‘ప్రత్యేక పనులకు’ పాతర
నీలగిరి : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్) కింద మంజూరైన పనులపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టి సారించింది. సొంత రాజకీయ ప్రయోజనాలు, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకే నిధుల కేటాయింపు జరిగిందని ఆరోపణల నేపథ్యంలో ఆ పనులను నిలిపివేయాలని నిర్ణయించింది.
ఎన్ని పనులు...ఎక్కడెక్కడ..
గతేడాది అక్టోబర్ 1 తర్వాత ఎస్‌డీఎఫ్ కింద మంజూరైన పనుల వివరాలను తెలియజేయాల్సిందిగా జిల్లా ప్రణాళిక విభాగానికి ఇటీవల ఆదేశాలు వచ్చాయి. జిల్లాకు ఎన్ని పనులు మంజూరయ్యాయి..? ఎన్ని అసంపూర్తిగా ఉన్నా యి..? ఇప్పటికీప్రారంభం కాని పనులెన్ని..? తదితర వివరాలు కోరింది. పనిలోపనిగా ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులు, అసంపూర్తిగా ఉన్న పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మన జిల్లాలో దాదాపు 7 కోట్ల రూపాయల పనులు ఎక్కడి కక్కడే ఆగిపోయాయి.
అప్పటి ఎమ్మెల్యేల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడకు, కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, బాలునాయక్‌లు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు స్పెషల్‌కోటా కింద ముఖ్యమంత్రి సిఫారసుతో 12.50కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నారు. ఈ నిధులతో ఆయా నియోజకవర్గాల్లో 337 పనులు చేపట్టారు. వీటిలో 185 పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నామినేటెడ్ పద్ధతిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే వీటిని దక్కించుకున్నారు. తమకు లాభసాటిగా ఉంటుందని, లింక్‌రోడ్లు, సిమెంట్ రోడ్లుకు ఈ నిధులు వెచ్చించారు. దీంతో అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా... పార్టీ శ్రేణుల పంట పండింది.
నియోజకవర్గాల వారీగా...
ఆలేరు నియోజకవర్గానికి రూ.3.50కోట్లు మంజూరు చేశారు. 112పనులకుగాను 29 పనులు పూర్తయ్యాయి. మరో 23పనులు పురోగతిలో ఉం డగా, 60 పనులు ఇంకా మొదలు పెట్టలేదు. దేవరకొండ నియోజకవర్గానికి రూ.2కోట్లు మంజూరు చేశారు. 49 పనులకు గాను 32 పనులు పూర్తయ్యాయి. 14 పనులు పురోగతిలో ఉన్నాయి. 3 పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
సూర్యాపేట నియోజకవర్గానికి రూ. 3 కోట్లు మం జూరు అయ్యాయి. మొత్తం 128 పనులకు గాను 6 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 122 పనులు అసంపూర్తిగానే ఉన్నాయి సాగర్ నియోజకవర్గానికి రూ.2 కోట్లు మంజూరు చేశారు. 46పనులకు గాను 24పనులు పూర్తయ్యా యి. మిగిలిన 22పనులు పురోగతిలో ఉన్నాయి. కోదాడ నియోజకవర్గానికి మంజూరైన రూ.2 కోట్లకు గాను చేపట్టిన రెండు పనులు పూర్తయినట్లు అధికారులు ఓ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు.
నియోజకవర్గ నిధులదీ అదే పరిస్థితి..
నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద చేపట్టిన పనులకూ ప్రభుత్వం బడ్జెట్ నిలిపేసింది. ఈ పథకం కింద ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి కోటిరూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎన్నికల కోడ్ కారణంగా ఈ పనుల బడ్జెట్‌కు బ్రేక్ పడింది. దీంతో పనులు పూర్తయినా, బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. 12 మంది ఎమ్మెల్యేలతో పాటు, ఇద్దరు ఎమ్మెల్సీలకు కలిపి రూ. 14 కోట్ల బడ్జెట్ ఉంటుంది. మొదటి ఆరునెలలకు గాను గత ఏడాది రూ. 7 కోట్లు విడుదల చేశారు. చివరి ఆరునెలలకు పనులకు సంబంధించి రూ. 7 కోట్లు ఇంకా పెండింగ్‌లో నే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితేనే ఈ నిధులకు మోక్షం లభించే అవకాశముంది.