సిరియాలో రసాయన దాడులు జరిగిన ప్రాంతంలో అధ్యక్షుడు బషర్ అసద్కు చెందిన బలగాలు సైనిక దాడి చేశాయి. తిరుగుబాటుదారులు దాక్కుని ఉన్నట్లు భావిస్తున్న శివారు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించాయి. తూర్పు ఘౌటా ప్రాంతంలో తాము రసాయన ఆయుధాలు ఉపయోగించామన్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రసాయన ఆయుధాలు పడిన ప్రాంతాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే సిరియాలో ఉన్న ఐక్యరాజ్య సమితి నిపుణుల బృందాన్ని వెంటనే అక్కడకు అనుమతించాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు డిమాండు చేశాయి.
సిరియన్ విపక్ష నాయకులు, అక్కడి ఉద్యమకారులు మాత్రం... బుధవారం నాటి రసాయన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 136 నుంచి 1300కు పెరిగిందని ఆరోపిస్తున్నారు.
సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో.. ఇప్పటివరకు అత్యంత దారుణమైన రసాయన దాడి ఇదేనని పరిశీలకులు అంటున్నారు. ఇక గురువారం ఉదయం జరిగిన బాంబు దాడుల్లో ఎంతమంది మరణించారన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియట్లేదు. సిరియన్ యుద్ధ విమానాలు పలుమార్లు తూర్పు, పశ్చిమ డెమాస్కస్ శివార్లపై వైమానిక దాడులు చేశాయి. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే మూడుసార్లు ఈ దాడులు జరిగాయి.
బుధవారం నాటి రసాయన దాడిలో వందలాది మంది పిల్లలు కూడా మరణించారు. తెల్లటి వస్త్రాల్లో చుట్టి ఉన్న వారి మృతదేహాలు చూసేందుకు కూడా దారుణంగా ఉన్నాయి. పౌరులు.. ముఖ్యంగా పిల్లలపై కూడా దాడులకు తెగబడటం చాలా దారుణమని, అత్యంత హేయమని యూనిసెఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. పిల్లలను తప్పనిసరిగా రక్షించాలని, వాళ్లను కాపాడలేనివారిని ఈ దాడులకు బాధ్యులుగా చేయాలని చెప్పింది.