తాలిబన్లు పట్టు బిగిస్తే భారత్‌కు ఎన్నో సవాళ్లు | Withdrawal of US forces from Afghanistan raises India concern | Sakshi
Sakshi News home page

తాలిబన్లు పట్టు బిగిస్తే భారత్‌కు ఎన్నో సవాళ్లు

Published Sun, Jul 11 2021 2:22 AM | Last Updated on Sun, Jul 11 2021 2:51 AM

Withdrawal of US forces from Afghanistan raises India concern - Sakshi

అమెరికా దళాలు ఇంకా పూర్తిగా వెనక్కి మళ్లనే లేదు  అఫ్గాన్‌లో తాలిబన్లు చెలరేగి దాడులకు దిగుతున్నారు  కీలకమైన ప్రాంతాల్లో పట్టు బిగుస్తున్నారు పాక్‌ సహకారంతో రెచ్చిపోతారని భారత్‌ ఆందోళన చెందుతోంది తాలిబన్ల పట్టు పెరిగితే భారత్‌కు ఎదురయ్యే సవాళ్లేంటి ?   

అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా దళాలు వెనక్కి మళ్లుతూ ఉండడంతో తాలిబన్లు తిరిగి తమ పట్టు పెంచుకుంటున్నారు. ఏకంగా 85% భూభాగం తమ అధీనంలోనే ఉందని ప్రకటించుకున్నారు. ఆగస్టు 31నాటికల్లా అమెరికా దళాలు వెనక్కి పూర్తిగా వెళ్లిపోతే పరిస్థితులు ఎలా మారుతాయోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. భౌగోళికంగా భారత్‌కు అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన అఫ్గాన్‌పై తాలిబన్లు పట్టు బిగిస్తే మన దేశానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అఫ్గానిస్తాన్‌లో 398 జిల్లాలు ఉన్నాయి. ఇరవై ఏళ్ల క్రితమే అందులో 193 జిల్లాల్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. 130 జిల్లాల్లో తాలిబన్లు, అఫ్గాన్‌ ఆర్మీ మధ్య ఘర్షణ జరుగుతోంది. కేవలం 75 జిల్లాలు మాత్రమే ప్రస్తుత ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. తాలిబన్లను ఎంతవరకు అఫ్గాన్‌ ప్రభుత్వం నిలువరిస్తుందనేది సందేహమే.

భారత్‌కు ఎదురయ్యే సవాళ్లు
∙అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల అధీనంలోకి వెళ్లిపోతే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం భారత్‌కు అతి పెద్ద సవాల్‌గా మారుతుంది. సహజంగానే తాలిబన్లు, పాకిస్తాన్‌ ఒకరికొకరు సహకారం అందించుకుంటారు. దీంతో పరిస్థితులన్నీ పాక్‌కి అనుకూలంగా మారే అవకాశం ఉంది. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతాయన్న ఆందోళన నెలకొంది.

 హింసతో రగిలిపోతున్న అఫ్గాన్‌లో శాంతి స్థాపన కోసం చాలా ఏళ్లుగా భారత్‌ కృషి చేస్తోంది. ఆ దేశానికి అండగా ఉంటూ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు అవన్నీ కాపాడుకోవడం మన దేశానికి మరో గట్టి సవాల్‌గా మారుతుంది. గత కొద్ది ఏళ్లలో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భారత్‌ అఫ్గాన్‌లో 2,200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. గత ఏడాదే కేంద్ర ప్రభుత్వం మరో రూ.600 కోట్లు పెడతామని ప్రకటించింది. మన దేశానికి చెందిన ఇంజనీర్లు 3 వేల మందికిపైగా అక్కడ అభివృద్ధి పనుల్లో ఉన్నారు. కానీ తాలిబన్లు మళ్లీ రెచ్చిపోతే భారత్‌ పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. భారతీయుల ప్రాణాలు ముప్పులో పడే అవకాశం ఉంది.

∙అఫ్గాన్‌పై పట్టు నిలుపుకోవడం కూడా మరో సవాలే. భారత్‌కి పొరుగుదేశమైన అఫ్గాన్‌ వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగింది. వాస్తవానికి ఆ దేశంలో సహజ వనరులు, సారవంతమైన నేలలు, చమురు, యురేనియం వంటి సహజ నిక్షిప్తాలు ఏమీ లేకపోయినప్పటికీ భౌగోళికంగా అత్యంత కీలకమైనది. ఆసియాలోని వాణిజ్య రవాణాకు అఫ్గానే కేంద్రంగా ఉంది. చైనా వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్డు ప్రణాళికలో అఫ్గాన్‌ చాలా ముఖ్యమైనది. అందుకే చైనా అఫ్గాన్‌పై పట్టు పెంచుకోవాలని భావిస్తుంది. పాకిస్తాన్‌ అండతో డ్రాగన్‌ దేశం అఫ్గాన్‌ నుంచి లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తుంది. దీంతో చైనా, పాక్‌ చేసే కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కోవడం భారత్‌కు అతి పెద్ద సవాల్‌ విసురుతుంది.

అమెరికా ఎందుకు వెనక్కి మళ్లుతోంది ?
అమెరికాపై సెప్టెంబర్‌ 11, 2001 దాడుల తర్వాత అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ అఫ్గాన్‌లో తలదాచుకున్నాడన్న సమాచారంతో అగ్రరాజ్యం తన బలగాలను పంపింది. ఈ 20 ఏళ్లలోనూ దాదాపుగా 2 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. కానీ హఠాత్తుగా వెనక్కి మళ్లాలని నిర్ణయించింది. గత ఏడాది దోహాలో అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బలగాలను ఉపసంహరిస్తోంది. అమెరికా అధీనంలో ఉన్న ప్రాంతాల్లో అల్‌ఖైదా కార్యకలాపాలు కొనసాగించకూడదన్న ఒకే ఒక్క షరతుతో అమెరికా వెనక్కి వెళ్లిపోతోంది.

దశాబ్దాల క్రితం సోవియెట్‌ యూనియన్‌ను బలహీనపరచడానికి తాలిబన్లను అమెరికాయే పెంచి పోషించింది. వారికి క్షిపణుల్ని కూడా సరఫరా చేసింది. ఆ తర్వాత తమ దేశంపైనే ఉగ్రవాదులు దాడులు జరపడంతో ఉలిక్కిపడి స్వప్రయోజనాల కోసం తాలిబన్లను నిలువరించింది. ఇప్పుడు మళ్లీ తమకి లబ్ధి చేకూరే నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను ముప్పులోకి నెట్టేస్తోంది. ఇప్పటికే తాలిబన్లు జరిపే దాడులతో వందలాది మంది అఫ్గాన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. తాలిబన్ల క్రూరత్వం చూడకుండా పెరిగిన యువతీయువకుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. మధ్య ఆసియాలోకి ప్రవేశిస్తారని రష్యా ఆందోళన చెందుతూ ఉంటే, ఇరాన్‌ తమ దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని భయపడుతోంది.

ఎవరీ తాలిబన్లు
1990 తొలినాళ్లలో అఫ్గానిస్తాన్‌ నుంచి సోవియెట్‌ దళాలు వెనక్కి మళ్లాక ఉత్తర పాకిస్తాన్‌ ప్రాంతంలో ఆదివాసీల హక్కుల కోసం తాలిబన్ల ఉద్యమం మొదలైంది. అతివాద సున్నీ మతాన్ని బోధించే మత సంస్థల్లో తాలిబన్లు తొలుత పట్టు బిగించారు. ఈ సంస్థలకు సౌదీ అరేబియా నుంచి విరాళాలు వచ్చేవి. అలా నెమ్మది నెమ్మదిగా అఫ్గాన్‌పై పట్టు బిగించి 1995లో పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అవినీతి నిర్మూలన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, తమ అదీనంలో ఉన్న ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగు పరచడం వంటి పనులతో మొదట్లో తాలిబన్లకు ప్రజాదరణ లభించింది.

అదే సమయంలో కఠినమైన శిక్షల్ని విధించడం, నేరస్తుల్ని బహిరంగంగా ఉరి తీయడం, మహిళలు సినిమాలు చూడకూడదని, చదువుకోకూడదని విధించిన ఆంక్షలు వారిపై వ్యతిరేకత పెంచాయి. ఇప్పుడు మళ్లీ తాలిబన్లు వస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన అఫ్గాన్‌ మహిళల్లో కూడా నెలకొంది. తాలిబన్లు మళ్లీ పట్టు బిగిస్తే అఫ్గాన్‌లో అంతర్యుద్ధం నెలకొని ప్రపంచ దేశాలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనన్న చర్చ కూడా జరుగుతోంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement