
నోరు విప్పిన లాడెన్ భార్య.. ఆ రాత్రి ఏమైంది?
న్యూయార్క్: మే 1, 2011 అమెరికాకు శుభదినం.. ఆ దేశ చరిత్రలో వారు సువర్ణక్షరాలుగా కూడా రాసుకొని ఉండి ఉంటారు. ఎందుకంటే తమ దేశ గౌరవాన్ని దెబ్బకొట్టి, వేల మంది తమ పౌరులను బలి తీసుకున్న అల్ కాయిదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టిందే ఆరోజే. ట్విన్ టవర్స్‌ను ఏకంగా విమానంతో ఢీకొట్టించి అమెరికన్ల గుండెల్లో రైల్లు పరుగెత్తించిన ఆ ఉగ్రవాదిని ఎంతో పకడ్బందీగా ప్రణాళిక రచించి గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసి అతడిని అంతమొందించింది ఆ రోజే. అయితే, ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై అన్ని చెప్పుడు కథనాలే తప్ప ఏ ఒక్కరూ ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పలేదు.
అయినప్పటికీ ఈ సంఘటన గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం మిగిలే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని కథనాలు వచ్చినా తాజాగా మాత్రం ఏకంగా లాడెన్ నాలుగో భార్య అమల్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని కాతీ స్కాట్-క్లార్క్, అడ్రియాన్ లెవీ ఇద్దరికి వెల్లడించింది. వీరు లాడెన్ చనిపోవడానికి ముందు ఆ కొద్ది నిమిషాల్లో ఏం జరిగిందనే విషయంపై వీరు ది ఎక్సైల్: ది ఫైట్ ఆఫ్ ఒసామా బిన్ లాడెన్ అనే పేరిట ఓ పుస్తకం రాస్తున్నారు. దీనికి సంబంధించి లాడెన్ భార్యను నేరుగా వారు సంప్రదించగా కొన్ని విషయాలు చెప్పింది. అందులో కొన్ని బ్రిటన్‌లోని సండే టైమ్స్‌లో, ఓ టీవీ చానెల్‌లో ప్రచారం అయ్యాయి. అలా ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఏమిటంటే..
‘ఆ రోజు రాత్రి అమెరికా మిలిటరీకి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌లో అబోటాబాద్‌లోని మా ఇంటి కాంపౌండ్‌లోకి దిగింది. అప్పటికే మేం ఆ ఇంట్లో ఆరేళ్లుగా తలదాచుకుంటున్నాం. హెలికాప్టర్ శబ్దం విని మేల్కొన్న నా భర్త(లాడెన్) ముఖంలో చాలా భయం చూశాను. అమెరికన్ సీల్స్ ఇంటిలోపలికి ప్రవేశిస్తుండగా మా సోదరీలు(లాడెన్ ముగ్గురు భార్యలు) (అమల్ లాడెన్ నాలుగో భార్య) వారి పిల్లలను తీసుకొని ఆయన ఉన్న అప్‌స్టెయిర్స్‌కు వెళ్లి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. అయితే, వారిని అక్కడ ఉండొద్దని, అందరినీ కిందికి వెళ్లిపోవాలని లాడెన్ చెప్పారు. వారికి కావాల్సింది నేను.. మీరు కాదు ఇక్కడి నుంచి వెళ్లిపోండని అన్నారు.
అయితే, మిగితా వారు వెళ్లిపోగా నేను మాత్రం ఆయన పక్కన నా కొడుకు హుస్సేన్‌తో కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నాను. అమెరికా సైనికులు లోపలిక వస్తూ లాడెన్ కుమారుల్లో ఒకరైన ఖలీద్‌ను చంపేస్తూ పిల్లలతో గొడవపడుతూ పైకి వస్తున్నారు. సరిగ్గా మేం ఉన్న గదికి రాగానే నేను వారిని తోసివేసేందుకు ప్రయత్నించాను. కానీ, వారు ఫైరింగ్ స్టార్ట్ చేయగా నా కాలికి తగిలి పక్క గదిలో పడిపోయాను. ఆ తర్వత ఓపిక చేసుకొని తిరిగొచ్చి చూసేసరికి అప్పటికే లాడెన్ చనిపోయి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని నేను నా కొడుకు హుస్సేన్ చూశాడు. అది చూసి నేను నిశ్చేష్టురాలినయ్యాను’ అని వారికి చెప్పిందట. దాంతోపాటు తమకు తెలిసిన వారే ఈ విషయాన్ని వారికి చేరవేసి ఉంటారని, ఆ ఇళ్లే తమకు మృత్యుకుహరం అవుతుందని ఊహించలేకపోయామని కూడా ఆమె చెప్పినట్లు బ్రిటన్ పత్రికలో వెల్లడించారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది.