
వృద్ధికి ఊతమివ్వాలని భావిస్తే ఆర్‌బీఐ(RBI) రేట్ల కోతకు బదులు ద్రవ్య లభ్యత పరిస్థితులను సులభతరం (లిక్విడిటీ) చేయడంపై దృష్టి పెట్టాలని యాక్సిస్ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త నీల్‌కాంత్ మిశ్రా సూచించారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో మిశ్రా పార్ట్ టైమ్ సభ్యుడిగా ఉన్నారు. ఈ నెల మొదట్లో పావు శాతం మేర రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించడం తెలిసిందే. అలాగే, తదుపరి పాలసీ సమీక్షల్లోనూ మరింత రేట్ల కోతతో రుణ వితరణ పెరగదని, ద్రవ్య కొరత రేట్ల కోత బదిలీకి అడ్డుపడుతుందని చెప్పారు.
‘రేట్ల కోత ఉద్దేశ్యం మరిన్ని రుణాల జారీ అయితే.. కొత్త రుణాలు తక్కువ రేట్లపై జారీ చేయడం అసాధ్యం. ఎందుకంటే ద్రవ్య నియంత్రణ కట్టడి చర్యల ఫలితంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ మనీ 18 నెలలుగా అధిక స్థాయిలో కొనసాగుతోంది. రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత కూడా ఏడాది కాల సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ల రేటు 7.8 శాతం వద్దే కొనసాగుతోంది’ అని మిశ్రా వివరించారు. ఆర్‌బీఐ రెగ్యులర్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్‌ను చేపట్టడం ద్వారా తగినంత లిక్విడిటీ ఉండేలా చూడొచ్చన్నారు. లేదంటే నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను తగ్గించడం మరింత ఫలితాన్నిస్తుందన్నారు. లిక్విడిటీ సాధారణ స్థాయికి చేరి, ప్రభుత్వం ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడితే 2025–26 ద్వితీయ త్రైమాసికం నుంచి జీడీపీ వృద్ధి 7 శాతం రేటును చేరుకోవచ్చని అంచనా వేశారు.
క్యూ3లో 6.4 శాతం వృద్ధి: ఇక్రా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 6.4 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ప్రభుత్వ వ్యయాలు పెరగడం ఇందుకు సాయపడుతుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేయగా, జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 5.4 శాతానికి పడిపోవడం గమనార్హం. గతేడాది సాధారణ ఎన్నికల ముందు ప్రభుత్వం అంచనాల మేరకు మూలధన వ్యయాలు చేయలేకపోవడం, డిమాండ్ బలహీనత ఇందుకు దారితీశాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన, రెవెన్యూ వ్యయాలు పెంచడం, సేవల ఎగుమతుల్లో అధిక వృద్ధి, వస్తు ఎగుమతులు పుంజుకోవడం, ప్రధాన ఖరీఫ్ పంటల దిగుబడి మెరుగ్గా ఉండడం డిసెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక పనితీరు బలపడేందుకు దోహదం చేస్తాయని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ వివరించారు.
ఇదీ చదవండి: ట్రేడింగ్–డీమ్యాట్ ఖాతా లాగిన్ మరింత భద్రం!
మొత్తం మీద క్యూ3లో జీడీపీ, జీవీఏ విస్తరణ కొనసాగుతుందన్నారు. పెట్టుబడులకు సంబంధించి సంకేతాల్లో వృద్ధి కనిపిస్తున్నట్టు ఇక్రా తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వాల మూలధన వ్యయాలు ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయి 47.7 శాతానికి క్యూ3లో పెరిగినట్టు, అంతకుముందు త్రైమాసికంలో ఇది 10.3 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. క్యూ3 జీడీపీ వృద్ధి అంచనాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో ముందస్తు జీడీపీ అంచనాలను సైతం ఎన్‌ఎస్‌వో ప్రకటించనుంది. జనవరిలో విడుదల చేసిన తొలి అంచనాల ప్రకారం 2024–25లో వృద్ధి నాలుగేళ్ల కనిష్టం 6.4 శాతానికి తగ్గనుంది. కానీ, ఆర్‌బీఐ మాత్రం 6.6 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment