పర్యావరణ అత్యవసర పరిస్థితులు చుట్టుముడుతున్న నేపథ్యంలో కాంక్రీటు అరణ్యాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వృత్తి నిపుణులు మేలుకొంటున్నారు. తిరిగి ప్రకృతి వైపు తెలివిగా అడుగులు వేస్తున్నారు. నగరాలు, పట్టణాల పరిసర ప్రాంతాల్లో కొద్దో గొప్పో సొంత భూమి సమకూర్చుకొని తాము తినాలనుకునే పంటలను తామే పండించుకొనే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. తెలుగు నాట కోవిడ్‌కు ముందే ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పుడు మరింత పుంజుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో పర్మాకల్చర్‌ను అనేక కుటుంబాలు అనుసరిస్తున్నాయి. దాన్నే జీవనశైలిగా మార్చుకుంటున్నాయి. ప్రముఖ పర్మాకల్చర్ నిపుణులు డా. నరసన్న, పద్మ శిక్షణ ఇస్తున్నారు. శాశ్వత ఆహార, ఆరోగ్య, పర్యావరణ సేవలందించే సమగ్ర స్వీయ సేంద్రియ సేద్య విజ్ఞానపు వెలుగుదారులు పరుస్తున్నారు.
‘పర్మాకల్చర్’ అంటే..?
పర్మనెంట్ + అగ్రికల్చర్.
శాశ్వత ప్రయోజనాలను అందించే ఓ నూతన వ్యవసాయ విధానం. ఇంకా విడమర్చి చెప్పుకోవాలంటే.. పర్మాకల్చర్ (శాశ్వత వ్యవసాయం) కేవలం సీజనల్ పంటలను సేంద్రియంగా పండించే పద్ధతి మాత్రమే కాదు. భారతీయులకు, ముఖ్యంగా తెలుగు నేలకు, పర్మాకల్చర్ భావనను పరిచయం చేసిన కీర్తి శేషులు డాక్టర్ వెంకట్ మాటల్లో చెప్పాలంటే.. ‘పర్మాకల్చర్ అన్నది ఒక ప్రత్యామ్నాయ జీవన విధానం. జీవావరణంలో ఒక భాగమై దోపిడీకి గురికానివ్వని సహకార సంబంధాలపై ఇది ఆధారపడి ఉంటుంది.
భూమి, ప్రజల సంరక్షణకు అవసరమైన సుస్థిర, నైతిక, మనగల వ్యవస్థల రూపకల్పనకు ఇది పనిచేస్తుంది!’
ఆస్ట్రేలియాలో పుట్టి.. అంతటా విస్తరించి..
శాశ్వత వ్యవసాయ భావన దాదాపు ఏభయ్యేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో పురుడుపోసుకుంది. ఒకటి రెండు దేశాలు మినహా ప్రపంచం అంతటా విస్తరించింది. 1970వ దశకం మొదట్లో ఆస్ట్రేలియాలోని తాస్మానియాకి చెందిన డా. బిల్ మాలిసన్ పర్మాకల్చర్‌కు రూపుకల్పన చేశారు. ఈ కృషిలో డేవిడ్ హోమ్‌గ్రెన్ కూడా భాగస్వామి. జీవావరణ విధ్వంసానికి, వనరుల విధ్వంసానికి కారణభూతమవుతున్న ఏకపంటల (మోనోకల్చర్) పారిశ్రామిక వ్యవసాయ పద్ధతికి ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందించినందుకు 1981లో ఆయనకు రైట్ లైవ్లీహుడ్ అవార్డు (దీన్ని ప్రత్యామ్నాయ నోబుల్ బహుమతి అని అంటారు) లభించింది.
బిల్ మాలిసన్ అనేకసార్లు మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పర్యటించి పర్మాకల్చర్ భావనను చిన్న, సన్నకారు రైతుల కమతాలకు అనుసంధానం చేయటంపై ఆచరణాత్మక ప్రయోగాలు చేశారు. పేదరిక నిర్మూలన, వర్షాధార సేద్యం, పశువులను వ్యవసాయంతో అనుసంధానం చేయటం, చిన్న కమతాలను స్వయంపోషకంగా రూపొందించడం, పండ్ల తోటల్లో అంతర పంటల సాగు వంటి అంశాలపై కృషి చేశారు. బిల్ భావాలతో ప్రభావితులైన అరోరా, డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో పర్మాకల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది.
స్వయం సమృద్ధ జీవనం
కేవలం వార్షిక పంటలు పండించటమే కాకుండా వ్యవసాయాన్ని శాశ్వత ప్రాతిపదికగా చేపట్టటానికి అవసరమైన చట్రంగా పర్మాకల్చర్ పద్ధతిని మొదట రూపొందించారు. బహువార్షిక చెట్లు, పొదలు, వార్షిక, ఆహార ధాన్యపు పంటలు, మూలికలు, కూరగాయలు, పుట్టగొడుగులు, దుంపలు వంటి పలు పంటలతో పాటు పశువుల పెంపకాన్ని ప్రయోజనకరంగా చేపట్టి.. కుటుంబ, గ్రామీణ స్థాయిలో ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి తొలుత ఈ విధానాన్ని రూపొందించారు.
అయితే, కాలక్రమంలో పర్మాకల్చర్ ఆచరణలో పరిపుష్టమవుతూ మరింత విస్తృత అర్థాన్ని సంతరించుకుంది. ఇప్పుడు పర్మాకల్చర్ అంటే కుటుంబ స్థాయిలో ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించటం మాత్రమే కాదు. భూమి, సమాచారం, ఆర్థిక వనరులు, ప్రజలకు అందుబాటులో లేకపోతే ఆహారంలో స్వయం సమృద్ధి సాధ్యం కాదు. ఈ పుడమిలోని సహజ వనరులను అంతరింపచేయకుండా, కలుషితం చేయకుండా, నాశనం చేయకుండా ప్రజలు తమ భౌతిక, ఇతర అవసరాలను తీర్చుకునేలాగా స్వయం సమృద్ధ, స్వయం నిర్వహిత విధానాలను రూపొందించుకోవటానికి.. భూమితో సహా అన్ని వనరులను ప్రజలు సమకూర్చుకోవటానికి వివిధ ఎత్తుగడలతో కూడిన సమగ్ర జీవన విధానం అన్న విస్తృతార్థాన్ని పర్మాకల్చర్ సంతరించుకుంది.
భవిష్యత్తు తరాలపై భారం పడకుండా..
కేవలం వ్యవసాయం, ఆహారం గురించి మాత్రమే కాకుండా ప్రకృతి వనరులతో మానవులకు ఉండవలసిన సంబంధాలు, ఆ వనరులను నైతికబద్ధంగా, విజ్ఞతతో, జాగ్రత్తగా వాడుతూ మన బాధ్యతారహితమైన చర్యల వల్ల భవిష్యత్తు తరాలపై భారం పడకుండా చూడటమే పర్మాకల్చర్‌లో కీలకం అంటారు డాక్టర్ వెంకట్. మనం ఎంతటి జ్ఞానం.. సాంకేతిక విజ్ఞానం కనబరిచినా, సృజనాత్మకతను ప్రదర్శించినా వృక్ష జగత్తులోని సహజ, జీవ–పోషక ప్రక్రియలకు ప్రత్యామ్నాయాలను కనుగొనలేం. పునరుద్ధరించిన వ్యవసాయ జీవావరణంలో ఈ ప్రక్రియలు బలపడేలా చెయ్యటమే పర్మాకల్చర్ లక్ష్యం. వ్యవసాయం మానవ చర్య. కాబట్టి మన వ్యవసాయం ప్రకృతికి సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి. ప్రకృతి నియమాలను అతిక్రమించకుండా ఉండాలని పర్మాకల్చర్ దృక్పథం చెబుతుంది.
24 ఏళ్ల ‘అరణ్యం
వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించిన కొప్పుల నరసన్న, పునాటి పద్మ తొలి దశలో జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీలో రిసోర్స్ పర్సన్లుగా ఉంటూ రైతులతో పదేళ్లకు పైగా పనిచేశారు. బిల్ మాలిసన్, డా. వెంకట్ సాంగత్యంలో శాశ్వత వ్యవసాయాన్ని ఔపోశన పట్టిన నరసన్న, పద్మ అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థను ఏర్పాటు చేసి స్థానిక రైతాంగంలో పర్మాకల్చర్ వ్యాప్తికి శ్రీకారం చుట్టారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం సమీపంలోని బిడకదిన్నె గ్రామంలో 1999లో 11.5 ఎకరాలను కొనుగోలు చేసి ‘అరణ్య శాశ్వత వ్యవసాయ క్షేత్రా’న్ని నెలకొల్పారు. తొలి దశలో టేకు సహా అనేక స్థానిక అటవీ జాతుల చెట్లతో పాటు పండ్లు, కలప జాతుల చెట్లను పెంచుతూ వచ్చారు. ఈ క్షేత్రం దేశంలోనే పర్మాకల్చర్ డిజైన్ కోర్సు (పీడీసీ) శిక్షణకు కేంద్ర స్థానంగా మారింది. కొప్పుల నరసన్న, పద్మ, స్నేహ బృందం ప్రతి రెండు నెలలకోసారి 15 రోజుల రెసిడెన్షియల్ పీడీసీ నిర్వహిస్తున్నారు. పొలంలోనే ఉంటూ, కలసి పనిచేస్తూ శాశ్వత వ్యవసాయాన్ని నేర్చుకోదలచిన వారికి, ముఖ్యంగా అంతకుముందు వ్యవసాయం తెలియని వారికి ‘అరణ్య’ క్షేత్రం మంచి సాగు‘బడి’.
పర్మాకల్చర్ డిజైన్ అంటే?
ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవటంతోపాటు ప్రత్యేక డిజైన్ ప్రకారం పంటల జీవవైవిధ్యం ద్వారా ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే దారులను పర్మాకల్చర్ చూపుతుంది. భూసారం పెంపుదల.. వాన నీటి సంరక్షణకు కాంటూరు కందకాలు తీయటం.. పెనుగాలులు/గాడ్పుల నుంచి పంటలను కాపాడుకోవడానికి 12 రకాల అటవీ జాతి చెట్లను పొలం దక్షిణ సరిహద్దులో 6 మీటర్ల వెడల్పున పెంచటం.. గడ్డీ గాదం, ఆకులు అలములతో కంపోస్టు చేయటం.. ఇవన్నీ నరసన్న,పద్మ నెలకొల్పిన అరణ్య పర్మాకల్చర్ క్షేత్రం డిజైన్‌లో ముఖ్యాంశాలు. భూమిని అనేక జోన్లుగా విభజించి.. ఏడాది పొడవునా సీజనల్ పండ్లు, కూరగాయలను డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. ఇతర జోన్లలో ఖరీఫ్, రబీ కాలాల్లో వర్షాధారంగా ధాన్యపు పంటలను పండిస్తున్నారు.
జోన్ 1: ప్రధాన ద్వారం దగ్గర ఉండే జోన్ 1లో వంట గది, స్టోర్ రూమ్, వాలంటీర్ల గది, బావితో పాటు కొన్ని అటవీ జాతుల చెట్లు ఉంటాయి. అనేక రకాల పండ్ల మొక్కలను వృత్తాలు(సర్కిళ్లు)గా నాటి సాగు చేస్తున్నారు. వృత్తం చుట్టూతా మునగ, బొప్పాయి, అరటి, చెన్నంగి, చిలగడదుంప వంటి పంటలతో పాటు నిమ్మగడ్డి వంటి ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. జోన్ 2: నర్సరీ, కూరగాయల తోట ఉంటాయి. జోన్ 3: ధాన్యపు పంటల విభాగాలు 3, కూరగాయలు పండించే 3 విభాగాలు, వాన నీటి కుంట ఉంటాయి. జోన్ 4: పండ్ల చెట్లతో పాటు అటవీ జాతుల చెట్లు ఉంటాయి.
బోదెలపై కూరగాయలు
కూరగాయల విభాగంలో కాంటూరు ప్రకారం ఎస్ ఆకారంలో బోదెలు తోలి అనేక రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు. కాంటూరు బోదెలను ఎస్ ఆకారంలో ఏర్పాటు చేయటం వల్ల ఎండ, గాలి, నీరు వంటి ప్రకృతి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటానికి వీలవుతోంది. అరణ్య వ్యవసాయ క్షేత్రంలో కూరగాయలకు మాత్రమే డ్రిప్‌తో నీటిని అందిస్తున్నారు. జొన్న, శనగ, కంది తదితర పంటలను వర్షాధారంగానే సాగు చేస్తున్నారు.
పంట మోళ్లతో కంపోస్టు
పొలం లోపలి వనరులను సమర్థవంతంగా పునర్వినియోగించుకోవాలని, బయటి నుంచి ఎటువంటి ఎరువూ తెచ్చి పంటలకు వేయకూడదన్నది పర్మాకల్చర్‌లో మరో ముఖ్యసూత్రమంటారు నరసన్న. పొలంలో పంటల నుంచి వచ్చిన మోళ్లు, రాలిన ఆకులు, కొమ్మలు, రెమ్మలను మూలన ఒక గుంత తవ్వి కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. పర్మాకల్చర్ సాంఘిక బాధ్యతతో స్థానిక పంటల జీవవైవిధ్యాన్ని పరిరరక్షించటం నేర్పిస్తుందని నరసన్న అంటారు. సొంత తిండి పంటల విత్తనాలను నిలబెట్టుకోవటమే రైతులకున్న తొలి కర్తవ్యంగా పర్మాకల్చర్ నొక్కిచెబుతుంది. సొంత విత్తనాన్ని కోల్పోయిన రైతు, జాతి ఆహార సార్వభౌమత్వాన్ని కోల్పోయినట్టేనని ఆయన అంటారు. అందుకే, అన్నదాతా సుఖీభవకన్నా ముందు విత్తు దాతా సుఖీభవ అంటారాయన!
కుటుంబానికి ఎంత క్షేత్రం కావాలి?
శాశ్వత వ్యవసాయ పద్ధతుల్లో ఒక పొలం పూర్తిస్థాయిలో ఫలితాలను అందించాలంటే సారం కోల్పోయిన భూమి పునరుజ్జీవం పొందాలి. అందుకు తగినంత సమయం పడుతుంది. డిజైన్ ప్రకారం వాన నీటి సంరక్షణ, వివిధ స్థానిక జాతలు మొక్కలు నాటడం, కంపోస్టు తయారీ, అన్ని పనులనూ వ్యక్తిగత శ్రద్ధతో రైతు కుటుంబం స్వయంగా చేసుకుంటూ వెళితే 3–4 ఏళ్ల సమయం పడుతుంది. అన్ని వనరులూ సమకూర్చుకొని ముందడుగు వేయాలి.
ఒక అంచనా ప్రకారం.. నలుగురైదుగురి కుటుంబానికి ఏడాది పొడవునా పండ్లు, కూరగాయలు అందించడానికి 1–2 ఎకరాల పర్మాకల్చర్ ఫామ్ చాలు. వీటితో పాటు ధాన్యాలు కూడా సమకూర్చుకోవాలంటే ఆ కుటుంబం కనీసం 4–5 ఎకరాల్లో ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలోచించుకొని స్థిరంగా అడుగులు వేస్తున్న కుటుంబాలు శాశ్వత వ్యవసాయ సత్ఫలితాలను అందుకుంటున్నాయి.
పరిసరాలకు మధ్య సుహృద్భావ సంబంధం.. ప్రకృతిలోని జీవావరణ వ్యవస్థలను పోలిన వైవిధ్యం, స్థిరత్వం, ఆటుపోట్లను తట్టుకునే గుణం కలిగిన వ్యవసాయ ఉత్పాదక జీవావరణ వ్యవస్థలుగా వ్యవసాయ క్షేత్రాలను రూపొందించి, నిర్వహించటమే పర్మాకల్చర్. అది ప్రజలకు, వారి పరిసరాలకు మధ్య ఒక సుహృద్భావ సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ప్రజల ఆహార, ఆవాస, ఇంధన, ఇతర భౌతికమైన, భౌతికేతర అవసరాలను సుస్థిర పద్ధతిలో తీరుస్తుంది.
– బిల్ మాలిసన్, పర్మాకల్చర్ పితామహుడు (‘పర్మాకల్చర్.. ఎ డిజైనర్స్ మాన్యువల్’ నుంచి)
ఇంటిల్లిపాదీ ప్రకృతితో మమేకమై..
అబిద్ అలి.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. 2019లో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం నారెగూడెంలో 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సోదరుడు షబ్బర్, మరో నాలుగు కుటుంబాలతో కలసి జీవిస్తున్నారు. అనహద్ ఎకో కమ్యూనిటీ అని పేరుపెట్టారు. మట్టి ఇటుకలు, స్థానిక సామాగ్రితో పర్యావరణహితమైన ఇళ్లను నిర్మించుకొని పర్మాకల్చర్ పద్ధతుల్లో పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు. తమ పిల్లలకు తామే చదువు చెప్పుకుంటున్నారు. ఇంటి పక్కనే 3–4 ఎకరాల్లో పండ్ల చెట్లతో కూడిన అడవిని సాగు చేస్తున్నారు. ‘ఫుడ్ ఫారెస్ట్ కొద్ది సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో పెరిగిన తర్వాత తరతరాలకు నిరంతరం పండ్లనిస్తుంది. మా ఆహారం మేము పండించుకుంటూ, ఆరోగ్యంగా, ఆనందంగా కలసిమెలసి ఇంటిల్లపాదీ ప్రకృతితో మమేకమై జీవించాలన్నదే ఆకాంక్ష’ అన్నారు అబిద్.
పర్మాకల్చర్ జీవితాన్ని మార్చేసింది!
విద్యారావు హైదరాబాద్‌కు చెందిన మాజీ నటి. వికారాబాద్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో చక్కని ఇల్లు నిర్మించుకొని పర్మాకల్చర్ పద్ధతిలో కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారికి ముందే పర్మాకల్చర్ నేర్చుకోవటం తమ కుటుంబానికి ఎంతో మేలు చేసిందన్నారు. వ్యవసాయం బొత్తిగా ఎరుగని తనకు పీడీసీ కోర్సు చాలా నేర్పిందన్నారు. ఆమె 16 దేశీ ఆవులను, నాటు కోళ్లను, తేనెటీగలను సైతం పెంచుతున్నారు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి, జీవవైవిధ్యం సుసంపన్నతను తెలియజెప్పడానికి పర్మాకల్చర్ ఉపయోగకరమన్నారు. ప్రతి స్కూల్‌లోనూ పర్మాకల్చర్ ప్రాక్టికల్ పాఠాలు చెప్పాలన్నారు. విభిన్న వ్యక్తులను అర్థం చేసుకొని, సహనంతో, సామరస్యంగా జీవించడానికి పర్మాకల్చర్ అవసరమంటారు విద్యారావు.
ఫారెస్ట్‌లో జరుగుతున్నదే..
అటవీ శాఖలో డీఎఫ్‌ఓగా పనిచేసి 2019లో రిటైరైన కోడూరి రవీందర్ కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం యల్లారం గ్రామంలో 11 ఎకరాల నల్లరేగడి భూమిలో పర్మాకల్చర్ వ్యవసాయం చేస్తున్నారు. ‘అడవిలో ప్రతి ఏటా విత్తనాలు రాలుతుంటాయి, వర్షం పడుతుంది, పశువులు, పక్షులు, కీటకాలు సహజంగానే సమతుల్యతతో జీవిస్తూ ఉంటాయి. ఫుడ్ ఫారెస్ట్‌ను కూడా ఇదే సూత్రాలతో నిర్మిస్తే సుస్థిరంగా ఫలితాలనిస్తుంది’ అంటారాయన. 3 ఏళ్లుగా ఏడెకరాల్లో పండ్ల చెట్లతో కూడిన 5 అంచెల్లో ఫుడ్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 4 ఎకరాల్లో కందులు తదితర పంటలు సాగు చేస్తున్నారు. ‘మరో ఐదేళ్లలో తన క్షేత్రం పూర్తిస్థాయి ఫలితాలనిస్తుంది. 11 ఎకరాల్లో ఏడాదికి రూ. 25 లక్షల ఆదాయం వస్తుంద’ని రవీందర్ ఆశిస్తున్నారు.
పర్మాకల్చర్ టూల్స్
మనకున్న భూమిలో మన ఆహారాన్ని మనం పండించుకోవటం ముఖ్యం. ప్రకృతి వనరులకు నష్టం కలగకుండా పంటలు పండించుకునే నేచర్ టూల్స్‌ని పర్మాకల్చర్ మనకు ఇస్తుంది. 2014లో తొలి బ్యాచ్‌లోనే నరసన్న దగ్గర పర్మాకల్చర్ కోర్సు చేశా. మా 5 ఎకరాల్లో కూరగాయలు, పండ్లు పండిస్తున్నాను. 12 బర్రెలు, 50 నాటు కోళ్లు స్వేచ్ఛగా పెరుగుతున్నాయి. మొరం నేలకు తగినట్లుగా కొన్ని స్థానిక పండ్ల చెట్లు పెంచుతున్నాను. భూమి ఆరోగ్యం బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతున్నా. వ్యవసాయం ఒక తపస్సు!
– మలిపెద్ది రమేశ్‌రెడ్డి, పర్మాకల్చరిస్టు, కాచవానిసింగారం, ఘట్‌కేసర్ మండలం, మేడ్చల్ జిల్లా
కందకాలలో వట్టివేరు మొక్కలు..
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ పర్మాకల్చర్ డిజైన్ కోర్సు పూర్తి చేసి అనంతపురం జిల్లాలోని తమ బీడు భూమిలో ఫుడ్ ఫారెస్ట్ అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నారు. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామంలోని తన తల్లి మాలతికి ఏడెకరాల భూమి ఉంది. తువ్వ నేల కావటంతో భూసారం తక్కువగా ఉంది. వాలుకు అడ్డంగా కందకాలు తవ్వి, ఆ కందకాలలో వట్టివేరు మొక్కల్ని నాటారు. అవి పెరిగిన తర్వాత కత్తిరించి పండ్ల మొక్కల మొదళ్లలో ఆచ్ఛాదన చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పర్మాకల్చర్ పద్ధతులను మిళితం చేసి 2 ఎకరాల్లో 10 రకాల పండ్ల మొక్కలు నాటామని మాలతి తెలిపారు.
--పంతంగి రాంబాబు
(చదవండి: కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? సైన్స్ ఏం చెబుతోంది..?)
Comments
Please login to add a commentAdd a comment