
కాంట్రాక్టు లెక్చరర్ల పట్ల సర్కారు వైఖరి దారుణం: జగన్
25న ‘చలో విజయవాడ’ ధర్నాకు హాజరవుతానని హామీ
వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ ఈ నెల 25న తాము తలపెట్టిన ‘చలో విజయవాడ’ ధర్నా కార్యక్రమానికి రావాల్సిందిగా సంఘం ప్రధాన కార్యదర్శి బి.జె.గాంధీ, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎ.సంతోషరావులు శుక్రవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌ను కలసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ధర్నా కార్యక్రమానికి తప్పక వస్తానని, తనతోపాటు పార్టీ నేతలు జ్యోతుల నెహ్రూ, కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ కూడా హాజరవుతారని చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసును పొడిగిస్తూ ఇంతవరకూ ఉత్తర్వులు ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో.. ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించడం సరికాదన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆయనీ సందర్భంగా హామీఇచ్చారు.