ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ, బాగ్దాదీపై దాడి జరిపిన ప్రాంతం
వాషింగ్టన్: ఉగ్రమార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్న ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ(48)ను అమెరికా సేనలు సిరియాలో అంతమొందించాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా అమెరికా సైన్యం కన్నుగప్పి దాడులకు పాల్పడుతున్న మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది బాగ్దాదీ.. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని బరీషా గ్రామంలోని అమెరికా సేనలు చేసిన ‘రహస్య దాడి’ సందర్భంగా చనిపోయాడని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
బాగ్దాదీ మరణించాక ఆ దాడి ప్రాంతం నుంచి అత్యంత విలువైన డాక్యుమెంట్లను అమెరికా సేనలు స్వాధీనంచేసుకున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణ, అంతర్జాతీయ సంబంధాల వివరాలు వాటిలో ఉన్నట్లు సమాచారం. ట్రంప్, అమెరికా సైనికాధిపతుల పర్యవేక్షణలో జరిగిన ఘటన క్షణ క్షణం నాటకీయంగా సాగినవైనమిది. బాగ్దాదీ స్థావరం ఇటీవల ఇరాక్ నుంచి వాయవ్య సిరియాకి మారింది. ఒక నెలక్రితం కుర్దుల నుంచి కచ్చితమైన సమాచారమందింది. ఆ గ్రామంలోనే బాగ్దాదీ ఉంటున్నట్లు రెండు వారాల క్రితం అమెరికా సేనలు నిర్ధారించుకున్నాయి. వాయవ్య సిరియాలోని స్థావరంపై దాడికి మూడు రోజుల ముందే ట్రంప్‌కి సమాచారం ఉంది. రష్యా, ఇరాక్, టర్కీ దేశాల అనుమతితో వాయు సేనలు సాగాయి.
ఆపరేషన్ కైలా ముల్లర్
బాగ్దాదీని పట్టుకోవడం కోసం బాగ్దాదీ చేతిలో తీవ్ర చిత్రహింసలపాలై, అత్యాచారానికి గురై హతమైన అమెరికా మానవహక్కుల కార్యకర్త 26 ఏళ్ళ కైరా ముల్లర్ పేరుని ఈ ప్లాన్‌కి పెట్టారు.
అసలేం జరిగింది?
వర్జీనియాలో ఒక రౌండ్ గోల్ఫ్ ఆట ముగించుకొని సరిగ్గా సాయంత్రం 5 గంటలకు వైట్ హౌస్‌లోని ‘సిట్యుయేషన్ రూమ్’కి అధ్యక్షుడు ట్రంప్ చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, అమెరికా భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రీన్‌లు సిట్యుయేషన్ రూమ్‌కి వచ్చారు. బాగ్దాదీపై సైనిక రహస్యదాడిని వీడియోలో వీక్షించేందుకే సిద్ధమయ్యారు.
గంటల్లో అంతా బూడిద
గ్రామంపై చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్లను గ్రామస్తులు గమనించారు. అమెరికా హెలికాప్లర్లు, సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే వారందరినీ అమెరికా సైనికులు మట్టుబెట్టారు. ఆ తర్వాత బాగ్దాదీ ఉంటున్న ఇంటి ముఖద్వారాన్ని బాంబులతో పేల్చారు. సైన్యం దాడి విషయం తెల్సి బాగ్దాదీ వెంటనే రహస్య సొరంగ మార్గం ద్వారా భూగృహం(బంకర్)లోకి చొరబడ్డాడు. ఆయనను బంకర్ చివరివరకు అమెరికా సైనిక సేనలు, సైనిక శునకాలు తరిమాయి. బయటపడే మార్గం లేకపోవడంతో తన శరీరానికున్న బాంబుల జాకెట్‌ను పేల్చుకుని బాగ్దాదీ చనిపోయాడు.
పిచ్చివాడిలా అరుచుకుంటూ..
అమెరికా సైనికులు చుట్టుముట్టడంతో ప్రాణభయంతో బాగ్దాదీ అరుచుకుంటూ, ఏడ్చుకుంటూ పరిగెత్తాడని ట్రంప్ వెల్లడించారు. అమెరికా సైనిక కే9 శునకాలు తరుముతుండడంతో చివరకు సొరంగంలోని బంకర్ చివరి అంచులకు చేరి తన ముగ్గురు పిల్లలతో సహా బాంబులతో పేల్చుకుని కుక్కచావు చచ్చాడని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వైట్‌హౌస్‌లో దాడి వీడియో ప్రత్యక్షప్రసారాన్ని చూస్తున్న అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్, జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్
Comments
Please login to add a commentAdd a comment