అదనపు లిక్విడిటీ వినియోగంపై కేంద్రం సమీక్ష
న్యూఢిల్లీ: వ్యవస్థలో ఉన్న అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) వినియోగంపై శుక్రవారం బ్యాంకింగ్‌తో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక సమీక్ష నిర్వహించింది. ఇందుకు సంబంధించి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్)ని ప్రవేశపెట్టే అంశంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కొందరు బ్యాంకర్లు దీనికి అంగీకరించగా, మరికొందరు స్కీమ్ మొత్తాన్ని మదింపు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం.
ఎక్సే్ఛంజీలో ఎటువంటి హామీ అవసరం లేకుండా, అదనపు ద్రవ్య లభ్యతను వ్యవస్థ నుంచి వెనక్కు తీసుకోడానికి ఈ స్కీమ్‌ను ప్రతిపాదిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు బ్యాంకుల చీఫ్‌లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన భారీ డిపాజిట్ల వల్ల బ్యాంకుల వద్ద అధిక ద్రవ్య లభ్యత పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.