పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆకునూరి మురళి తదితరులు
పంజగుట్ట: రాష్ట్రంలో సిరులు కురిపిస్తున్న సేద్యం అని బీఆర్‌ఎస్ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటోందని... అయితే రాష్ట్రం వచ్చిన 9 సంవత్సరాల్లో 7007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని పలువురు వక్తలు ఆరోపించారు. సోషల్ డెమొక్రటిక్ ఫోరమ్ (ఎస్‌డీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో “తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి?’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ పద్మజాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్‌డీఎఫ్ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి, కో కన్వినర్‌లు కన్నెగంటి రవి, పృధ్విరాజ్ యాదవ్, ప్రొఫెసర్ రమ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ పుస్తకాన్ని అన్ని పార్టీల అధ్యక్షులకు ఇచ్చి వారి మేనిఫెస్టోలో పెట్టాలని సూచించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఆకునూరి మురళి మాట్లాడుతూ... రాష్ట్రంలో 59 లక్షల రైతులు కోటి 45 లక్షల భూమిని సాగుచేస్తున్నారన్నారు. వారికి 3.2 టన్నుల విత్తనాలు అవసరమున్నదని రాష్ట్ర ప్రభుత్వం విత్తన అభివృద్ధి సంస్థ పాత్ర రోజురోజుకూ తగ్గించడంతో నకిలీ విత్తనాలు అమ్మే మోసగాళ్లు పెరిగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలకు సంబంధించి సమగ్ర చట్టం విత్తన విధానం తీసుకురావాలని సూచించారు.
రైతుల వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడూ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో సహకరించేందుకు రాజ్యాంగ బద్ద సంస్థ ఒక వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి సంవత్సరం రూ. 100 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిషన్ అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించడం, విత్తనాలు సరఫరా, నాణ్యమైన విత్తనలు, జన్యుపరంగా మార్పు చేసి ఇవ్వాలన్నారు. క్రిమి సంహారక మందులు కూడా ఏ పంటకు ఏ మేర క్రిమిసంహారక మందులు వాడాలో సూచించాలన్నారు. రైతుబంధు పథకం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీన్ని కొనసాగిస్తూనే పది ఎకరాలు పైబడి మాగాణి, వర్షాధార భూములు ఉన్న వారికి ఇవ్వరాదన్నారు.
ఆదాయపు పన్ను కట్టే ఏ రైతుకుటుంబానికి, భూ యజమానులకు రైతుబందు ఇవ్వకూడదని, ఇతరదేశాల్లో స్థిరపడి ఉన్న భూ యజమానులకూ ఇవ్వరాదని సూచించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎలాంటి పంటల బీమా లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ప్రతి సంవత్సరం కరువుతోనో, అధిక వర్షాలతోనో రైతులు నష్టపోతూనే ఉన్నారని ఏ ఒక్క రైతుకూడా నష్టపోకుండా పటిష్టమైన పంటల బీమా వర్తింపచేయాలన్నారు. రైతులు బాగుపడేందుకు ప్రభుత్వం రూ. 38500 కోట్లు అవసరం అవుతాయని ప్రతి సంవత్సరం అదనంగా రూ. 6400 కోట్లు కేటాయించాలని సూచించారు. సమావేశంలో రంజిత్ కుమార్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment