిరించినా లొంగేది మాత్రం లేదన్నారు. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి ఉండటం వల్ల సామాన్య ప్రజలకు ట్రాఫిక్ సమస్య తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. డివైడర్లు పగలగొడతారు, మళ్లీ కట్టిస్తారని.. ఏ పని ఎందుకు చేస్తున్నారో తెలియదని అన్నారు.
తన తండ్రిని చంపించినవాళ్లతో బ్యానర్లు కట్టించుకుంటున్నారని విమర్శించారు. నాలుగు రోజులు ఆగితే విజయవాడలో వైఎస్ఆర్‌సీపీ జెండా ఎగురుతూ ఉంటుందని, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని.. దమ్ముంటే రావాలని సవాలు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఎవరికీ ఇబ్బంది అన్నది లేకుండా చూస్తామని చెప్పారు. ఒకవైపు కాపుల సమస్యలపై ముద్రగడ పద్మనాభం నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే, పనికిమాలిన వాళ్లతో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని విమర్శించారు. సాక్షి టీవీ చానల్ ఆపారు గానీ సోషల్ మీడియాను ఆపగలరా, ఎదురుతిరిగితే మీ పరిస్థితి ఏంటని వంగవీటి రాధాకృష్ణ ప్రశ్నించారు. తమది నిజంగా ప్రజల కోసం పోరాడే పార్టీ కాబట్టి తమ పోరాటానికి ప్రజల మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.