ఎస్‌డీఎఫ్ పనులకు ఎసరు
- ఎమ్మెల్యేలకు పుష్కలంగా పత్యేక నిధులు
- నామినేషన్ పద్ధతిపై అనుచరులకు పనులు
- నిలిపివేయమన్న చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పాలకపక్షాలు మారిన ప్రతి సందర్భంలో గత ఏలికల ఆదేశాలను నిలిపివేయడం లేదా వాటిని తిరగ తోడటం పరిపాటిగా వస్తున్నదే. ఇప్పుడు చంద్రబాబు సర్కారూ అదే పంథాను అనుసరిస్తోంది. దాంతో.. ఎన్నికల్లో లబ్ధి కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు గత ఫిబ్రవరిలో మంజూరు చేసిన నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్‌డీఎఫ్)తో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న పనులను నిలిపివేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ మేరకు సర్కారు నుంచి జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు వచ్చాయి.
సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అప్పటి ఎమ్మెల్యేలకు ఎస్‌డీఎఫ్ పేరుతో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వారికి.. రూ.5 లక్షల వరకూ వ్యయమయ్యే పనుల్ని టెండర్లతో నిమిత్తం లేకుండా నామినేషన్ ప్రాతిపదికన కట్టబెట్టే వెసులుబాటు కల్పించి అవినీతికి తలుపులు బార్లా తెరిచారు.
సీసీ రోడ్లు, మంచినీటి సరఫరా, కమ్యూనిటీహాళ్లు, డ్రైన్‌లతో కూడిన రోడ్ల పనులను ఎస్‌డీఎఫ్‌తో చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. ఎమ్మెల్యేలే రూపొం దించిన ప్రతిపాదనల ప్రకారం నిధులు మంజూరు చేయించుకుని తమ అనుచరగణానికి పనులు అప్పగించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉదారంగా నిధు లిచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇతర ఎమ్మెల్యేలకు మొ క్కుబడిగా మంజూరు చేశారు. ఎస్‌డీఎఫ్ నిధులు గ త ఫిబ్రవరిలోనే మంజూరు చేసినా..2011-12, 20 12-13, 2013-14 సంవత్సరాల కోసమూ అప్పటి ఎమ్మెల్యేలు పనుల్ని ప్రతిపాదించారు. జిల్లాలో 2,216 పనులకు కిరణ్ సర్కార్ రూ.98,27, 66,000లకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది.
25 శాతం కూడా పూర్తికాని పనులు
జిల్లాకు మంజూరైన పనుల్లో 513 పూర్తి కాగా, 1011 వివిధ దశల్లో ఉన్నట్టు సమాచారం. ఈ పనులకు సుమారు రూ.88 కోట్లు రాగా, ఇప్పటికే రూ.48 కోట్లు నామినేషన్‌పై పనులు చేస్తున్న వారికి విడుదల చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చేసరికే పనులన్నీ పూర్తి చేయాలని అప్పటి ఎమ్మెల్యేలు తొందరపడ్డా 25 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ తరుణంలో ఎస్‌డీఎఫ్ పనులు ఎక్కడివక్కడే నిలిపివేయాలని ఆదేశాలు రావ డంతో ఇప్పటికే పనులు ప్రారంభించి, లక్షలు పెట్టుబడి పెట్టామని, వివిధ దశల్లో ఉన్న పనులు నిలి చిపోతే తమ గతి ఏమిటని మాజీ ఎమ్మెల్యేల అనుచరులు లబోదిబోమంటున్నారు.
గతంలో కాంగ్రెస్‌లో ఉండి ప్రస్తుతం టీడీపీలోకి వచ్చి ఎంపీ, ఎమ్మెల్యేలైన తోట నరసింహం, తోట త్రిమూర్తులు, టీడీపీ తరఫున తిరిగి ఎమ్మెల్యేలైన పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావులతో పాటు ఎన్నికలకు టీడీపీ తరఫున ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు తమ, తమ నియోజకవర్గాల్లో అనుచరులు చేపట్టిన పనులకు నిధులు ఎలాగోలా విడుదల చేయించగలమన్న భరోసాతో ఉన్నారు. కాగా మిగిలిన వారి పరిస్థితే సందిగ్ధంలో చిక్కుకుంది.
వివాదాలకు ఆస్కారం
ప్రత్యేక నిధులతో చేపట్టే పనులు కొన్ని నియోజకవర్గాల్లో వివాదాలకు దారి తీయనున్నాయి. జగ్గంపేట లో అప్పటి ఎమ్మెల్యే తోట నరసింహం అత్యధికం గా నిధులు మంజూరు చేయించుకుని అనుచరుల కు పనులు అప్పగించారు. ఆయన ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఎన్నికవడం, అక్కడ వైఎస్సార్ కాం గ్రెస్ తరఫున జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే కావడంతో ఆ పనుల విషయంలో వివాదం తలెత్తే పరిస్థితి కని పిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో గత ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులను ఇప్పటి ఎమ్మెల్యేలు వ్యతిరేకించి తమకు నచ్చిన ప్రాంతాల్లో పనులు చేయించాలనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎస్‌డీఎఫ్ వ్యవహారాన్ని ఎలా చక్కబెడుతుంతో వేచి చూడాల్సిందే.