సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్‌కు ఉరివేసేందుకు గాంధీభవన్ కేంద్రంగా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను రైతులు తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్ వద్దంటున్న వారిని ఊరి పొలిమేర దాకా ఉరికించాలని, మూడు గంటల కరెంట్ చాలంటున్న వారి మాడు పగిలేలా జవాబు చెప్పాలన్నారు. రైతులకు ఊపిరి లాంటి ఉచిత విద్యుత్‌ను నిలిపివేసి అన్నదాతల ఉసురు తీస్తా మని కాంగ్రెస్ చెప్పడం ఆ పార్టీ రాక్షస బుద్ధికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.
రైతాంగానికి ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ఆలోచన విధానానికి వ్యతిరేకంగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటున్న కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేయాలన్నారు. రైతులను పొడుచుకు తినేందుకు కాచుకు కూర్చున్న కాంగ్రెస్ రాబందుల్ని తరిమికొట్టి రైతు బంధువులకు అండగా నిలవాలని చెప్పారు.
రైతాంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేశాం
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేసి రైతాంగాన్ని రక్షించేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చించి ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయతోపాటు అనేక సాగునీటి పథకాలు చేపట్టిందన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ట అని, ధరణి రద్దు, రైతుబంధు వద్దు అంటూ ఇప్పటికే వరుసగా రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ హయాంలో ఎదురైన కష్టాలను రైతులు మరిచిపోరని, నాసిరకం విద్యుత్ సరఫరాతో ట్రాన్ఫ్‌ఫార్మర్లు, మోటార్లు కాలి రైతులు నిద్రలేని రాత్రులు గడిపారన్నారు. కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రి కరెంటుతో రైతులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడ్డారని, ఎరువులు, విత్తనాల కొరత, కల్తీ విత్తనాలు, పురుగు మందులు కూడా రైతులను కాటేశాయని చెప్పారు.
ఉచిత విద్యుత్‌ను ఎత్తేసి మోటార్లకు మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మెడపై కత్తి పెట్టినా రైతులను కాపాడుకునేందుకు రూ.30 వేల కోట్లు వదులుకున్నామని కేటీఆర్ అన్నారు. రైతులు బాగుపడటాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని, గతంలో మాదిరిగా బ్రోకర్లు, దళారులను తిరిగి తెచ్చేందుకు ధరణి పోర్టల్ రద్దు చేస్తామంటూ ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాం నాటి చీకటి యుగాన్ని మళ్లీ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister KTR: ఉచిత విద్యుత్ వద్దంటే.. ఊరి పొలిమేర దాకా ఉరికించండి
Published Wed, Jul 12 2023 12:47 AM | Last Updated on Wed, Jul 12 2023 8:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment