
అమెరికా కసితీర పగతీర్చుకుంది నేడే
న్యూయార్క్: సెప్టెంబర్ 11, 2001.. అమెరికా చరిత్రలో చీకటి రోజు. వారి ప్రతిష్ట అబాసుపాలైన దినం. ప్రపంచ దేశాలన్నింటికి పెద్దన్నగా భావించే ఆ దేశ ముఖ చిత్రంలో చెరిగిపోని ఓ శాశ్వత ముద్ర వేసిన రోజు. చరిత్రలో మాయమవని అక్షరాలు లిఖించబడిన రోజు.. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటిని శాసించగల సత్తా ఉండి కూడా ఒక కరడుగట్టిన ఉగ్రవాది ప్రకోపానికి గురైన రోజు అది.. ఆ ఉగ్రవాది మరెవరో కాదు.. ఒసామా బిన్ లాడెన్. నేడు ఆ లాడెన్ను అమెరికా మట్టుబెట్టిన రోజు.
దాదాపు పదేళ్లపాటు అలుపెరగకుండా అదే కసితో అణువణువుగాలించి చివరకు పాకిస్థాన్లోని అబోటా బాద్లో గుర్తించి తన కసి తీరా లాడెన్ను చంపేసిన రోజు. నేటికి లాడెన్ ను నేల కూల్చి సరిగ్గా ఐదేళ్లు. అమెరికా టవర్స్పై ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత ఈ దాడికి ప్రధాన వ్యూహకర్త అయిన లాడెన్ దాదాపు పదేళ్లపాటు దొరకకుండా అమెరికాను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు పాకిస్థాన్లో అతడి స్థావరాన్ని గుర్తించిన అమెరికా సేనలు ఎంతో జాగ్రత్తగా వ్యూహం పన్నాయి.
పకడ్బందీగా నెప్ట్యూన్ స్పేర్ పేరిట పదేళ్ల అలుపును 40 నిమిషాల వేటతో ముగించారు. లాడెన్ తో సహా అతడి కుమారుడు మరో ముగ్గురు ఉగ్రవాదులు ఈ దాడి ప్రాణాలు విడిచారు. అమెరికాకు చెందిన నేవీ సీల్స్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. అబోటా బాద్లోని లాడెన్ నివాసంపై ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేసి.. లాడెన్ను నేల కూల్చారు. ఈ ఆపరేషన్ మొత్తం లైవ్ను స్వయంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వీక్షించారు. లాడెన్ చనిపోయిన వెంటనే.. 24గంటలు కూడా గడవకముందే అరేబియా సముద్రంలో ముస్లిం మతాచారాల ప్రకారమే ఓ గుర్తు తెలియని చోట పడేశారు.