
సాక్షి, విజయవాడ : విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగారావు (రంగా) హత్య కేసుతో తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మా నాన్నను తెలుగుదేశం పార్టీ పొట్టన పెట్టుకుందంటూ ఆవేశంగా మాట్లాడానని, ఆవేశంగా అభిమానుల్ని రెచ్చగొట్టానని చెప్పారు. అది కేవలం కొంతమంది వ్యక్తులు చేసిన హత్యగా పేర్కొన్నారు. రాధాకృష్ణ గురువారం బందరు రోడ్డులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రంగా అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, కొంతమంది వ్యక్తులు చేసిన తప్పును పార్టీకి అంటగట్టడం సరికాదని అన్నారు. తన తండ్రి వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణకు వెళితే.. నాకు చెప్పి వెళ్లావా? అక్కడ ఇన్‌చార్జికి చెప్పావా? అంటూ ప్రశ్నించారని తన తండ్రి విగ్రహవిష్కరణకు ఎవరికి చెప్పి వెళ్లాలని ప్రశ్నించారు.
చంద్రబాబునాయుడు తనను పార్టీలోకి ఆహ్వానించారని, అయితే మన్నించమని కోరుతున్నానని చెప్పారు. మీకు రూ.100 కోట్లు ఇచ్చి పార్టీలోకి తీసుకుంటున్నారంట కదా అని విలేకరులు ప్రశ్నించగా ఆ డబ్బు ఎక్కడుందో చూపిస్తే మీకే ఇస్తానన్నారు. ఒకదశలో రాధాకృష్ణ విలేకరులపై సీరియస్ అయ్యారు. బెదిరిస్తున్నట్టుగా మాట్లాడారు. ఆయన అనుచరులు గలాటా సృష్టించారు. ఒక ఆశయంతో ముందుకు వెళ్తున్నామని రాధాకృష్ణ అన్నారు. మీరు తెలుగుదేశంలోకి వెళితే రంగా ఆశయం నేరవేరుతుందా? అని ఒక విలేకరి ప్రశ్నించగా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment