సాక్షి, మచిలీపట్నం/ విజయవాడ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులకు మరో నెల రోజులపాటు నిరీక్షణ తప్పదు. మే ఏడో తేదీ తర్వాతే కౌంటింగ్ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు ప్రకటించడం ఓటర్లను ప్రభావితం చేస్తుందన్న పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. గత నెల 30న విజయవాడతో పాటు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయితీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ నెల రెండున ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉండగా, హైకోర్టు ఈ నెల తొమ్మిదిన కౌంటింగ్ జరిపి అదేరోజు ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు సోమవారం తుదితీర్పును వెలువరించింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఏ ఎన్నికలు జరిగినా వాటి ఫలితాలు ప్రభావం చూపుతాయన్న వాదనపై కోర్టు స్పందించింది.
ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒకలా, పరిషత్ ఎన్నికల ఫలితాలు మరోలా ఉండవని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈవీఎంల భద్రత సమస్యగా మారుతుందంటూ ఎన్నికల కమిషన్ చేసిన వాదనలను కొట్టివేసింది. మే ఏడో తేదీన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల పోలింగ్ పూర్తికానున్నందున మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆ తర్వాతే చేపట్టనున్నారు.
అభ్యర్థులకు తప్పని ఉత్కంఠ...
సుప్రీంకోర్టు తీర్పుతో జిల్లాలోని విజయవాడ నగరంతో పాటు మచిలీపట్నం, పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, ఉయ్యూరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు మే ఏడో తేదీ తరువాతే జరగనుంది. దీంతో విజయవాడ నగరంలోని 59 డివిజన్లు, ఎనిమిది మున్సిపాలిటీల్లోని 218 వార్డులకు పోటీపడిన అభ్యర్థులకు మరో నెల రోజులకుపైగా ఫలితాల కోసం నిరీక్షణ తప్పదు. ఓట్ల లెక్కింపు వాయిదాతో పోటీచేసిన అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు.
మరో నెలరోజుల పాటు ఉత్కంఠకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గడువు పెరిగిన కొద్దీ ఎవరికి విజయావకాశాలు ఉంటాయన్న విశ్లేషణల ఆధారంగా బెట్టింగ్‌లు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఈ నెల తొమ్మిదిన కౌంటింగ్ ఉంటుందన్న ఉద్దేశంలో మున్సిపల్ అధికారులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు, అభ్యర్థులు ఉండేందుకు బారికేడ్లు నిర్మించి మెష్‌ను ఏర్పాటు చేశారు. మెష్ లోపల కౌంటింగ్ నిర్వహించే సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు నిర్వహించారు.
గందరగోళం చేయడానికే.. :వంగవీటి రాధాకృష్ణ
ప్రజల్ని గందరగోళ పరచడానికే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఫలితాలను వాయిదా వేసేటప్పుడు సార్వత్రిక ఎన్నికల ముందు వీటిని నిర్వహించకుండా ఉండాల్సిందన్నారు.
మూడేళ్లపాటు ఊరుకుని ఎన్నికల ముందు హడావిడిగా నిర్వహించి, ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించడం లేదని, ఎన్నికలు సరైన సమయంలో పెట్టలేదనేదే తన అభిప్రాయమని చెప్పారు.
మున్సి‘పల్స్’ తేలేది మేలోనే..
Published Tue, Apr 8 2014 2:25 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement