పాక్‌ ఆ బంకర్లలో ఏమి దాస్తోంది? అమెరికా రిపోర్టులో హడలెత్తించే వివరాలు? | Pakistan is Keeping its Nuclear Weapons Inside Igloo Like Bunker | Sakshi
Sakshi News home page

Pakistan Nuclear Weapons: పాక్‌ ఆ బంకర్లలో ఏమి దాస్తోంది?

Published Sun, Sep 17 2023 7:23 AM | Last Updated on Sun, Sep 17 2023 10:44 AM

Pakistan is Keeping its Nuclear Weapons Inside Igloo Like Bunker - Sakshi

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలింది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోలు ధర లీటరు రూ.300కి చేరింది. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ మాత్రం అణ్వాయుధాలపై మోజు పెంచుకుంటూపోతోంది. అణ్వాయుధాల తయారీలో పూర్తి స్వింగ్‌లో ఉంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్‌ఏఎస్‌) తాజా నివేదిక ప్రకారం పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం దాదాపు 170 అణ్వాయుధాలు ఉన్నాయి.

అమెరికా ఏం కనుగొంది? 
పాకిస్తాన్ అణ్వాయుధాలను గుర్తించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ఓపెన్ సోర్స్ మెటీరియల్స్‌ను అంటే ఇప్పటికే పబ్లిక్‌గా ఉన్న మెటీరియల్స్‌ను ఉపయోగించారు. ఉదాహరణకు.. వర్గీకరించిన పత్రాలు, రక్షణ బడ్జెట్ కేటాయింపు, సైనిక కవాతు, సైనిక అధికారుల ప్రకటనలు. ఇదేకాకుండా పాక్ మిలటరీ గార్రిసన్, ఎయిర్ ఫోర్స్ బేస్‌కు సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలను కూడా విశ్లేషించారు. వివిధ సైనిక దళాలు, వైమానిక దళ స్థావరాలకు సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన తరువాత పాకిస్తాన్ అణ్వాయుధాల కోసం కొత్త లాంచర్ సౌకర్యాలను నిర్మించినట్లు అమెరికా కనుగొంది.

5 నుంచి 10 అణ్వాయుధాలు..
ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ నివేదికలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ ఒకవైపు అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూనే మరోవైపు కొత్త ఆయుధాల కోసం ముడిసరుకును కూడా వేగంగా సేకరిస్తోంది. పాకిస్తాన్ ప్రతి సంవత్సరం 14-27 ఆయుధాలకు సరిపడా ముడిసరుకును సేకరిస్తోంది. కనీసంగా 5 నుండి 10 న్యూక్లియర్ వార్‌హెడ్‌లను ఉత్పత్తి చేస్తోందని నివేదిక అంచనా వేసింది.

అణ్వాయుధాలను ఎక్కడ దాస్తోంది? 
నివేదికలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ తన అణ్వాయుధాలను నిల్వ చేసేందుకు కనీసం 5 సైనిక, వైమానిక స్థావరాలను వినియోగిస్తోంది. ఇందులో అక్రో, గుజ్రాన్‌వాలా, ఖుజ్దార్, పనో అకిల్ మరియు సర్గోధా గారిసన్ ఉన్నాయి. కాగా పాకిస్తాన్ 4 కొత్త ప్లూటోనియం ఉత్పత్తి రియాక్టర్ల కోసం కూడా పని చేస్తోంది. అలాగే యురేనియం రియాక్టర్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటోంది. ఇందుకోసం కొత్త మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఇది పాక్‌ అణు సామర్థ్యాన్ని మరింతగా పెంచుతోంది. 2025 నాటికి పాకిస్తాన్ అణ్వాయుధాల సంఖ్య 200కి చేరుకుంటుందని అంచనా.

పెరిగిపోతున్న పాక్‌ రహస్య కార్యకలాపాలు 
ఈ నివేదికలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బంకర్ ప్రస్తావన కూడా ఉంది. పాకిస్తాన్ తన అణ్వాయుధాలకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. అయితే ఇస్లామాబాద్‌కు సమీపంలోని వా కంటోన్మెంట్ పరిధిలోగల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇందులో కీలక పాత్ర ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా శాస్త్రవేత్తలు ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరుగుతున్న కార్యకలాపాలను చాలా కాలంగా గమనిస్తున్నారు.

2020 నాటికే 60 నుండి 80 అణ్వాయుధాలు
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోపల 6 ఇగ్లూ ఆకారపు బంకర్‌లు ఉన్నాయి. వీటిని చాలా నీట్‌గా కవర్ చేశారు. ఈ బంకర్ల చుట్టూ ఎల్లప్పుడూ బహుళస్థాయి భద్రత ఉంటుంది. ఈ బంకర్లలో అణ్వాయుధాలను దాచి ఉంచినట్లు అమెరికా అనుమానిస్తోంది. 2020 నాటికే పాకిస్తాన్ వద్ద 60 నుండి 80 అణ్వాయుధాలు ఉండవచ్చని అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గతంలోనే అంచనా వేసింది. ఇప్పుడు ఈ తాజా నివేదిక అమెరికన్ ఏజెన్సీలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఇది కూడా చదవండి: లాహోర్‌ భారత్‌లో భాగం.. అయినా పాకిస్తాన్‌కు ఎందుకు అప్పగించారు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement