సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 95 శాతం ఉన్న రైతన్నలను అవమానపరిచేలా మూడు గంటల విద్యుత్ సరఫరా చాలు, ఉచిత విద్యుత్ అవసరం లేదన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు చేస్తుందన్న మాటను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
శనివారం ఆయన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చే మూడు పంటలు కావాలాం.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మూడు గంటల కరెంటు కావాలా’అన్న నినాదంతో ముందుకు సాగాలంటూ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మూడు గంటల కరెంటు చాలు అంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ప్రతి గ్రామంలో, ప్రతి రైతు ఇంట్లో చర్చ జరిగేలా చూడాలన్నారు.
రేవంత్‌ది కూడా చంద్రబాబు విధానమే..
రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతన్నల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుంటే.. రైతుల పట్ల, వ్యవసాయ రంగంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తు అనుచితమంటూ మాట్లాడిందని కేటీఆర్ విమర్శించారు.
2001లో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు తరహాలోనే ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి కూడా మాట్లాడారని, ఈ విషయాన్ని రాష్ట్రంలోని ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలని పిలుపు నిచ్చారు. చంద్రబాబు రైతు, వ్యవసాయ వ్యతిరేక ఆలోచన విధానంతోనే రేవంత్ కూడా ఉచిత విద్యుత్తుపై అడ్డగోలుగా మాట్లాడారని చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగు కాంగ్రెస్, చంద్రబాబు కాంగ్రెస్ అన్న విషయాన్ని ప్రజలకు తెలియ జెప్పాలన్నారు. ఉచిత విద్యుత్తు వద్దు – కేవలం మూడు గంటల విద్యుత్ చాలు అంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని, అందుకే తెలంగాణలో రైతులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్పందించారని పేర్కొన్నారు.
17 నుంచి రైతు సమావేశాలు
కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈనెల 17వ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు కేటీఆర్ సూచించారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం 1,000 మంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించాలని, ఈ బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాలని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కష్టాలను, బీఆర్‌ఎస్ పాలనలో అందుతున్న కరెంటు గురించి రైతులకు వివరించాలని కోరారు. ఉచిత విద్యుత్తుపై చేసిన కాంగ్రెస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, రైతాంగానికి ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment