
‘ఆ సన్నివేశాలు తొలగించాలంటూ ఫిర్యాదు’
విజయవాడ: వంగవీటి రంగా అభిమానుల సంఘం శనివారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ‘వంగవీటి’ చిత్రంలోని పలు సన్నివేశాలు కాపుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ ఈ సందర్భంగా హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని రంగా అభిమానుల సంఘం కోరింది.
ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ....జనవరి 16లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డును ఆదేశించింది. కాగా ‘వంగవీటి’ సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిన్న ఏపీ డీజీపీ సాంబశివరావుని కలిశారు. తాము చెప్పిన అభ్యంతరాలను రాంగోపాల్‌వర్మ పరిగణనలోకి తీసుకోలేదని, సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. 'వంగవీటి' చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.