మహిళలపైనా ఎమ్మెల్యేగా నీ ప్రతాపం
చంద్రబాబు సీఎం కావడం ప్రజల దౌర్భాగ్యం
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ
విజయవాడ (గాంధీనగర్) : ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు సిగ్గు, శరం ఉంటే మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కండ్రికలోని 59వ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళా కార్పొరేటర్‌పై ప్రతాపం చూపడం సరికాదన్నారు. ఇళ్ల జాబితా అడిగితే ఇవ్వకపోగా, వేలు చూపి ఏకవచనంతో సంబోధిస్తూ దుర్భాషలాడడం ఎమ్మెల్యే స్థాయికి తగదని హితవు పలికారు. ఇళ్ల కేటాయింపుల్లో అవినీతిని ప్రశ్నిస్తే దూషించడం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా డివిజన్ ప్రజలపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తొలుత డివిజన్‌లోని మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ‘తమకు రేషన్ ఐదు రోజులే ఇస్తున్నారని, నీళ్లు రావడం లేదని, పింఛను సరిగా అందడం లేదని, ఇళ్లు ఇస్తామన్నారు. ఏ ఒక్కరికీ మంజూరు కాలేదు, ఆ పార్టీ కార్యకర్తలకు రెండేసి ఇళ్లు మంజూరు చేస్తున్నారని’ మహిళలు రాధాకృష్ణకు ఫిర్యా దు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ రెండేళ్ల పాలనలో అధికార పార్టీ నాయకుల ఆస్తులు పెరిగాయి కానీ, పేదలకు గూడు దొరకలేదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాసమస్యలపై కార్యచరణ చేపడతామని, ప్రభుత్వం ఎందుకు దిగి రాదో.. తేల్చుకుందామని పేర్కొన్నారు.
చంద్రబాబు సీఎం కావడం ప్రజల దౌర్భాగ్యం...
రెండేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని రాధాకృష్ణ విమర్శించారు. అధికారమే పరమావధిగా ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజలను వంచించారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులకు ముఖం చూపలేకపోతున్నారన్నారు. హామీలు అమలు చేయలేని చంద్రబాబు సీఎం కావడం ప్రజల దౌర్భాగ్యమని చెప్పారు.
59 డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజ మాట్లాడుతూ ‘ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి, నా దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేయిండని ఎమ్మెల్యే ఉమాను కోరగా ఆయన ‘నీవు ఎంక్వైరీ చేస్తావా? ఏంటి సొల్లు మాట్లాడుతున్నావ్’ అంటూ ఏకవచనంతో సంబోధించారని తెలిపారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి స్పందించాల్సిన తీరు ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌లో ఉన్న ఇళ్ల జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, డివిజన్ నాయకులు టెక్యం కృష్ణ, పెద్దిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు.