సిరియాపై దాడికి నిర్ణయం తీసుకోలేదు: ఒబామా
సిరియాపై సైనిక దాడి చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. డమాస్కస్‌లో ఈ నెల 21న ఆసాద్ ప్రభుత్వం రసాయన దాడికి పాల్పడి వందలాది మంది మృతికి కారణమైన నేపథ్యంలో సిరియాపై అమెరికా, దాని మిత్రదేశాలు సైనిక చర్యలకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సిరియాపై దాడికి ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒబామా స్పష్టం చేశారు.
పౌరులపై పెద్ద ఎత్తున రసాయన దాడి చేయడం అంతర్జాతీయ విధానాలకు వ్యతిరేకమని పీబీఎస్ న్యూస్ హవర్ ఇంటర్వ్యూలో ఒబామా పేర్కొన్నారు. దాడికి సంబంధించిన ఆధారాలు సేకరించామని, సిరియాలో ఆందోళకారుల వద్ద అణ్వయుధాలు లేదా రసాయన ఆయుధాలు లేవని అన్నారు. రసాయన దాడికి పాల్పడింది సిరియా ప్రభుత్వమేనని తేలిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లను సిరియా ఎదుర్కొవలసివుంటుందని ఆయన హెచ్చరించారు.
డమాస్కస్‌లో ఈ నెల 21న వందలాది మంది మృతికి కారణమైన రసాయన దాడికి పాల్పడింది సిరియా ప్రభుత్వ బలగాలేనని అమెరికా ఉపాధ్యక్షుడు జోసఫ్ బిడెన్ కూడా స్పష్టం చేశారు. దాడి సిరియా ఆర్మీ పనేనని ‘నాటో’ కూడా ప్రకటించింది. తమ దేశంపై దాడి చేస్తే దీటుగా ఎదుర్కొంటామని సిరియా, సిరియాపై దాడి చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదురువుతాయని రష్యా, ఇరాన్‌లు హెచ్చరించడం తెలిసిందే. సిరియా సమస్యకు దౌత్యమార్గాల్లో పరిష్కారం కనుగొనాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ సూచించారు.