Alkhaida terrorist organization
-
జవహరీ హతం.. అమెరికన్లూ జాగ్రత్త! బైడెన్ సర్కారు అధికారిక ప్రకటన
వాషింగ్టన్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీ హత్య తర్వాత అమెరికన్లపై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రసంస్థలు, సానుభూతిపరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరులు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశముందని చెప్పింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అమెరికన్లు, మున్ముందు విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునే పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉగ్రసంస్థలు వివిధ దేశాల్లో దాడులకు పాల్పడే అవకాశముందని ప్రస్తుతం తమకు అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోందని విదేశాంగ శాఖ చెప్పింది. ఆత్మాహుతి దాడులు, హత్యలు, కిడ్నాప్‌లు, బాంబుపేలుళ్లు ఇలా ఏ రూపంలోనైనా ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించవచ్చని చెప్పింది. పరిస్థితిని అర్థం చేసుకుని అమెరికన్లంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అల్ జవహరీని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చింది. కాబూల్ ఓ ఇంట్లో తలదాచుకున్న అతడిపై డ్రోన్లతో క్షిపణి దాడులు చేసి అంతం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. జవహరీ మృతితో 9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. మరోవైపు ఈ దాడిని తాలిబన్లు ఖండించారు. అమెరికా అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమించిందని, 2000 సంవత్సరంలో కుదిరిన ఒప్పందాలను విస్మరించిందని ఆరోపించారు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
Al Zawahiri: అల్‌ఖైదా చీఫ్ హతంపై బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: డ్రోన్ దాడితో అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా ముట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివెేళ్లతో పెకలించివేయవచ్చు అనేందుకు జవహరి ఘటనే నిదర్శనమన్నారు. అతని మృతితో 9/11 దాడుల బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే ఒక్క పౌరుని ప్రాణాలకు కూడా హాని లేకుండా జవహరిని అంతం చేసినందుకు అధ్యక్షుడు జో బైడెన్ పాలనాయంత్రాంగంపై ప్రశంసల వర్షం కురిపించారు ఒబామా. ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా కృషి చేసిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు. More than 20 years after 9/11, one of the masterminds of that terrorist attack and Osama bin Laden’s successor as the leader of al-Qaeda – Ayman al-Zawahiri – has finally been brought to justice. — Barack Obama (@BarackObama) August 2, 2022 కాబూల్‌లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓ ఇంట్లో ఉన్న అల్ జవహరి బాల్కనీలోకి వచ్చినప్పుడు డ్రోన్లతో క్షిపణిదాడులు చేసింది అమెరికా. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. జో బైడెన్ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. అతని మృతితో 9/11 ఘటన బాధితుల కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన నిఘా వర్గాలను కొనియాడారు. 9/11 ఘటన అనంతరం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఆఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాల పాటు యుద్ధం చేశాయి అమెరికా బలగాలు. అఫ్గాన్ సైన్యానికి కూడా శిక్షణ ఇచ్చాయి. అయితే గతేడాదే అమెరికా బలగాలను ఉపసంహరించారు జో బైడెన్. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని ఒబామా అన్నారు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
తాలిబన్లు పట్టు బిగిస్తే భారత్‌కు ఎన్నో సవాళ్లు
అమెరికా దళాలు ఇంకా పూర్తిగా వెనక్కి మళ్లనే లేదు అఫ్గాన్‌లో తాలిబన్లు చెలరేగి దాడులకు దిగుతున్నారు కీలకమైన ప్రాంతాల్లో పట్టు బిగుస్తున్నారు పాక్ సహకారంతో రెచ్చిపోతారని భారత్ ఆందోళన చెందుతోంది తాలిబన్ల పట్టు పెరిగితే భారత్‌కు ఎదురయ్యే సవాళ్లేంటి ? అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి మళ్లుతూ ఉండడంతో తాలిబన్లు తిరిగి తమ పట్టు పెంచుకుంటున్నారు. ఏకంగా 85% భూభాగం తమ అధీనంలోనే ఉందని ప్రకటించుకున్నారు. ఆగస్టు 31నాటికల్లా అమెరికా దళాలు వెనక్కి పూర్తిగా వెళ్లిపోతే పరిస్థితులు ఎలా మారుతాయోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. భౌగోళికంగా భారత్‌కు అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన అఫ్గాన్‌పై తాలిబన్లు పట్టు బిగిస్తే మన దేశానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అఫ్గానిస్తాన్‌లో 398 జిల్లాలు ఉన్నాయి. ఇరవై ఏళ్ల క్రితమే అందులో 193 జిల్లాల్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. 130 జిల్లాల్లో తాలిబన్లు, అఫ్గాన్ ఆర్మీ మధ్య ఘర్షణ జరుగుతోంది. కేవలం 75 జిల్లాలు మాత్రమే ప్రస్తుత ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. తాలిబన్లను ఎంతవరకు అఫ్గాన్ ప్రభుత్వం నిలువరిస్తుందనేది సందేహమే. భారత్‌కు ఎదురయ్యే సవాళ్లు ∙అఫ్గానిస్తాన్ తాలిబన్ల అధీనంలోకి వెళ్లిపోతే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం భారత్‌కు అతి పెద్ద సవాల్‌గా మారుతుంది. సహజంగానే తాలిబన్లు, పాకిస్తాన్ ఒకరికొకరు సహకారం అందించుకుంటారు. దీంతో పరిస్థితులన్నీ పాక్‌కి అనుకూలంగా మారే అవకాశం ఉంది. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతాయన్న ఆందోళన నెలకొంది. హింసతో రగిలిపోతున్న అఫ్గాన్‌లో శాంతి స్థాపన కోసం చాలా ఏళ్లుగా భారత్ కృషి చేస్తోంది. ఆ దేశానికి అండగా ఉంటూ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు అవన్నీ కాపాడుకోవడం మన దేశానికి మరో గట్టి సవాల్‌గా మారుతుంది. గత కొద్ది ఏళ్లలో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భారత్ అఫ్గాన్‌లో 2,200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. గత ఏడాదే కేంద్ర ప్రభుత్వం మరో రూ.600 కోట్లు పెడతామని ప్రకటించింది. మన దేశానికి చెందిన ఇంజనీర్లు 3 వేల మందికిపైగా అక్కడ అభివృద్ధి పనుల్లో ఉన్నారు. కానీ తాలిబన్లు మళ్లీ రెచ్చిపోతే భారత్ పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. భారతీయుల ప్రాణాలు ముప్పులో పడే అవకాశం ఉంది. ∙అఫ్గాన్‌పై పట్టు నిలుపుకోవడం కూడా మరో సవాలే. భారత్‌కి పొరుగుదేశమైన అఫ్గాన్ వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగింది. వాస్తవానికి ఆ దేశంలో సహజ వనరులు, సారవంతమైన నేలలు, చమురు, యురేనియం వంటి సహజ నిక్షిప్తాలు ఏమీ లేకపోయినప్పటికీ భౌగోళికంగా అత్యంత కీలకమైనది. ఆసియాలోని వాణిజ్య రవాణాకు అఫ్గానే కేంద్రంగా ఉంది. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్డు ప్రణాళికలో అఫ్గాన్ చాలా ముఖ్యమైనది. అందుకే చైనా అఫ్గాన్‌పై పట్టు పెంచుకోవాలని భావిస్తుంది. పాకిస్తాన్ అండతో డ్రాగన్ దేశం అఫ్గాన్ నుంచి లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తుంది. దీంతో చైనా, పాక్ చేసే కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కోవడం భారత్‌కు అతి పెద్ద సవాల్ విసురుతుంది. అమెరికా ఎందుకు వెనక్కి మళ్లుతోంది ? అమెరికాపై సెప్టెంబర్ 11, 2001 దాడుల తర్వాత అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అఫ్గాన్‌లో తలదాచుకున్నాడన్న సమాచారంతో అగ్రరాజ్యం తన బలగాలను పంపింది. ఈ 20 ఏళ్లలోనూ దాదాపుగా 2 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. కానీ హఠాత్తుగా వెనక్కి మళ్లాలని నిర్ణయించింది. గత ఏడాది దోహాలో అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బలగాలను ఉపసంహరిస్తోంది. అమెరికా అధీనంలో ఉన్న ప్రాంతాల్లో అల్‌ఖైదా కార్యకలాపాలు కొనసాగించకూడదన్న ఒకే ఒక్క షరతుతో అమెరికా వెనక్కి వెళ్లిపోతోంది. దశాబ్దాల క్రితం సోవియెట్ యూనియన్ను బలహీనపరచడానికి తాలిబన్లను అమెరికాయే పెంచి పోషించింది. వారికి క్షిపణుల్ని కూడా సరఫరా చేసింది. ఆ తర్వాత తమ దేశంపైనే ఉగ్రవాదులు దాడులు జరపడంతో ఉలిక్కిపడి స్వప్రయోజనాల కోసం తాలిబన్లను నిలువరించింది. ఇప్పుడు మళ్లీ తమకి లబ్ధి చేకూరే నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను ముప్పులోకి నెట్టేస్తోంది. ఇప్పటికే తాలిబన్లు జరిపే దాడులతో వందలాది మంది అఫ్గాన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. తాలిబన్ల క్రూరత్వం చూడకుండా పెరిగిన యువతీయువకుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. మధ్య ఆసియాలోకి ప్రవేశిస్తారని రష్యా ఆందోళన చెందుతూ ఉంటే, ఇరాన్ తమ దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని భయపడుతోంది. ఎవరీ తాలిబన్లు 1990 తొలినాళ్లలో అఫ్గానిస్తాన్ నుంచి సోవియెట్ దళాలు వెనక్కి మళ్లాక ఉత్తర పాకిస్తాన్ ప్రాంతంలో ఆదివాసీల హక్కుల కోసం తాలిబన్ల ఉద్యమం మొదలైంది. అతివాద సున్నీ మతాన్ని బోధించే మత సంస్థల్లో తాలిబన్లు తొలుత పట్టు బిగించారు. ఈ సంస్థలకు సౌదీ అరేబియా నుంచి విరాళాలు వచ్చేవి. అలా నెమ్మది నెమ్మదిగా అఫ్గాన్‌పై పట్టు బిగించి 1995లో పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అవినీతి నిర్మూలన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, తమ అదీనంలో ఉన్న ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగు పరచడం వంటి పనులతో మొదట్లో తాలిబన్లకు ప్రజాదరణ లభించింది. అదే సమయంలో కఠినమైన శిక్షల్ని విధించడం, నేరస్తుల్ని బహిరంగంగా ఉరి తీయడం, మహిళలు సినిమాలు చూడకూడదని, చదువుకోకూడదని విధించిన ఆంక్షలు వారిపై వ్యతిరేకత పెంచాయి. ఇప్పుడు మళ్లీ తాలిబన్లు వస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన అఫ్గాన్ మహిళల్లో కూడా నెలకొంది. తాలిబన్లు మళ్లీ పట్టు బిగిస్తే అఫ్గాన్‌లో అంతర్యుద్ధం నెలకొని ప్రపంచ దేశాలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనన్న చర్చ కూడా జరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ ఉగ్ర గ్రూపులకు పాకిస్తానీలే బాస్‌లు
ఐక్యరాజ్యసమితి: భారత ఉపఖండంలో కార్యకలాపాలు సాగిస్తున్న అల్‌కాయిదా వంటి ఉగ్ర సంస్థలకు పాకిస్తానీ జాతీయులే నాయకత్వం వహిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవాంట్–ఖొరాసాన్ (ఐఎస్ఐఎల్–కె), తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) తదితర ఉగ్రసంస్థల నేతల పేర్లను ఆంక్షల జాబితాలో చేర్చలేదని తెలిపింది. ఐఎస్ఐఎల్, అల్‌కాయిదా, వాటి అనుబంధ వ్యక్తులు, ఆస్తులపై ఐరాస ఏర్పాటు చేసిన ఆంక్షల సమీక్ష కమిటీ ఈ విషయాలు వెల్లడించింది. ఐఎస్ఐఎల్–కె అధిపతి అస్లాం ఫరూఖీ అలియాస్ అబ్దుల్లా ఒరాక్జాయ్‌తోపాటు మాజీ అధినేత జియా ఉల్హక్ అలియాస్ అబూ ఒమర్ ఖొరాసానీ, అల్‌కాయిదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్) నేత ఒసామా మహ్మూద్ కూడా పాకిస్తాన్‌కు చెందిన వారేననీ,వీరి పేర్లు ఆంక్షల జాబితాలో లేవని ఆ నివేదిక పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లోని అతిపెద్ద ఉగ్ర ముఠా టీటీపీ చీఫ్ అమిర్ నూర్ వలీ మెహ్సూద్ కూడా పాకిస్తాన్‌కు చెందిన వాడేనని తెలిపింది. -
బిన్ లాడెన్ కుమారుడు హతం!
వాషింగ్టన్: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్‌కాయిదా కీలక నేత హమ్జా వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు. హమ్జా మరణించినట్లు ముగ్గురు అమెరికా అధికారులు స్పష్టం చేశారని, అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయాలను వారు వెల్లడించలేదని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. దీని వెనుక అమెరికా హస్తం ఉందా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. గత రెండేళ్లుగా సాగుతున్న ఓ ఆపరేషన్‌లో భాగంగా హమ్జా హతమైనట్లు న్యూయార్క్ టైమ్స్ కూడా చెప్పింది. ఎన్బీసీ కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అంగీకరించలేదు.. కనీసం ఖండిం చనూ లేదు. అల్‌కాయిదాలో కీలక నేతగా ఎదుగుతున్న హమ్జాను పట్టించిన వారికి దాదాపు రూ.7 కోట్లు బహుమతిగా ఇస్తామని 2019 ఫిబ్రవరిలో అమెరికా ప్రకటించడానికి ముందే అతడు మరణించినట్లు ఎన్బీసీ, న్యూయార్క్ టైమ్స్ కథనాలను బట్టి తెలుస్తోంది. లాడెన్ 20 మంది సంతానంలో 15వ కుమారుడైన హమ్జా.. లాడెన్ మూడో భార్య కొడుకు. కాగా, హమ్జాకు 30 ఏళ్ల వయసున్నట్లు భావిస్తున్నారు. జిహాద్‌కు పట్టపు యువరాజుగా పేర్కొంటున్న హమ్జా.. అమెరికాపై దాడులు చేయాల్సిందిగా తరచూ వీడియోలు, ఆడియోల రూపంలో పిలుపునిస్తూ ఉండేవాడు. తన తండ్రి లాడెన్‌ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేవాడు. హమ్జా ఎక్కడున్నాడనే విషయం అధికారికంగా తెలియకపోయినప్పటికీ ఇరాన్లో గృహనిర్బంధంలో ఉన్నాడని, అఫ్గానిస్తాన్‌లో ఉన్నాడని, పాకిస్తాన్, సిరియాలో తలదాచుకునే వాడని భావిస్తూ ఉండేవారు. లాడెన్‌ను 2011లో మట్టుబెట్టిన అనంతరం అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్ల ఆధారంగా అల్‌కాయిదాను ముందుండి నడిపేందుకు హమ్జాను జాగ్రత్తగా పెంచుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. -
కర్ణాటకలో హై అలర్ట్
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు, మంగళూరు, మైసూరులో హై అలర్ట్ ప్రకటించింది. కాశ్మీర్ కోసం ఢిల్లీ, కొలకత్తా, బెంగళూరుపై దాడులు చేయాలని ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా పిలుపు ఇచ్చినట్టు సమాచారం. దీంతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సూచనల మేరకు రాష్ట్ర పోలీసులు మూడు నగరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్ కోసం భారత దేశం ఆ రాష్ట్రం చుట్టూ 60 వేల మంది సైనికులను కాపలాగా ఉంచింది. మనం ఆ దేశంలో ముఖ్య పట్టణాలైన ఢిల్లీ, కొలకత్తా, బెంగళూరుపై దాడులు చేయాలి. అప్పుడు మన సత్తా వారికి అర్థమవుతుంది.... అని ఆల్‌ఖైదా ముఖ్యనాయకుడైన ఉసామా మహ్మద్ చెప్పిన వాఖ్యలు సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూడు నగరాల్లో ఒకటి దేశ రాజధాని కాగా, మరొకటైన బెంగళూరు ఐటీ రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న నగరం. ఇక బంగ్లాదేశ్ మీదుగా భారత దేశంలోకి ప్రవేశించడానికి కోల్కత్తా అత్యంత అనుకూలమైనది. ఈ నేపథ్యంలో ఆల్‌ఖైదా వాఖ్యల పట్ల నిర్లక్ష్యం వహించే పరిస్థితి లేదని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. కర్ణాటక విషయమే తీసుకుంటే గత పది రోజులుగా రాచనగర మైసూరుకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మైసూరు ప్యాలెస్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నిఘాను పెంచారు. రెండు రోజుల ముందు మైసూరులో బాంబులాంటి వస్తువు తీవ్ర కలకలం సృష్టించిన విషయం ఇక్కడ ప్రస్తావనర్హం. ఇక న్యూఇయర్ సందర్భంగా బెంగళూరులో ఎంజీరోడ్, బ్రిగెడ్‌రోడ్, చర్చ్‌స్ట్రీట్ తదితర చోట్ల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరతారు. దీంతో అక్కడ మారణహోమం సృష్టించడానికి అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 2014 డిసెంబర్ నాటి చర్చ్‌స్ట్రీట్ ఘటనను వారు ఉదహరిస్తున్నారు. ఇక రేవు నగరమైన మంగళూరు ద్వారా కర్ణాటకలో ప్రవేశించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు నగరాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఉగ్రవాద ఆరోపణల పై రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న వారిని విచారిస్తున్న పోలీసులు వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇక తరుచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై న్యూ ఇయర్ ఉత్సవాలు ముగిసేంత వరకూ నిఘా పెంచిన పోలీసులు వారి రోజు వారి కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇక నగరంలోని కౌంటర్ టెర్రరిజం బృందం కూడా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనడానికైనా సిద్ధంగా ఉండాలని నిఘా వర్గాల నుంచి ఆదేశాలు అందాయని సమాచారం. ఇలా ఒక వైపు ఆల్‌ఖైదా హెచ్చరికలు, మరోవైపు న్యూ ఇయర్ ఉత్సవాల సందర్భంగా కర్ణాటకలో ముఖ్యనగరాలైన బెంగళూరు, మంగళూరు, మైసూరులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. -
సిమి ఉగ్రవాదులకు బెయిల్ మంజూరు
సిటీబ్యూరో: అఫ్ఘనిస్తాన్‌లో ఆల్‌ఖైదా ఉగ్రవాద సం స్థలో శిక్షణ పొందేం దుకు వెళ్లే క్రమంలో నగరానికి వచ్చి పోలీసులకు పట్టుబడిన సిమి ఉగ్రవాదులు సాముదసిర్ అలియాస్ తల్హా (25), షోయబ్ అహ్మద్ ఖాన్ (24)లకు బుధవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల విలువ గల రెండు షూరిటీలు సమర్చించాలని కోర్టు ఆదేశించింది. షూరిటీ ఇచ్చే వ్యక్తులు హైదరాబాద్‌కు చెందిన వారై ఉండి వారిపై ఎలాంటి కేసులు, నేరచరిత్ర ఉండకూడదని సూచించింది. గురువారం నిందితుల తరపున షూరిటీలు సమర్పిస్తే చంచల్‌గూడ జైలులో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు డుదలవుతారు. కాగా నిందితులను అరెస్టు చేసి సకాలంలో చార్జిషీటు వేయడంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) అధికారులు విఫలం కావడం వల్లనే ఉగ్రవాదులిద్దరూ జైలు నుంచి విడుదల కావడానికి మార్గం ఏర్పడిందనే విమర్శలున్నాయి. తీవ్రమైన ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన వ్యక్తుల అరెస్టు, చార్జిషీట్ విషయంలో పోలీసులు మరింత శ్రద్ధకనబర్చి ఉండాల్సిందని అంటున్నారు.