
మండపేట: తండ్రిని చంపిన వ్యక్తి.. తనయుడిని పరామర్శించడం సిగ్గుచేటని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు. వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాను చంద్రబాబు పరామర్శించడంపై ఆదివారం తూర్పు గోదావరి జిల్లా మండపేటలో తోట మీడియాతో మాట్లాడారు. రంగా హత్య కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబునాయుడన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు.
అటువంటి వ్యక్తి రాధాను పరామర్శించడం వల్ల రంగా ఆత్మ మరింత క్షోభిస్తుందని అన్నారు. రంగా అన్ని సామాజికవర్గాలూ అభిమానించే వ్యక్తని, ఆయన దారుణ హత్యకు గురై 35 ఏళ్లు కావస్తున్నా నేటికీ అందరి హృదయాల్లో ఉన్నారని చెప్పారు. ఆయన కుమారుడు రాధా ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. రెక్కీ జరిగిన విషయాన్ని రాధా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే అవసరమైన రక్షణ కల్పిస్తుందన్నారు.
మాజీ ఎమ్మెల్యేగా ఆయనకు ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పించిందని చెప్పారు. చంద్రబాబు కుటిల రాజకీయాలు తనకు తెలుసునని, బాబు మాటల్లోని మంచి, చెడును ఆలోచించుకుని అడుగులు వేయాలని తన సోదరుడైన రాధాకు సూచన చేస్తున్నానని తోట అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment