Chemical attacks
-
ఉక్రెయిన్‌లోని రష్యా సైనికులపై విష ప్రయోగం!
మాస్కో: గత ఏడు నెలలుగా ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు. ఒక్కో నగరాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో రసాయన విష ప్రయోగం జరగటం వల్ల ఉక్రెయిన్‌లోని తమ సైనికులు ఆసుపత్రుల పాలైనట్లు ఆరోపించింది రష్యా రక్షణ శాఖ. ‘బోటులినమ్ టాక్సిన్ టైప్ బీ’ అనే సేంద్రియ విషం నమూనాలను సైనికుల్లో గుర్తించినట్లు పేర్కొంది. కీవ్ కెమికల్ టెర్రరిజానికి పాల్పడుతోందని ఆరోపించింది. ‘జులై 31న జపోరోఝీ ప్రాంతంలోని వసిలియేవ్కా గ్రామం సమీపంలోని రష్యా సైనికులు తీవ్ర విష ప్రయోగంతో ఆసుపత్రుల పాలయ్యారు. రష్యా సైనికులు, పౌరులపై జెలెన్స్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెర్రరిస్టులు విషంతో నిండిన వాటితో దాడులకు పాల్పడుతున్నారు.’ అని పేర్కొంది రష్యా రక్షణ శాఖ. సైనికులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైన క్రమంలో వారి నుంచి సేకరించిన విష నమూనాలను అంతర్జాతీయ ‘రసాయన ఆయుధాల నిషేధ సంస్థ’(ఓపీసీడబ్ల్యూ)కు పంపించేందుకు సిద్ధమవుతోంది రష్యా. బోటులినమ్ టాక్సిన్ అనేది సైన్స్‌లో అత్యంత విషపూరితమైనదిగా గుర్తింపు పొందినట్లు పేర్కొంది మాస్కో. దీనిని క్లోస్ట్రిడియమ్ బోటులినియమ్ బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి చేస్తారని, ఇది ఎసిటైల్కోలిన్ న్యూరోట్రాన్స్మిటర్ విడుదలను అడ్డుకుంటుందని తెలిపింది. దాని ద్వారా కండరాల పక్షవాతం వస్తుందని స్పష్టం చేసింది. ‘బోటులినమ్ టాక్సిన్ టైప్ ఏ’ను కొన్నేళ్ల క్రితం కండరాల సమస్యల చికిత్స ఔషధాల్లో ఉపయోగించేవారు. దీనిని కాస్మెటోలజీలో బొటాక్స్గా పిలిచేవారు. అయితే, బోటులినమ్ టాక్సిన్ సులభంగా ఉత్పత్తి చేయటం, సరఫరా చేయటం వల్ల దానిని జీవ ఆయుధంగా ఉపయోగించే ప్రమాదం అధికంగా ఉంది. దీనిని ప్రయోగిస్తే మరణాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ విష ప్రయోగం బారినపడిన వారు దీర్ఘకాలం పాటు ఐసీయూలో చికిత్స తీసుకుంటేనే ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇదీ చదవండి: పుతిన్‌కు షాక్.. బాంబు దాడిలో ఉక్రెయిన్ యుద్ధ వ్యూహకర్త కుమార్తె దుర్మరణం! -
ఉక్రెయిన్ను మరో సిరియా చేస్తారా.. టెన్షన్లో అమెరికా
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా బలగాల దాడులతో 15 రోజులుగా ఉక్రెయిన్ అట్టుడుకుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. కాగా, రష్యాపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రష్యా, అమెరికా దేశాలు ఉక్రెయిన్ వేదికగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లో రసాయనిక లేదా జీవాయుధ దాడికి రష్యా ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా ఆరోపణలు చేసింది. దీనిపై వైట్ హౌజ్ సైతం గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో రష్యా.. రసాయనిక, జీవాయుధ దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. యుద్ధాన్ని తీవ్రం చేయడానికి రష్యా సంప్రదాయేతర ఆయుధాలను ఉపయోగించే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధంలో రష్యా.. సాధ్యమైనంత వరకు రసాయనిక ఆయుధాలు, లేదంటే చిన్న తరహా అణ్వాయుధం, జీవాయుధాన్ని ఉక్రెయిన్‌పై ప్రయోగించే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రకటించింది. అంతకు ముందు సిరియాలో రష్యా, దాని మిత్ర దేశాలు రసాయన ఆయుధాలను వాడినట్టు ఈ సందర్భంగా అమెరికా గుర్తు చేసింది. అందుకే ఉక్రెయిన్ విషయంలో ఈ తప్పు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతకుముందు.. రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌లో అమెరికా బయోవెపన్లను అభివృద్ది చేస్తున్నట్టు మాస్కో వద్ద ఆధారాలు ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బయోలాజికల్ రీసెర్చ్ల కోసం అమెరికా రక్షణ శాఖ నిధులను సైతం సమకూరుస్తోందని అన్నారు. ఈ విషయంలో అమెరికా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
మనిషిని నిలువెల్లా కాల్చేసే తెల్ల భాస్వరం
బాంబుల వర్షం, గ్రెనేడ్ల దాడులు, క్షిపణి ప్రయోగాలు.. రసాయన దాడులు ఏ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వచ్చినా వీటి గురించే మనం వింటూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా తెల్ల భాస్వరంతో (వైట్ ఫాస్పరస్) దాడులు అంతర్జాతీయంగా మంటలు రేపుతున్నాయి. మనిషిని నిలువెల్లా కాల్చేసే ఈ తెల్ల భాస్వరం అంటే ఏమిటి? దాడుల్లో దీన్ని వినియోగించడంతో మానవాళికి వచ్చే ముప్పేంటి ? ఉత్తర సిరియాలో కుర్దులపై టర్కీ చేస్తున్న ఏకపక్ష దాడులు బీభత్సం సృష్టిస్తున్నాయి. స్వతంత్ర కుర్దిస్తాన్ కోసం వీరు చేస్తున్న పోరాటానికి ఇన్నాళ్లూ అండగా ఉన్న అగ్రరాజ్యం అమెరికా హఠాత్తుగా తమ బలగాల్ని ఉపసంహరించింది. దీంతో రెచ్చిపోయిన టర్కీ సేనలు ఉత్తర సిరియాలో సిరియన్ డెమొక్రాటిక్ ఫోర్స్‌పై గత కొద్ది రోజులుగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో గాయపడిన వారిని పరీక్షిస్తే వెల్లడైన నిజాలు అంతర్జాతీయ సమాజం తెల్లబోయేలా చేస్తున్నాయి. తెల్ల భాస్వరం అంటే.. తెల్ల భాస్వరం ఒక రసాయనం. దీనికి స్వతహాగా మండే గుణం ఉంటుంది. చర్మాన్ని, బట్టల్ని, ఇంధనాన్ని, మారణాయుధాల్ని మండించగలదు. దీని నుంచి దట్టమైన పొగ కూడా వ్యాపిస్తుంది. గ్రెనేడ్లు, లాంచర్లు, మోర్టార్లు వంటి ఆయుధాల్లో పేలుడు కోసం దీనిని వాడతారు. కదన రంగంలో సైనికుల కదలికలు ప్రత్యర్థులకు కనిపించకుండా పొగ వ్యాపించడం కోసం కూడా తెల్ల భాస్వరంతో తయారు చేసిన పొగ బాంబుల్ని విసురుతుంటారు. ఇవాళ రేపు ఎన్నో దేశాలు దాడుల సమయంలో ఈ తరహా రసాయన దాడులకు దిగుతున్నాయి. టర్కీ కూడా ఇప్పుడు నేరుగా కుర్దులపై తెల్ల భాస్వరంతో రసాయన దాడులు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. టర్కీ దాడుల్లో కాలిన గాయాలతో ఆస్పత్రి పాలైన బాధితుల్ని చూస్తూ ఉంటే మనసు పిండేస్తోంది. మనుషులపై పడే ప్రభావం తెల్ల భాస్వరం రసాయన దాడులు ప్రాణాంతకమైనవి. మూడు రకాలుగా ఇది మనిషి ప్రాణాలు తోడేస్తుంది. శరీరంలో కణజాలాన్ని కాల్చి మనిషిని ఒక మాంసం ముద్దగా మార్చేస్తుంది. ఇక దీని నుంచి వెలువడే దట్టమైన తెల్లని పొగ పీల్చడం వల్ల శరీరంలో ఊపిరితిత్తుల వ్యవస్థ సర్వనాశనమై ఒక్కోసారి ప్రాణాలు పోతాయి. తెల్ల భాస్వరం నోటి నుంచి శరీరంలోకి వెళ్లినా కిడ్నీ, కాలేయం, గుండెపై తీవ్ర ప్రభావం పడి ప్రాణాలు పోతాయి. తెల్ల భాస్వరం నుంచి వచ్చే ఆవిరి కొన్నేళ్లు పీలిస్తే దవడలన్నీ వాచిపోయి నోరు తెరవడానికి వీలు కాదు. దాని ప్రభావంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. గతంలో ఎప్పుడు వాడారు ? 19వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా అమెరికా, ఐర్లాండ్‌కు చెందిన తిరుగుబాటు జాతీయ సంస్థ , ఐరిష్ రిపబ్లికన్ బ్రదర్హుడ్గా పిలిచే ఫెనియన్ పోరాటదారులు తెల్ల భాస్వరంతో బాంబులు చేసి వాడారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కాలంలో దీని వినియోగం విస్తృతంగా పెరిగింది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో ఆ తర్వాత కొరియా, వియత్రాం యుద్ధాల్లో కూడా దీనిని వినియోగించారు. 1988లో సద్దాం హుస్సేన్‌ను నిర్బంధించడానికి అమెరికా చేసిన దాడుల్లో తెల్ల భాస్వరం వినియోగించారు. మళ్లీ ఇన్నేళ్లకు టర్కీ తెల్ల భాస్వరం బాంబులతో కుర్దుల స్థావరాలపై దాడులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. టర్కీ దీనిని ఖండిస్తున్నప్పటికీ క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న వైద్యులు మాత్రం కాలిన గాయాలకు తెల్లభాస్వరమే కారణమని తేల్చి చెబుతున్నారు అంతర్జాతీయ నిబంధనలు ఏం చెబుతున్నాయ్! జెనీవా ఒప్పందంలోని ప్రోటోకాల్ త్రీలో ఆర్టికల్ 1 ప్రకారం రసాయన ప్రక్రియ ద్వారా మంటలు రేగే గుణం కలిగే ఆయుధాలతో దాడి జరపడం నిషిద్ధం. అయితే తెల్ల భాస్వరంతో తయారయ్యే రసాయన ఆయుధాలు ఆ నిషిద్ధ జాబితాలో లేవు. అంతే కాకుండా సైనిక స్థావరాలను లక్ష్యంగా జరిపే దాడుల్లో తెల్ల భాస్వరం ప్రయోగం నిషేధంపైన అంతర్జాతీయంగా ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అయితే 1993 నుంచి రసాయ ఆయుధాల తయారీ, సరఫరా వంటి వాటిపై అంతర్జాతీయ సమాజం నిషేధం విధించింది. మనుషులపైనా, పౌరులు నివసించే ప్రాంతాలపైనా రసాయన దాడులు జరపకూడదని తీర్మానించింది. -
సిరియాలో మరో విష దాడి!
బీరుట్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరో విష రసాయన దాడి జరిగింది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై జరిగిన ఈ దాడిలో 42 మందికి పైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. వందలాది పౌరులు శ్వాస, కంటిచూపు సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చనిపోయినవారిలోనూ, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందికి గురైన వారిలోనూ చిన్నారులే అధికంగా ఉన్నారు. పలు భవనాల్లో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తిరుగుబాటుదారులు లక్ష్యంగా సిరియా ప్రభుత్వమే ఈ దారుణానికి పాల్పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. అయితే, ఈ ఆరోపణలను సిరియా, ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్న రష్యా ఖండించాయి. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలనీ, విషవాయువు ప్రయోగం జరిగినట్లు తేలితే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్ క్రూరత్వానికి ఇది మరో ఆధారంగా నిలుస్తుందని బ్రిటన్ విదేశాంగ శాఖ పేర్కొంది. 42 మంది వారివారి ఇళ్లలో చనిపోయి ఉండటాన్ని గుర్తించామనీ, వీరంతా ఊపిరి తీసుకోవడం కష్టమవ్వడం వల్లనే మరణించినట్లు తెలుస్తోందని, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చనీ సహాయక సిబ్బంది చెప్పారు. చిన్నారులు, మహిళలు సహా అనేక మంది శవాలు ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ ఉండటాన్ని చూపుతూ పలు వీడియోలు విడుదలయ్యాయి. మృతుల నోళ్లు, ముక్కుల నుంచి తెల్లని నురగ బయటకు రావడం వీడియోల్లో కనిపించింది. అవి నకిలీ వీడియోలు: సిరియా రసాయనిక దాడి జరిగిందనడాన్ని సిరియా అధికారిక మీడియా ఖండించింది. తిరుగుబాటుదారులే అంతర్జాతీయంగా మద్దతు పొందటం కోసం నకిలీ వీడియోలను విడుదల చేశారని పేర్కొంది. రష్యా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు కూడా రసాయనిక దాడి అబద్ధమని పేర్కొన్నాయి. ప్రస్తుతం డౌమా పట్టణాన్ని సిరియా భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం తూర్పు గౌటా ప్రాంతంలో తిరుగుబాటుదారుల చేతిలో ఉన్న ఏకైక పట్టణం డౌమా మాత్రమే. శనివారం మధ్యాహ్నం వైమానిక దాడి జరిగిన తర్వాత తమకు కళ్లు మండుతున్నాయనీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందం టూ 15 మంది వైద్యశాలలకు వచ్చారు. ఆ తర్వాత శనివారం రాత్రి ఓ ప్రభుత్వ హెలికాప్టర్ వచ్చి గుర్తు తెలియని రసాయనాన్ని వెదజల్లిందనీ, దీని వల్ల ఇంకా అనేకమంది ప్రజలు విషవాయువు బారిన పడ్డారని సహాయక సిబ్బంది వివరించారు. నిరంతరాయంగా జరుగుతున్న దాడుల వల్ల మృతదేహాలను వెతకడం కష్టంగా ఉందనీ, మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని వారు అంటున్నారు. విషపూరిత క్లోరిన్ వాయువుతో ప్రభుత్వ దళాలు దాడిచేసినట్లు ‘వైట్ హెల్మెట్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. 40 నుంచి 70 మంది విషవాయువు కారణంగా మరణించి ఉంటారని తెలిపింది. శుక్రవారం సాయంత్రం నుంచి సిరియా జరిపిన వైమానిక దాడులతో కలిపి మృతుల సంఖ్య 80కి పైగానే ఉంటుందంది. అసద్ ఓ జంతువు: ట్రంప్ సిరియా అధ్యక్షుడు అసద్ ఓ జంతువనీ, ఆయన చర్యను మతిలేనిదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇరాన్, రష్యాల మద్దతుతోనే సిరియా రెచ్చిపోతోందన్నారు. ‘డౌమాను సిరియా సైన్యం చుట్టుముట్టి ఇతరులను అక్కడకు వెళ్లనివ్వడం లేదు. అసద్‌కు మద్దతునిస్తున్న రష్యా, ఇరాన్‌లే ఇందుకు బాధ్యులు. భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని ట్రంప్ ట్వీటర్లో పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సైనిక చర్య చేపట్టి ఉంటే నేడు అసద్ అనే వ్యక్తి ఉండేవాడే కాదన్నారు. -
విమానాలపై కెమికల్ దాడులు.. వార్నింగ్!
-
సిరియాలో రసాయనికదాడులు!
డమాస్కస్: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వైమానిక దాడులు జరుపుతున్న దేశాలు రసాయనికదాడులకు దిగుతున్నాయా.. అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఇటీవల రష్యాకు చెందిన ఎమ్-8 హెలికాప్టర్‌ను సిరియాలో కూల్చివేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన అనంతరం రెండు కెమికల్ దాడులు జరిగాయని, ఈ దాడులకు పాల్పడింది రష్యానే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్లోరిన్ గ్యాస్‌తో కూడిన గ్యాస్ సిలిండర్లను ఇడ్లిబ్ ప్రావిన్సులోని సారాకెబ్లో జనావాసప్రాంతాల్లో విడిచారని 'ఇడ్లిబ్ సివిల్ డిఫెన్స్' తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించింది. మరో ఘటనలో.. మంగళవారం అలెప్పోలో జరిగిన రసాయనిక దాడిలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా, ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారని సిటీ హెల్త్ డైరెక్టర్ మహమ్మద్ హజౌరీ మీడియాతో వెల్లడించారు. అయితే.. ఉగ్రవాదులు రసాయనిక దాడులకు పాల్పడ్డారంటూ సిరియా ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనను విడుదలచేశాయి. రష్యా సైతం రసాయనిక దాడుల ఆరోపణలను తోసిపుచ్చింది. -
సిరియాపై దాడికి నిర్ణయం తీసుకోలేదు: ఒబామా
సిరియాపై సైనిక దాడి చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. డమాస్కస్‌లో ఈ నెల 21న ఆసాద్ ప్రభుత్వం రసాయన దాడికి పాల్పడి వందలాది మంది మృతికి కారణమైన నేపథ్యంలో సిరియాపై అమెరికా, దాని మిత్రదేశాలు సైనిక చర్యలకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సిరియాపై దాడికి ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒబామా స్పష్టం చేశారు. పౌరులపై పెద్ద ఎత్తున రసాయన దాడి చేయడం అంతర్జాతీయ విధానాలకు వ్యతిరేకమని పీబీఎస్ న్యూస్ హవర్ ఇంటర్వ్యూలో ఒబామా పేర్కొన్నారు. దాడికి సంబంధించిన ఆధారాలు సేకరించామని, సిరియాలో ఆందోళకారుల వద్ద అణ్వయుధాలు లేదా రసాయన ఆయుధాలు లేవని అన్నారు. రసాయన దాడికి పాల్పడింది సిరియా ప్రభుత్వమేనని తేలిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లను సిరియా ఎదుర్కొవలసివుంటుందని ఆయన హెచ్చరించారు. డమాస్కస్‌లో ఈ నెల 21న వందలాది మంది మృతికి కారణమైన రసాయన దాడికి పాల్పడింది సిరియా ప్రభుత్వ బలగాలేనని అమెరికా ఉపాధ్యక్షుడు జోసఫ్ బిడెన్ కూడా స్పష్టం చేశారు. దాడి సిరియా ఆర్మీ పనేనని ‘నాటో’ కూడా ప్రకటించింది. తమ దేశంపై దాడి చేస్తే దీటుగా ఎదుర్కొంటామని సిరియా, సిరియాపై దాడి చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదురువుతాయని రష్యా, ఇరాన్‌లు హెచ్చరించడం తెలిసిందే. సిరియా సమస్యకు దౌత్యమార్గాల్లో పరిష్కారం కనుగొనాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ సూచించారు. -
సిరియా వైపు అమెరికా బలగాలు
వాషింగ్టన్: సిరియాలో రసాయనిక దాడి నేపథ్యంలో శనివారం అమెరికా నేవీ బలగాలు సిరియా తీరానికి చేరువగా ముందుకు సాగుతున్నాయి. రసాయనిక దాడిపై నిజానిజాలు తేలిన తర్వాత సిరియాపై సైనిక చర్యకు దిగే అవకాశాలను అమెరికా పరిశీలిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జాతీయ భద్రతా బృందంతో చర్చలు జరిపారు. సిరియాలో జరిగిందేమిటో నిర్ధారించే సాక్ష్యాధారాలను సేకరించాల్సిందిగా ఒబామా ఇంటెలిజెన్స్ వర్గాలను ఆదేశించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ చెప్పారు. నిజా నిజాలను నిర్ధారించుకున్నాక ఒబామా ఈ అంశంపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారని తెలిపారు. మలేసియా ప్రయాణమవుతున్న రక్షణశాఖ మంత్రి చక్ హాగెల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ భద్రతా బృందంతో ఒబామా జరిపిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ అంశంపై అధ్యక్షుడు ఒబామాతో తాను ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తుంటానని హాగెల్ మీడియాకు చెప్పారు. సిరియా వద్ద తమ బలగాలను మోహరించడం సహా అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని తెలిపారు. సిరియా రాజధాని డమాస్కస్‌కు చేరువలో గత బుధవారం జరిగిన రసాయనిక దాడిలో 1,300 మంది మరణించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ బలగాలు రసాయనిక దాడికి పాల్పడినట్లు తిరుగుబాటుదారులు ఆరోపిస్తుండగా, రసాయనిక ఆయుధాలను వినియోగించలేదని సిరియా ప్రభుత్వం చెబుతోంది. కాగా, రసాయనిక ఆయుధాలను వినియోగిస్తే పాశ్చాత్య ప్రపంచం నుంచి సిరియా గట్టి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒబామా ఇదివరకే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సిరియాపై సైనిక దాడికి దిగే ముందు అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నారు. మరోవైపు, రసాయనిక ఆయుధాల వినియోగంపై దర్యాప్తుకు అంగీకరించేలా సిరియా అధ్యక్షుడు బషర్ అసద్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ఏంజెలా కానే డమాస్కస్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి దర్యాప్తుకు సహకరించాల్సిందిగా ఇప్పటికే పలు దేశాలు అసద్‌కు సూచించాయి. తిరుగుబాటుదారులే రసాయనిక ఆయుధాలు వాడారు: సిరియా సర్కారు తిరుగుబాటుదారులే రసాయనిక ఆయుధాలను వాడారని సిరియా ప్రభుత్వం శనివారం ఆరోపించింది. రసాయనాలతో నిండి ఉన్న బ్యారెల్స్, గ్యాస్ మాస్కులను ప్రభుత్వ టీవీ చానల్ చూపింది. తిరుగుబాటుదారుల స్థావరాల్లో ఉన్న ఈ ఆయుధాలు కొద్దిపాటి నమూనా మాత్రమేనని పేర్కొంది. సైన్యం ముందుకు సాగకుండా అరికట్టాలనే ఉద్దేశంతోనే తిరుగుబాటుదారులు ఈ ఆయుధాలను ఉపయోగించారని ఆరోపించింది. -
సిరియాలో కొనసాగుతున్న ప్రభుత్వ బలగాల దాడులు
బీరుట్: సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో బుధవారం ప్రభుత్వ బలగాలు జరిపిన రసాయన దాడులకు 1,300 మంది అమాయక పౌరులు బలయ్యారన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. ప్రభుత్వ దాడులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. రసాయన దాడులకు గురైన ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న తూర్పు ఘౌటాలో గురువారం ఉదయం ప్రభుత్వ యుద్ధవిమానాలు మళ్లీ బాంబుల వర్షం కురిపించాయి. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలపై అధ్యక్షుడు బషర్ అసద్ బలగాలు గురువారం కూడా బాంబుల వర్షం కురిపించాయని ప్రతిపక్షం ఆరోపించింది. రసాయనదాడికి గురైన తూర్పు ఘౌటాలోనే మళ్లీ జరిగిన ఈ బాంబుదాడులపై మాట్లాడేందుకు మాటలు రావడంలేదని బ్రిటన్‌కు చెందిన ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్‌రైట్స్’ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మరోపక్క అమాయక పౌరులతోపాటు పసిపిల్లలపై సైతం రసాయన దాడులకు పాల్పడటంపై యూనిసెఫ్ తీవ్రంగా మండిపడింది. బాలల హక్కులు కాపాడాలని, హక్కులు కాలరాసినవారు బాధ్యత వహించకతప్పదని హెచ్చరించింది. చట్టాల ఉల్లంఘనే.... బాన్ కీ మూన్ సిరియా ప్రజలపై రసాయన దాడితో ప్రభుత్వం దారుణ మారణకాండకు పూనుకుందన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అన్నారు. ‘రసాయన ఆయుధాలను ఏ పక్షమైనా సరే.. ఏ పరిస్థితుల్లోనైనా సరే.. ప్రయోగించడం అంతర్జాతీయ మానవతావాద చట్టాలను ఉల్లంఘించడమే’నని స్పష్టంచే శారు. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో బుధవారం ప్రభుత్వ బలగాలు రసాయనదాడులు జరుపగా 1,300 మంది పౌరులు బలయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ దాడులపై బుధవారం నాటి అత్యవసర సమావేశంలో ఐరాస భద్రతామండలి ఆందోళన వ్యక్తంచేసింది. అయితే దీనిపై శాశ్వత సభ్యదేశాల మధ్య భేదాభిప్రాయం తలెత్తింది. సిరియాపై కఠిన చర్యలకు చైనా, రష్యా వ్యతిరేకించగా.. సిరియాలో ఉన్న ఐరాస బృందంచేత నిష్పాక్షిక దర్యాప్తు జరపాలంటూ సెక్రటరీ జనరల్‌కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లేఖ రాశాయి. కాగా, సిరియా ప్రభుత్వం రసాయన ఆయుధాలు ప్రయోగించినట్లు వచ్చిన ఆరోపణలను మిత్రదేశం ఇరాన్ తోసిపుచ్చింది. రసాయన దాడులు జరిగి ఉంటే.. అందుకు రెబెల్స్దే బాధ్యతని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదముఠాలు ఏ నేరానికైనా వెనుదీయవని, రసాయన దాడులు వాటి పనే అయి ఉంటుందని పేర్కొంది. -
డెమాస్కస్ శివార్లలో సిరియన్ దళాల బాంబుదాడులు
సిరియాలో రసాయన దాడులు జరిగిన ప్రాంతంలో అధ్యక్షుడు బషర్ అసద్‌కు చెందిన బలగాలు సైనిక దాడి చేశాయి. తిరుగుబాటుదారులు దాక్కుని ఉన్నట్లు భావిస్తున్న శివారు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించాయి. తూర్పు ఘౌటా ప్రాంతంలో తాము రసాయన ఆయుధాలు ఉపయోగించామన్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రసాయన ఆయుధాలు పడిన ప్రాంతాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే సిరియాలో ఉన్న ఐక్యరాజ్య సమితి నిపుణుల బృందాన్ని వెంటనే అక్కడకు అనుమతించాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు డిమాండు చేశాయి. సిరియన్ విపక్ష నాయకులు, అక్కడి ఉద్యమకారులు మాత్రం... బుధవారం నాటి రసాయన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 136 నుంచి 1300కు పెరిగిందని ఆరోపిస్తున్నారు. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో.. ఇప్పటివరకు అత్యంత దారుణమైన రసాయన దాడి ఇదేనని పరిశీలకులు అంటున్నారు. ఇక గురువారం ఉదయం జరిగిన బాంబు దాడుల్లో ఎంతమంది మరణించారన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియట్లేదు. సిరియన్ యుద్ధ విమానాలు పలుమార్లు తూర్పు, పశ్చిమ డెమాస్కస్ శివార్లపై వైమానిక దాడులు చేశాయి. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే మూడుసార్లు ఈ దాడులు జరిగాయి. బుధవారం నాటి రసాయన దాడిలో వందలాది మంది పిల్లలు కూడా మరణించారు. తెల్లటి వస్త్రాల్లో చుట్టి ఉన్న వారి మృతదేహాలు చూసేందుకు కూడా దారుణంగా ఉన్నాయి. పౌరులు.. ముఖ్యంగా పిల్లలపై కూడా దాడులకు తెగబడటం చాలా దారుణమని, అత్యంత హేయమని యూనిసెఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. పిల్లలను తప్పనిసరిగా రక్షించాలని, వాళ్లను కాపాడలేనివారిని ఈ దాడులకు బాధ్యులుగా చేయాలని చెప్పింది. -
సిరియాలో రసాయన దాడి, 1300 మంది బలి
-
సిరియాలో రసాయన దాడి, 1300 మంది బలి
* పౌరులపై ప్రభుత్వ బలగాల ఘాతుకం * డమాస్కస్ శివారులోని రెబల్స్ స్థావరాలపై దాడి * మృతుల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు వందలాది మందికి అస్వస్థత * మొదట రసాయన ఆయుధాలతో, తర్వాత విమానాల నుంచి బాంబులతో.. * జాతీయ విపక్ష కూటమి వెల్లడి.. దాడి వార్తలు కట్టుకథలన్న ప్రభుత్వం బీరుట్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో బుధవారం చరిత్ర ఎరుగని దారుణ మారణహోమం జరిగింది. ప్రభుత్వ బలగాలు జరిపిన రసాయన ఆయుధ దాడిలో 1,300 మందికి పైగా బలయ్యారు. మృతుల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నారు. వందల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. ఈమేరకు ప్రధాన విపక్ష కూటమి ‘నేషనల్ కొయిలిషన్’ వెల్లడించింది. ఆ ఆరోపణను ప్రభుత్వం ఖండించింది. అయితే మీడియాలో వచ్చిన ఫోటోలు, వీడియో దృశ్యాలు దాడికి నిదర్శనంగా నిలిచాయి. కొందరు నురగలు కక్కుతూ చనిపోతున్నట్లు, కొందరు ఎగశ్వాస తీసుకుంటున్నట్లు వాటిలో కనిపించారు. మృదేహాలపై ఎలాంటి గాయాలూ కనిపించకపోవడం రసాయన దాడి జరిగిందనడానికి ఊతమిస్తోంది. విషపు దాడి.. బాంబుల మోత.. దేశ రాజధాని డమాస్కస్‌కు దగ్గర్లోని తూర్పు గౌటాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై ప్రభుత్వ బలగాలు ఉదయం రసాయనిక ఆయుధాలతో కూడిన రాకెట్లతో దాడి చేశాయని విపక్ష కూటమి తెలిపింది. విష వాయువులు పీల్చి వందలాది మంది చనిపోయారని, ఊచకోతలో కుటుంబాలకు కుటుంబాలు అసువులు బాశాయని ‘లోకల్ కోఆర్డినేషన్ కమిటీస్’ పేర్కొంది. రసాయనిక దాడి తర్వాత, యుద్ధవిమానాల నుంచి బాంబుల వర్షం కురిపించారని తెలిపింది. కడపటి వార్తలు అందే సమయానికి రసాయనిక దాడి సాగుతోందని చెప్పింది. ఇర్బిన్, దూమా, మాధామియా తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో చనిపోయారని తెలిపింది. దాడుల దృశ్యాలుగా పేర్కొంటూ కొంతమంది సామాజిక కార్యకర్తలు మీడియాలో కొన్ని వీడియోలు ప్రసారం చేశారు. రోడ్లపై వరుసగా ఉన్న పిల్లల మృతదేహాలు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ చికిత్స పొందుతున్న చిన్నారులు ఈ దృశ్యాల్లో కనిపించారు. బాధితులకు మసీదుల్లో, స్కూళ్లలో చికిత్స చేస్తున్నామని ఘాజ్వాన్ విదనీ అనే వైద్యుడు తెలిపాడు. రసాయనిక ప్రభావానికి విరుగుడు మందైన ఏట్రోపైన్ తగినంత స్థాయితో తమ వద్ద లేదన్నారు. కాగా, దేశ సమస్యకు రాజకీయ పరిష్కారం లభిస్తుందన్న ఆశలకు ఈ దాడితో గండి కొట్టారని విపక్ష కూటమి నేత జార్జి సబ్రా వ్యాఖ్యానించారు. సిరియాలో రసాయన ఆయుధాలు ఉన్నాయో లేవో తేల్చడానికి ఐరాస నిపుణుల బృందం ఆదివారం సిరియాకు వచ్చిన నేపథ్యంలో ఈ దాడి ఉదంతం చోటుచోసుకోవడం గమనార్హం. దాడి జరగలేదు: ప్రభుత్వం రసాయనిక దాడి వార్తలు పచ్చి అబద్ధమని ప్రభుత్వం తెలిపింది. రసాయనిక ఆయుధాలు ఉన్నాయో లేవో తనిఖీ చేయడానికి వచ్చిన ఐక్యరాజ్య సమితి బృంద కార్యకలాపాలకు ఆటంకం కలిగించడానికే ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. దర్యాప్తు జరపాలి: ప్రపంచ దేశాల డిమాండ్.. సిరియాలో రసాయనిక దాడి జరిగిందన్న వార్తలపై ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొన్ని దాడిని ఖండించగా, కొన్ని ఈ వార్తల వెనుక కుట్ర ఉందన్నాయి. దాడి జరిగి ఉంటే అది ఆమోదయోగ్యం కాదని, దీనిపై వెంటనే దర్యాప్తు జరపాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) డిమాండ్ చేసింది. మారణ కాండపై స్పందించి, పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలని ఐక్యరాజ్య సమితి, ఈయూలకు సౌదీ అరేబియా విజ్ఞప్తి చేసింది. దాడి వార్తల సంగతిని ఐరాస భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్తామని బ్రిటన్ తెలిపింది. ఐరాస తనిఖీ బృందం సంఘటన ప్రాంతానికి వెళ్లి వాస్తవాలేమిటో తెలుసుకోవాలని అరబ్ లీగ్‌తోపాటు జర్మనీ, స్వీడన్, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలు కోరాయి. కాగా, సిరియా విపక్ష ఆరోపణలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, పథకం ప్రకారమే ప్రచారంలోకి తెచ్చారని సిరియా సర్కారుకు మద్దతిస్తున్న రష్యా ఆరోపించింది. ఐరాస తనిఖీ బృందం సిరియాకు రాగానే ఈ ఆరోపణలు చేయడం అనుమానాలు రేకెత్తిస్తోందని పేర్కొంది. మరోపక్క.. పరిస్థితిపై చర్చించేందుకు భద్రతా మండలి బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమైంది. సిరియాలో ప్రభుత్వం కానీ, రెబెల్స్ కానీ రసాయన దాడులు జరపడం ఆమోదయోగ్యం కాదని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ అన్నారు.