వాషింగ్టన్: సిరియాలో రసాయనిక దాడి నేపథ్యంలో శనివారం అమెరికా నేవీ బలగాలు సిరియా తీరానికి చేరువగా ముందుకు సాగుతున్నాయి. రసాయనిక దాడిపై నిజానిజాలు తేలిన తర్వాత సిరియాపై సైనిక చర్యకు దిగే అవకాశాలను అమెరికా పరిశీలిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జాతీయ భద్రతా బృందంతో చర్చలు జరిపారు. సిరియాలో జరిగిందేమిటో నిర్ధారించే సాక్ష్యాధారాలను సేకరించాల్సిందిగా ఒబామా ఇంటెలిజెన్స్ వర్గాలను ఆదేశించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ చెప్పారు. నిజా నిజాలను నిర్ధారించుకున్నాక ఒబామా ఈ అంశంపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారని తెలిపారు.
మలేసియా ప్రయాణమవుతున్న రక్షణశాఖ మంత్రి చక్ హాగెల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ భద్రతా బృందంతో ఒబామా జరిపిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ అంశంపై అధ్యక్షుడు ఒబామాతో తాను ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తుంటానని హాగెల్ మీడియాకు చెప్పారు. సిరియా వద్ద తమ బలగాలను మోహరించడం సహా అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని తెలిపారు. సిరియా రాజధాని డమాస్కస్‌కు చేరువలో గత బుధవారం జరిగిన రసాయనిక దాడిలో 1,300 మంది మరణించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ బలగాలు రసాయనిక దాడికి పాల్పడినట్లు తిరుగుబాటుదారులు ఆరోపిస్తుండగా, రసాయనిక ఆయుధాలను వినియోగించలేదని సిరియా ప్రభుత్వం చెబుతోంది.
కాగా, రసాయనిక ఆయుధాలను వినియోగిస్తే పాశ్చాత్య ప్రపంచం నుంచి సిరియా గట్టి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒబామా ఇదివరకే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సిరియాపై సైనిక దాడికి దిగే ముందు అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నారు. మరోవైపు, రసాయనిక ఆయుధాల వినియోగంపై దర్యాప్తుకు అంగీకరించేలా సిరియా అధ్యక్షుడు బషర్ అసద్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ఏంజెలా కానే డమాస్కస్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి దర్యాప్తుకు సహకరించాల్సిందిగా ఇప్పటికే పలు దేశాలు అసద్‌కు సూచించాయి.
తిరుగుబాటుదారులే రసాయనిక ఆయుధాలు వాడారు: సిరియా సర్కారు
తిరుగుబాటుదారులే రసాయనిక ఆయుధాలను వాడారని సిరియా ప్రభుత్వం శనివారం ఆరోపించింది. రసాయనాలతో నిండి ఉన్న బ్యారెల్స్, గ్యాస్ మాస్కులను ప్రభుత్వ టీవీ చానల్ చూపింది. తిరుగుబాటుదారుల స్థావరాల్లో ఉన్న ఈ ఆయుధాలు కొద్దిపాటి నమూనా మాత్రమేనని పేర్కొంది. సైన్యం ముందుకు సాగకుండా అరికట్టాలనే ఉద్దేశంతోనే తిరుగుబాటుదారులు ఈ ఆయుధాలను ఉపయోగించారని ఆరోపించింది.
సిరియా వైపు అమెరికా బలగాలు
Published Sun, Aug 25 2013 2:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
Advertisement
Advertisement