ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో బడా జట్లకు పసికూనలు షాకిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌ల్లో పెద్ద జట్లపై చిన్న జట్లు హవా చూపాయి.
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం..
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే ఓ మోస్తరు సంచలనం నమోదైంది. తమకంటే పటిష్టమైన కెనడాకు తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్‌ఏ ఊహించని షాకిచ్చింది.
రెండో మ్యాచ్‌లో మరో పసికూన పపువా న్యూ గినియా.. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వెస్టిండీస్‌ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ బతుకు జీవుడా అన్నట్లు చివరి ఓవర్‌లో విజయం సాధించింది.
పసికూనల మధ్య జరిగిన మూడో మ్యాచ్ సైతం నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఒమన్‌పై నమీబియా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.
శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య జరిగిన నాలుగో మ్యాచ్.. ఆఫ్ఘనిస్తాన్-ఉగాండ మధ్య జరిగిన ఐదో మ్యాచ్ అందరూ ఊహించినట్లుగానే జరిగాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు.
స్కాట్లాండ్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఆతర్వాతి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ రద్దు కాకుండా ఉండి ఉంటే ఇందులోనూ సంచలనానికి ఆస్కారం ఉండేది.
నేపాల్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఏడో మ్యాచ్.. భారత్-ఐర్లాండ్ మధ్య జరిగిన ఎనిమిదో మ్యాచ్.. ఆస్ట్రేలియా-ఒమన్ మధ్య జరిగిన తొమ్మిదో మ్యాచ్ అందరూ ఊహించినట్లుగానే ఏకపక్షంగా సాగాయి.
అనంతరం పపువా న్యూ గినియా-ఉగాండ మధ్య జరిగిన పదో మ్యాచ్‌లో ఓ మోస్తరు సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఉగాండ.. పొట్టి ప్రపంచకప్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.
పదకొండో మ్యాచ్ నుంచి పొట్టి ప్రపంచకప్ మరింత రసవత్తరంగా మారింది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్‌ఏ.. తమకంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌ను ఐసీసీ పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో ఘోరమైన అప్‌సెట్‌గా అభివర్ణించింది.
నమీబియా-స్కాట్లాండ్ మధ్య జరిగిన 12వ మ్యాచ్ ఏ హడావుడి లేకుండా సజావుగా సాగగా.. కెనడా-ఐర్లాండ్ మధ్య జరిగిన 13వ మ్యాచ్‌లో మరో సంచలనం నమోదైంది. కెనడా.. తమకంటే పటిష్టమైన ఐర్లాండ్‌కు ఊహించని షాకిచ్చి ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి విజయం నమోదు చేసుకుంది.
నిన్న జరిగిన 14వ మ్యాచ్‌లో మరోసారి సంచలనం నమోదైంది. ఓ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంకను ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని బంగ్లాదేశ్ మట్టికరిపించింది.
నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో క్రికెట్ ప్రపంచం ఊహించని మరో పెను సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్.. తమకంటే చాలా రెట్లు పటిష్టమైన న్యూజిలాండ్‌కు ఊహించని షాకిచ్చింది.
ఇలా ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌ల్లో ఒకటి అరా మినహా దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లో సంచలనాలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. మెగా టోర్నీ ఇలాగే కొనసాగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment