గత అర్ధరాత్రి సిరియా నగరంపై దాడుల దృశ్యాలు
డమస్కస్ : ఏడేళ్లుగా అంత్యర్యుద్ధం కోరల్లో చిక్కుకుని అపారనష్టానికి గురైన సిరియా నెత్తిన ఇప్పుడు మరో పిడుగు పడింది. అమెరికా దళాలు సిరియాలో వైమానిక దాడులు చేపట్టాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇవి కొనసాగుతున్నాయి. గత వారం సిరియా రాజధాని డమస్కస్‌లో రసాయనిక దాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు తాము ఈ దాడులకు తెగబడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
‘అమెరికా దళాలతోపాటు ఫ్రాన్స్, యూకే దళాలు సంయుక్తంగా ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. సిరియా నియంతాధ్యక్షుడు బషర్ అల్ అస్సద్ రసాయనిక దాడులకు పురిగొల్పుతుండటమే మేం ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమైంది. యూఎస్ భద్రతాధికారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశా’ ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. మరోవైపు ఆయన ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే డమస్కస్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.
రసాయనిక క్షిపణులను నిల్వ చేసిన ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని అమెరికన్ భద్రతాధికారి ఒకరు తెలిపారు. ఇంకోపక్క సిరియాలో మోహరించిన రష్యా-ఇరాన్ దళాలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ‘శాంతి కోరుకుంటున్న దేశాల పక్షాన నిలుస్తారా? లేక.. బషర్‌కి అండగా నిలుస్తూ జరగబోయే పరిణామాలకు భాద్యత వహిస్తారా? ఫలితం మీరే నిర్ణయించుకోండి’ అంటూ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు.
రష్యా హెచ్చరికలు..
సిరియాపై అమెరికా మరియు దాని మిత్రపక్ష సైన్యాలు చేపట్టిన ఆకస్మిక దాడులపై రష్యా స్పందించింది. పుతిన్‌ను అవమానించేలా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపేక్షించబోమని రష్యా విదేశాంగ ప్రతినిధి అనాటోలీ ఆంటోనోవ్ వెల్లడించారు. ఈ చర్యలకు ప్రతిగా అమెరికా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించాడు.
— AFP news agency (@AFP) 14 April 2018
Comments
Please login to add a commentAdd a comment