ప్రతీకాత్మక చిత్రం
‘రండి అన్న రండి.. మేడిన్ అమెరికా గన్‌లు ఉన్నాయి. బుల్లెట్‌ల దగ్గరి నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల దాకా అన్నీ సరసమైన ధరలకే అమ్ముతున్నాం’ (తెలుగీకరించాం) అంటూ పాకిస్థాన్ మార్కెట్‌లలో ఇప్పుడు కోలాహలం కనిపిస్తోంది. ఈ అత్యాధునిక ఆయుధాలన్నీ అమెరికా అఫ్గనిస్తాన్ నుంచి పోతూ పోతూ వదిలేసి పోయినవే కావడం విశేషం!.
కరాచీ, లాహోర్, పెషావర్, గుజ్రన్‌వాలా.. పాకిస్థాన్ గన్‌మార్కెట్‌లలో అమెరికాకు చెందిన అడ్వాన్స్‌డ్ వెపన్స్ కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ ప్రముఖ మీడియాహౌజ్ కథనం ప్రకారం.. అక్కడి మార్కెట్‌లలో వీటి అమ్మకాలు తారాస్థాయిలో నడుస్తున్నాయి. ‘‘తాలిబన్లు మేమూ భాయి భాయిలం. వాళ్ల దగ్గరి నుంచి వీటిని కొనుగోలు చేయడాన్ని, మా దేశంలో పౌరులకు అమ్ముకోవడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం’’ అంటూ అక్కడి అమ్మకందారులు చెప్తున్నారు.
అడ్వాన్స్‌డ్ పిస్టోల్స్, రైఫిల్స్, గ్రెనేడ్స్, నైట్ విజన్ గగూల్స్, బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లు, స్పై కెమెరాలు, నార్మల టేజర్ గన్స్, టేజర్ స్టిక్స్, ఇతరత్ర మారణాయుధాలు పాక్ గన్ మార్కెట్‌లలో జోరుగా అమ్ముడుపోతున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
తాలిబన్ల ఖండన..
అయితే ఈ కథనాలను తాలిబన్లు ఖండిస్తున్నారు. తాలిబన్(Islamic Emirate of Afghanistan) ప్రతినిధి బిలాల్ కరిమి పేరిట న్యూయార్క్ టైమ్స్‌లో తాజాగా ఓ కథనం ప్రచురితమైంది. ‘‘ఆ కథనాల్ని మేం ఖండిస్తున్నాం. ఆయుధాల విషయంలో మేమేం అంత నిర్లక్క్ష్యంగా లేము. అక్రమ రవాణా కాదుకదా.. కనీసం సింగిల్ బుల్లెట్‌ను మేం బయటవాళ్లకు అమ్ముకోలేదు’’ అని కరిమి తెలిపాడు. అమెరికన్లు వదిలేసిన వెళ్లిన ప్రతీ ఆయుధాన్ని, వస్తువుల్ని సీజ్ చేసి భద్రపరిచామని, ఆ ఆయుధాల్ని భవిష్యత్తులో తమ(తాలిబన్ల) సైన్యం అవసరాల కోసమే ఉపయోగిస్తామని కరిమి పేర్కొన్నాడు. అయినప్పటికీ అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపడతామని తాలిబన్ సంస్థ ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
లూట్ కా మాల్!
అయితే పాక్ వీధుల్లో అమ్ముడుపోతున్న ఆయుధాలు.. అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలే అని నిర్ధారణ అయ్యింది. అమెరికా భద్రతా బలగాల పహారా సాగినంత కాలం.. తాలిబన్లు-పాక్ సాయంతో కలిసి అమెరికా-నాటో బృందాలపై దాడులకు తెగపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ ఆయుధాల్ని ఎత్తుకెళ్లిపోయేవాళ్లు. ఈ తరుణంలో ఇప్పుడు వదిలేసి వెళ్లిన ఆయుధాల్ని అక్రమంగా తరలించడమో లేదంటే ఆదాయం కోసం అమ్ముకోవడమో తాలిబన్లు చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాలిబన్లు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తుండగా.. పాక్ వ్యాపారులు మాత్రం అంతా పద్దతిగానే జరిగిందని చెప్తుండడం విశేషం. దీంతో దొడ్డిదారిన ఆ ఆయుధాలు తరలిపోయి ఉంటాయన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సైన్యం ఉపసంహరణలో భాగంగా.. అఫ్గనిస్తాన్ బాగ్రమ్ ఎయిర్‌బేస్‌కు పవర్‌కట్ చేసి గప్‌చుప్‌గా వెళ్లిపోయాయి అమెరికా దళాలు. వెళ్తూ వెళ్తూ అఫ్గన్ గడ్డపై 83 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సంపత్తిని వదిలేశాయి.
Comments
Please login to add a commentAdd a comment