న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి 2021లో నిష్క్రమించిన సందర్భంగా అమెరికా సేనలు అక్కడే వదిలేసిన అత్యాధునిక తుపాకులు పాకిస్తాన్ మీదుగా జమ్మూకశ్మీర్ ఉగ్రవాదుల చేతికందాయని నిపుణులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి ఘటనల్లో వీటిని విరివిరిగా వాడటంపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేశారు. వీటిల్లో ముఖ్యంగా ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్ ప్రధానమైంది. అత్యంత తేలిగ్గా ఉంటూ, మేగజీన్‌ను సులువుగా మారుస్తూ సునాయాసంగా షూట్‌చేసే వెలుసుబాటు ఈ రైఫిల్‌లో ఉంది. దాదాపు 600 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ గురిచూసి కొట్టొచ్చు.
నిమిషానికి 700–970 బుల్లెట్ల వర్షం కురిపించే సత్తా ఈ రైఫిల్ సొంతం. ఇంతటి వినాశకర రైఫిళ్లు కశ్మీర్ ముష్కరమూకల చేతికి రావడంతో దూరం నుంచే మెరుపు దాడులు చేస్తూ సునాయాసంగా తప్పించుకుంటున్నారని రక్షణ రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణి అసహనం వ్యక్తంచేశారు. 2017 నవంబర్‌లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బంధువు రషీద్‌ను సైన్యం మట్టుబెట్టినపుడు అక్కడ తొలిసారిగా ఎం4 రైఫిల్‌ను సైన్యం స్వాధీనంచేసుకుంది. 2018లో, 2022లో ఇలా పలు సందర్భాల్లో ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ ఘటనాస్థలిలో ఈ రైఫిళ్లను భారత ఆర్మీ గుర్తించింది. జూలై 8వ తేదీన కథువాలో ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడిలోనూ ఇవే రైఫిళ్లను వాడారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment