వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా బలగాల దాడులతో 15 రోజులుగా ఉక్రెయిన్ అట్టుడుకుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. కాగా, రష్యాపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రష్యా, అమెరికా దేశాలు ఉక్రెయిన్ వేదికగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి.
తాజాగా ఉక్రెయిన్‌లో రసాయనిక లేదా జీవాయుధ దాడికి రష్యా ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా ఆరోపణలు చేసింది. దీనిపై వైట్ హౌజ్ సైతం గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో రష్యా.. రసాయనిక, జీవాయుధ దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. యుద్ధాన్ని తీవ్రం చేయడానికి రష్యా సంప్రదాయేతర ఆయుధాలను ఉపయోగించే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధంలో రష్యా.. సాధ్యమైనంత వరకు రసాయనిక ఆయుధాలు, లేదంటే చిన్న తరహా అణ్వాయుధం, జీవాయుధాన్ని ఉక్రెయిన్‌పై ప్రయోగించే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రకటించింది. అంతకు ముందు సిరియాలో రష్యా, దాని మిత్ర దేశాలు రసాయన ఆయుధాలను వాడినట్టు ఈ సందర్భంగా అమెరికా గుర్తు చేసింది. అందుకే ఉక్రెయిన్ విషయంలో ఈ తప్పు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అంతకుముందు.. రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌లో అమెరికా బయోవెపన్‌లను అభివృద్ది చేస్తున్నట్టు మాస్కో వద్ద ఆధారాలు ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బయోలాజికల్ రీసెర్చ్‌ల కోసం అమెరికా రక్షణ శాఖ నిధులను సైతం సమకూరుస్తోందని అన్నారు. ఈ విషయంలో అమెరికా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment