బీరుట్: సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో బుధవారం ప్రభుత్వ బలగాలు జరిపిన రసాయన దాడులకు 1,300 మంది అమాయక పౌరులు బలయ్యారన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. ప్రభుత్వ దాడులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. రసాయన దాడులకు గురైన ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న తూర్పు ఘౌటాలో గురువారం ఉదయం ప్రభుత్వ యుద్ధవిమానాలు మళ్లీ బాంబుల వర్షం కురిపించాయి.
తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలపై అధ్యక్షుడు బషర్ అసద్ బలగాలు గురువారం కూడా బాంబుల వర్షం కురిపించాయని ప్రతిపక్షం ఆరోపించింది. రసాయనదాడికి గురైన తూర్పు ఘౌటాలోనే మళ్లీ జరిగిన ఈ బాంబుదాడులపై మాట్లాడేందుకు మాటలు రావడంలేదని బ్రిటన్‌కు చెందిన ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్‌రైట్స్’ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మరోపక్క అమాయక పౌరులతోపాటు పసిపిల్లలపై సైతం రసాయన దాడులకు పాల్పడటంపై యూనిసెఫ్ తీవ్రంగా మండిపడింది. బాలల హక్కులు కాపాడాలని, హక్కులు కాలరాసినవారు బాధ్యత వహించకతప్పదని హెచ్చరించింది.
చట్టాల ఉల్లంఘనే.... బాన్ కీ మూన్
సిరియా ప్రజలపై రసాయన దాడితో ప్రభుత్వం దారుణ మారణకాండకు పూనుకుందన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అన్నారు. ‘రసాయన ఆయుధాలను ఏ పక్షమైనా సరే.. ఏ పరిస్థితుల్లోనైనా సరే.. ప్రయోగించడం అంతర్జాతీయ మానవతావాద చట్టాలను ఉల్లంఘించడమే’నని స్పష్టంచే శారు. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో బుధవారం ప్రభుత్వ బలగాలు రసాయనదాడులు జరుపగా 1,300 మంది పౌరులు బలయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ దాడులపై బుధవారం నాటి అత్యవసర సమావేశంలో ఐరాస భద్రతామండలి ఆందోళన వ్యక్తంచేసింది. అయితే దీనిపై శాశ్వత సభ్యదేశాల మధ్య భేదాభిప్రాయం తలెత్తింది. సిరియాపై కఠిన చర్యలకు చైనా, రష్యా వ్యతిరేకించగా.. సిరియాలో ఉన్న ఐరాస బృందంచేత నిష్పాక్షిక దర్యాప్తు జరపాలంటూ సెక్రటరీ జనరల్‌కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లేఖ రాశాయి.
కాగా, సిరియా ప్రభుత్వం రసాయన ఆయుధాలు ప్రయోగించినట్లు వచ్చిన ఆరోపణలను మిత్రదేశం ఇరాన్ తోసిపుచ్చింది. రసాయన దాడులు జరిగి ఉంటే.. అందుకు రెబెల్స్‌దే బాధ్యతని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదముఠాలు ఏ నేరానికైనా వెనుదీయవని, రసాయన దాడులు వాటి పనే అయి ఉంటుందని పేర్కొంది.
సిరియాలో కొనసాగుతున్న ప్రభుత్వ బలగాల దాడులు
Published Fri, Aug 23 2013 4:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement