జ్యోతిబసు రికార్డుకు చేరువలో చామ్లింగ్
గ్యాంగ్‌టక్: దేశంలో అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వ్యక్తిగా దివంగత జ్యోతిబసు నెలకొల్పిన రికార్డును సిక్కిం సీఎం పవన్ చామ్లింగ్ బద్దలు కొట్టనున్నారు. సిక్కింలో వరుసగా ఐదో సారి ఆయన అధికార పీఠం అధిష్టించనున్నారు. చామ్లింగ్ 1994 డిసెంబర్ 12న సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇప్పటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు. కమ్యూనిస్టు నాయకుడు దివంగత జ్యోతిబసు 23 ఏళ్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
ఆయన 1977 జూన్ 21న సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 2000 నవంబర్ 5 వరకూ పదవిలో కొనసాగారు. శుక్రవారం నాటి సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్) మూడింట రెండొంతుల మెజారిటీని సాధించింది. మొత్తం 32 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 22 చోట్ల ఎస్‌డీఎఫ్ ఘన విజయం సాధించింది. రంగాంగ్-యంగాంగ్, నంచీ-సింగితాంగ్ స్థానాల నుంచి పోటీ చేసిన చామ్లింగ్ రెండు చోట్లా రికార్డు మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలోని ఒకే ఒక్క లోక్‌సభ స్థానంలో కూడా ఎస్‌డీఎఫ్ అభ్యర్థి పీడీ రాయ్ సుమారు 42 వేల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.