అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా: సీఎం
గ్యాంగ్‌టక్: ప్రత్యేక గుర్ఖాలాండ్ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ డిమాండ్ చేశారు. గుర్ఖాలాండ్ సమస్య కేవలం బెంగాల్ ప్రజల సమస్య మాత్రమే కాదని, అక్కడ ఉద్యమాల కారణంగా తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం సత్వరమే ఈ విషయమై జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించని పక్షంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగించడానికి తాము ఉన్నతస్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధమని సిక్కిం సీఎం చామ్లింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
సిక్కిం రాష్ట్రం భౌగోళికంగా చైనా, భూటాన్, నేపాల్ రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉండటంతో ఓవైపు విదేశాల నుంచి దాడుల ముప్పు ఉండగా.. మరోవైపు పొరుగురాష్ట్రం బెంగాల్‌లో జరుగుతున్న ఆందోళన కారణంగా సిక్కిం సరిహద్దు ప్రాంతాల్లో రవాణా, వస్తు సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు. వీటి కారణంగా సిక్కిం ప్రజలు భారీ పరిణామాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఓ వైపు చైనా, మరోవైపు బెంగాల్‌ల మధ్య తమ రాష్ట్రం నలిగిపోతోందని పవన్ చామ్లింగ్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. గత ముప్ఫై ఏళ్లుగా గుర్ఖాలాండ్ ఉద్యమం వల్ల సిక్కిం రూ. 60 వేల కోట్లు నష్టపోయిందని, కేవలం చైనా, బెంగాల్‌ల మధ్య నలిగిపోవడానికి సిక్కిం రాష్ట్రం భారత భూభాగంలో ఐక్యం కాలేదని ప్రకటనలో పేర్కొన్నారు.
దేశానికి సిక్కింతో ఉన్న ఏకైక రోడ్డు మార్గమైన జాతీయ రహదారి 10 బెంగాల్‌లోని కల్లోల ప్రాంతంలో ఉంది. గత నెల15వ తేదీ నుంచి కల్లోల ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది. ఎన్‌హెచ్ 10 గత 30 ఏళ్లుగా సిక్కిం రాష్ట్ర వీక్ పాయింట్‌గా మారిందన్న పవన్ చామ్లింగ్.. గుర్ఖాలాండ్ ఉద్యమం చెలరేగిన ప్రతిసారీ తమ రాష్ట్రం భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని ఈ నేపథ్యంలో కేంద్ర ఇప్పటికైనా ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు.