సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు, మంగళూరు, మైసూరులో హై అలర్ట్ ప్రకటించింది. కాశ్మీర్ కోసం ఢిల్లీ, కొలకత్తా, బెంగళూరుపై దాడులు చేయాలని ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా పిలుపు ఇచ్చినట్టు సమాచారం. దీంతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సూచనల మేరకు రాష్ట్ర పోలీసులు మూడు నగరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
కశ్మీర్ కోసం భారత దేశం ఆ రాష్ట్రం చుట్టూ 60 వేల మంది సైనికులను కాపలాగా ఉంచింది. మనం ఆ దేశంలో ముఖ్య పట్టణాలైన ఢిల్లీ, కొలకత్తా, బెంగళూరుపై దాడులు చేయాలి. అప్పుడు మన సత్తా వారికి అర్థమవుతుంది.... అని ఆల్‌ఖైదా ముఖ్యనాయకుడైన ఉసామా మహ్మద్ చెప్పిన వాఖ్యలు సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూడు నగరాల్లో ఒకటి దేశ రాజధాని కాగా, మరొకటైన బెంగళూరు ఐటీ రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న నగరం. ఇక బంగ్లాదేశ్ మీదుగా భారత దేశంలోకి ప్రవేశించడానికి కోల్‌కత్తా అత్యంత అనుకూలమైనది. ఈ నేపథ్యంలో ఆల్‌ఖైదా వాఖ్యల పట్ల నిర్లక్ష్యం వహించే పరిస్థితి లేదని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.
కర్ణాటక విషయమే తీసుకుంటే గత పది రోజులుగా రాచనగర మైసూరుకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మైసూరు ప్యాలెస్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నిఘాను పెంచారు. రెండు రోజుల ముందు మైసూరులో బాంబులాంటి వస్తువు తీవ్ర కలకలం సృష్టించిన విషయం ఇక్కడ ప్రస్తావనర్హం. ఇక న్యూఇయర్ సందర్భంగా బెంగళూరులో ఎంజీరోడ్, బ్రిగెడ్‌రోడ్, చర్చ్‌స్ట్రీట్ తదితర చోట్ల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరతారు. దీంతో అక్కడ మారణహోమం సృష్టించడానికి అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 2014 డిసెంబర్ నాటి చర్చ్‌స్ట్రీట్ ఘటనను వారు ఉదహరిస్తున్నారు.
ఇక రేవు నగరమైన మంగళూరు ద్వారా కర్ణాటకలో ప్రవేశించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు నగరాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఉగ్రవాద ఆరోపణల పై రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న వారిని విచారిస్తున్న పోలీసులు వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇక తరుచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై న్యూ ఇయర్ ఉత్సవాలు ముగిసేంత వరకూ నిఘా పెంచిన పోలీసులు వారి రోజు వారి కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇక నగరంలోని కౌంటర్ టెర్రరిజం బృందం కూడా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనడానికైనా సిద్ధంగా ఉండాలని నిఘా వర్గాల నుంచి ఆదేశాలు అందాయని సమాచారం. ఇలా ఒక వైపు ఆల్‌ఖైదా హెచ్చరికలు, మరోవైపు న్యూ ఇయర్ ఉత్సవాల సందర్భంగా కర్ణాటకలో ముఖ్యనగరాలైన బెంగళూరు, మంగళూరు, మైసూరులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment